Share News

Corruption : ప్రెస్‌ వాళ్లకు ఇవ్వాలయ్యా..!

ABN , Publish Date - Dec 13 , 2024 | 12:12 AM

అక్రమ కట్టడాలను అడ్డుకోవాల్సిన ఆ అధికారి.. వాటిని ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఏ భవంతి వద్దకు వెళ్లినా ఆయన ‘ప్రెస్‌’ను వాడుకుంటున్నారు. ఇంతింత వసూళ్లు ఎందుకు..? అని ఎవరైనా అడిగితే.. ‘ప్రెస్‌ వాళ్లకు ఇవ్వాలయ్యా..’ అని చెబుతారు. నగరపాలిక టౌన ప్లానింగ్‌ విభాగంలో పనిచేస్తున్న ఆ ఉన్నతాధికారి వసూళ్ల పర్వానికి హద్దు లేకుండాపోయిందని అంటున్నారు. నగరంలో అక్రమ కట్టడాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. టౌనప్లానింగ్‌ ఉన్నతాధికారిగా వాటిపై ఆయన ...

Corruption : ప్రెస్‌ వాళ్లకు ఇవ్వాలయ్యా..!
Allegations of evasion of betterment charges for this building

నగర పాలికలో ఓ అధికారి దందా

అక్రమ భవన నిర్మాణదారులే టార్గెట్‌

50 రోజులలో రూ.25 లక్షల వసూలు..?

వాటాలతో ఉన్నతాధికారుల నోటికి తాళం

అనంతపురం క్రైం, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): అక్రమ కట్టడాలను అడ్డుకోవాల్సిన ఆ అధికారి.. వాటిని ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఏ భవంతి వద్దకు వెళ్లినా ఆయన ‘ప్రెస్‌’ను వాడుకుంటున్నారు. ఇంతింత వసూళ్లు ఎందుకు..? అని ఎవరైనా అడిగితే.. ‘ప్రెస్‌ వాళ్లకు ఇవ్వాలయ్యా..’ అని చెబుతారు. నగరపాలిక టౌన ప్లానింగ్‌ విభాగంలో పనిచేస్తున్న ఆ ఉన్నతాధికారి వసూళ్ల పర్వానికి హద్దు లేకుండాపోయిందని అంటున్నారు. నగరంలో అక్రమ కట్టడాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. టౌనప్లానింగ్‌ ఉన్నతాధికారిగా వాటిపై ఆయన చర్యలు తీసుకోవాలి. కానీ ముడుపులు పుచ్చుకుంటున్నారు. సెట్‌బ్యాక్స్‌, డీవియేషన, అదనపు అంతస్తులు, 14 శాతం బెటర్‌మెంట్‌ చార్జెస్‌ చెల్లించని వారిని టార్గెట్‌ చేస్తున్నారు. ఎక్కువగా అలాంటి భవనాలపైనే దృష్టి


పెడుతున్నారు. నిబంధనలను అతిక్రమించినందుకు గతంలో పనిచేసిన అధికారులకు ముడుపులు చెల్లించినా.. మళ్లీ ఈయనకు చెల్లించాల్సి వస్తోందట. గతంలో ఇక్కడ పనిచేసిన ఆ అధికారి బాగానే వెనకేసుకున్నారు. ఇప్పుడూ అదే పంథా కొనసాగిస్తున్నారు. నగరపాలిక ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఎవరి వాటా వారికి ఇచ్చేస్తున్నారని, అందుకే ఉన్నతాధికారులు మౌనంగా ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఆ సీటులోకి వచ్చిన తక్కువ కాలంలోనే భారీగా సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. లైసెన్సడ్‌ టెక్నికల్‌ పర్సన్స (ఎల్‌టీపీ) నుంచి ఆయనకు డబ్బు ముడుతోందని సమాచారం. కేవలం 50 రోజుల్లో పాతిక లక్షలు వసూలు చేసినట్లు తెలిసింది. మరో ఏడాది ఆయనే కొనసాగినా ఆశ్చర్యపోనవసరం లేదని నగరపాలిక వర్గాలు అంటున్నాయి.

