Share News

TIDCO HOMES : ఇది తప్పు జగన..!

ABN , Publish Date - May 08 , 2024 | 12:30 AM

సొంతిల్లు..! ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే ఆస్తి..! ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ఆలయం..! చిన్నపాటి గుడిసె కానీలే..! అది సొంతమైతే చాలు. ఉంటే తింటాం.. లేదంటే కాసిన్ని నీళ్లు తాగి ఓ మూలన పడుకుంటాం..! మనల్ని అడిగేదెవరు..? అందుకే.. ప్రతి ఒక్కరి కల.. సొంతిల్లు..! ఇది ఆస్తిమాత్రమే కాదు..! అంతకు మించి..! అందుకే.. పక్కా ఇళ్లను నిర్మించి ఇస్తామని, ఇంటి స్థలం ఇస్తామని ఏ పార్టీ హామీ ఇచ్చినా.. ఓటర్లు నమ్మి ఆదరిస్తారు. అందలం ఎక్కిస్తారు. ఇక తమ కల నెరవేరుతుందని ఊహల్లో తేలియాడుతారు. ‘ప్రభుత్వం ఇంత ఖర్చు చేస్తుంది..

TIDCO HOMES : ఇది తప్పు జగన..!
Unfinished Tidco houses in Guntakallu

పేదల ఇంటిపై రాజకీయం

నిరుపయోగంగా వేలాది టిడ్కో ఇళ్లు

టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిందని వివక్ష

సొంతిల్లు..! ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే ఆస్తి..! ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ఆలయం..! చిన్నపాటి గుడిసె కానీలే..! అది సొంతమైతే చాలు. ఉంటే తింటాం.. లేదంటే కాసిన్ని నీళ్లు తాగి ఓ మూలన పడుకుంటాం..! మనల్ని అడిగేదెవరు..? అందుకే.. ప్రతి ఒక్కరి కల.. సొంతిల్లు..! ఇది ఆస్తిమాత్రమే కాదు..! అంతకు మించి..! అందుకే.. పక్కా ఇళ్లను నిర్మించి ఇస్తామని, ఇంటి స్థలం ఇస్తామని ఏ పార్టీ హామీ ఇచ్చినా.. ఓటర్లు నమ్మి ఆదరిస్తారు. అందలం ఎక్కిస్తారు. ఇక తమ కల నెరవేరుతుందని ఊహల్లో తేలియాడుతారు. ‘ప్రభుత్వం ఇంత ఖర్చు చేస్తుంది.. మీరు కూడా కొంత జతచేయండి’ అని పాలకులు చెబితే.. అప్పో సప్పో తెచ్చి


ఇస్తారు. దరఖాస్తు చేసేందుకు, జాబితాలో తమ పేరు ఉందో లేదో చూసుకునేందుకు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ‘సార్‌.. సార్‌..’ అని బతిమాలుతారు. కానీ.. ఎన్నికల హామీ ఓ వంచన అని.. తమ కల కలగానే మిగిలిపోతుందని తెలిస్తే.. పేద, మధ్యతరగతి జనం తల్లడిల్లిపోతారు.

(అనంతపురం సిటీ/గుత్తి/గుంతకల్లు/టౌన/పామిడి)

ఎందుకిట్ల చేశావ్‌..?

టీడీపీ హయాంలో ప్రారంభించిన టిడ్కో ఇళ్ల పట్ల వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లూ కక్ష్యసాధింపు ధోరణిని ప్రదర్శించింది. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే ఉమ్మడి జిల్లాలోని 50,914 ఇళ్లపై గొడ్డలి వేటు వేసింది. ఏమాత్రం ఆలోచన చేయకుండా, 34,642 ఇళ్ల నిర్మాణాన్ని రద్దు చేసింది. రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లి.. 16,272 ఇళ్లను మాత్రమే కట్టిస్తామని ప్రకటింటింది. కానీ ఈ ఐదేళ్లలో ఆ పనికూడా చేయలేదు. నిర్మాణ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించి.. ఒక్క తాడిపత్రి మాత్రమే కొన్నింటించి ప్రారంభించింది. ఇక్క 5,184 టిడ్కో ఇళ్లు ఉండగా.. అందులో వెయ్యి ఇళ్లకు పైపై పనులు చేసి, రంగులు వేయించి.. మూడు నెలల క్రితం ప్రారంభించింది. ఇందులో కూడా లబ్ధిదారులకు 370 ఇళ్లను మాత్రమే అప్పగించింది.


- అనంతపురం, గుత్తి, పామిడి, గుంతకల్లు, రాయదుర్గం, ధర్మవరం, కదిరి, పుట్టపర్తి, హిందూపురం ప్రాంతాల్లో టిడ్కో ఇళ్ల పరిస్థితి దయనీయాంగా మారింది. టీడీపీ హయాంలో 80 శాతానికి పైగా నిర్మాణాలు పూర్తయిన చోట కూడా ఈ ఐదేళ్లలో మిగిలిన 20 శాతం పనులను కూడా వైసీపీ ప్రభుత్వం చేపట్టలేదు. కాంట్రాక్టర్లకు రూ.70 కోట్ల బకాయిలను వైసీపీ ప్రభుత్వం చెల్లించలేదు.

- అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గ పరిధిలోని గుత్తి పట్టణవాసులకు నేమతాబాదు వద్ద టీడీపీ హయాంలో 384 టిడ్కో ఇళ్లను కేటాయించారు. అప్పట్లో 96 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు. దీంతో ఇళ్ల చుట్టూ ముళ్ల పొదలు పెరిగిపోయాయి.

- గుంతకల్లు పట్టణంలోని దోనిముక్కల రోడ్డులో టిడ్కో ఇళ్ల నిర్మాణం పనులు నత్తనడకగా సాగుతున్నాయి. టీడీపీ హయాంలో 45 టిడ్కో బ్లాక్‌లు మంజూరయ్యాయి. 30 బ్లాక్‌ల పనులు పూర్తి అయ్యాయి. 15 బ్లాక్‌ల పనులు జరుగుతున్నాయి. పెయింటింగ్‌, వైరింగ్‌, టైల్స్‌ పనులు ప్రారంభం కాలేదు. సీసీ రోడ్డు కోసం కంకర వేసి వదిలేశారు. విద్యుత సౌకర్యం కల్పించాల్సి ఉంది. డ్రైనేజీ పనులు జరుగుతున్నాయి. కొన్ని బ్లాక్‌లు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారాయి. ఖాళీ మద్యం బాటిళ్లతో నిండిపోయాయి.

- పామిడి పట్టణంలో టిడ్కో ఇళ్ల నిర్మాణానికి 2018 ఫిబ్రవరి 26న అప్పటి ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌ భూమిపూజ చేశారు. రూ.151.70 కోట్లతో 2,599 ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టారు. 300 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన 1,040ఇళ్లు, 365 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన 1,299 ఇళ్లు, 430 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన 260 ఇళ్లు మంజూరయ్యాయి. ఈ ఇళ్ల నిర్మాణం దాదాపు 70 శాతం పూర్తయ్యింది. మరిన్ని ఇళ్ల కోసం ఉంచిన ఇనుప కడ్డీలు, తలుపులు, టైల్స్‌ చోరీ అయ్యాయి. ఈ ఇళ్లు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి.


ఆశలు ఆవిరి

టీడీపీ హాయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తక్కువ బడ్జెట్‌తో ఇళ్లను నిర్మించి ఇస్తామని చెప్పడంతో పట్టణ పేదలు సంతోషపడ్డారు. లబ్ధిదారులు తమ వాటా డబ్బులు చెల్లించేశారు. సుమారు రూ.300 కోట్ల విలువైన పనులు వేగంగా సాగాయి. ఇంతలోనే ఎన్నికలు వచ్చాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ క్షణం నుంచి టిడ్కో ఇళ్లకు గ్రహణం పట్టింది. టీడీపీ హయాంలో చేపట్టిన పనుల రద్దు, రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లడం టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు శాపంగా మారింది. వైసీపీ ప్రభుత్వం తీరుపై లబ్ధిదారుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో కాస్త తగ్గి.. 16,272 ఇళ్లను కట్టించి ఇస్తామని ప్రకటించింది. మిగిలిన వారికి డిపాజిట్‌ సొమ్ము వెనక్కి ఇస్తామని చెప్పింది. కానీ.. ఇవ్వాల్సిన రూ.33 కోట్లలో పైసా కూడా ఇవ్వలేదు. వైసీపీ ప్రకటించిన 16,272 ఇళ్లలో ఎక్కువ శాతం పనులు టీడీపీ హయాంలోనే పూర్తి అయ్యాయి. మిగిలిన పనులను పైపైన పూర్తి చేసి.. మమ అనిపించారు. కానీ తాడిపత్రిలో వెయ్యి ఇళ్లు మినహా.. ఏ ఒక్కరికీ అప్పగించలేదు.


అప్పు చేసి డబ్బు చెల్లించా..

మాది అనంతపురం. హోటల్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. నాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మాదీ పేద కుటుంబం. సొంతిల్లు లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నాం. టీడీపీ హయాంలో టిడ్కో ఇళ్లను ప్రకటించడంతో మా ఓనర్‌ దగ్గర అప్పు చేసి నా వాటాగా రూ.75 వేలు చెల్లించాను. ఆరేళ్లు గడిచినా ఇంటిని కట్టించి ఇవ్వలేదు. డిపాజిట్‌ కూడా వెనక్కు ఇవ్వలేదు. చేసిన అప్పునకు వడ్డీ చెల్లిస్తూనే ఉన్నాను.

- ఓ బాధితుడి ఆవేదన

టీడీపీ వస్తే కట్టిస్తుందేమో..

మాది అనంతపురం. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాను. టిడ్కో ఇంటి కోసం రూ.50 వేలు చెల్లించాను. సొంతిల్లు వస్తుందని నేను, నా కుటుంబ సభ్యులు ఎంతో సంబరపడ్డాం. వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ ఆశలు ఆవిరయ్యాయి. అధికారులను అడిగితే ఏమీ చెప్పడంలేదు. ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే మాకు ఇల్లు కట్టించి ఇస్తుందని అనుకుంటున్నాం.

- మరో బాధితుడి ఆశ


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 08 , 2024 | 12:30 AM