ఎవరినీ వదలడు..

నగరంలో అక్రమ నిర్మాణాలు జరిగేచోట ఆ అధికారి వాలిపోతున్నారు. ఆదాయం వచ్చే ఏ బిల్డింగ్‌నూ ఆయన వదలడం లేదు. అక్రమ కట్టడం కనిపిస్తే పండుగ చేసుకుంటున్నారు.‘ప్రె్‌సవాళ్లకు ఇవ్వాలి..’ అని విలేకరుల పేరిట ఆయన వసూలు చేస్తున్నట్లు సమాచారం.

- ఫెర్రర్‌ నగర్‌ ప్రధాన రహదారిలో ఓ భవనాన్ని నిర్మిస్తున్నారు. నగరపాలికకు 14శాతం బెటర్‌మెంట్‌ చార్జెస్‌ కింద చెల్లించాల్సిన రూ.60 లక్షలను భవన యజమానులు ఎగవేశారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిన టౌనప్లానింగ్‌ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అక్కడ కూడా సార్‌ కొంత పిండినట్లు సమాచారం.

- సుభాష్‌ రోడ్డులోని సత్య షోరూమ్‌ సమీపంలో ఓ భవంతి నిర్మాణ దశలో ఉంది. యజమానుల నుంచి రూ.2లక్షలు పుచ్చుకున్నట్లు సమాచారం.

- సప్తగిరి సర్కిల్‌ సమీపంలోని ఓ జ్యువెలరీ షోరూమ్‌ ఎదురుగా భవనాన్ని నిర్మిస్తున్నారు. వారి నుంచి రూ.3లక్షలకు పైగా తీసుకున్నారని తెలిసింది.

- అరవింద నగర్‌లో సెల్లార్‌ తవ్వినందుకు రూ.2 లక్షలు, రామ్‌నగర్‌, శ్రీనగర్‌కాలనీలో పరిధిలో రూ.5 లక్షలకు పైగా వసూలు చేసినట్లు తెలిసింది. వీటిలో 90 శాతం ప్రెస్‌ పేరు చెప్పుకుని వసూలు చేసినవే కావడం గమనార్హం.

- గతంలో తాను పని చేసిన సమయంలో ముడుపులు ఇవ్వకుండా తప్పించుకున్న ఎల్‌టీపీలనూ ఆయన వదల్లేదట. పాత భవంతుల వసూళ్లను ముక్కు పిండి లాక్కున్నట్లు సమాచారం. ఆయన ఫైల్స్‌ చూడటంలో కీలకంగా పనిచేస్తున్న ఓ ప్లానింగ్‌ సెక్రటరీ కొత్త బిల్డింగ్‌ కట్టించే ఎల్‌టీపీలకు నేరుగా ఫోన చేస్తాడట. సార్‌కు ఇవ్వాల్సింది ఇవ్వమని..!

పైవారికీ వాటా..!

అవినీతిమయమైన టౌనప్లానింగ్‌ అధికారులపై నగరపాలిక ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. నగరపాలికలో కీలకంగా వ్యవహరించాల్సిన ఓ ఉన్నతాధికారికి ఈ టౌనప్లానింగ్‌ అధికారి నుంచి వాటా వెళుతున్నట్లు సమాచారం. ఎల్‌టీపీఎల నుంచి కూడా ఆయనకు ముడుపులు ముడుతాయట. ఆ ఉన్నతాధికారి పేషీలో పనిచేసే ఓ ఉద్యోగి (టౌనప్లానింగ్‌కు అనుబంధం) నుంచే ఫోన్లు వెళ్తున్నాయట. దీంతో అటు టౌనప్లానింగ్‌ అధికారికి, ఇటు ఉన్నతాధికారికీ ఇవ్వాల్సి వస్తోందని, ఎన్నాళ్లో ఇలా అని బాధితులు తలలు గోక్కుంటున్నారట.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 13 , 2024 | 12:12 AM