Share News

TUNGA BHADRA : ‘వంద’నాలమ్మా.. తల్లీ..!

ABN , Publish Date - Sep 04 , 2024 | 12:27 AM

వర్షాలు బాగా కురిశాయి. తుంగభద్ర జలాశయం శరవేగంగా నిండింది. ఆయకట్టు రైతులు పంటల సాగుకు సిద్ధమయ్యారు. ఇంతలోనే అనుకోని విపత్తు..! గత నెల పదో తేదీ రాత్రి డ్యాం 19 క్రస్ట్‌గేట్‌ కొట్టుకుపోయింది. అప్పటికి డ్యాం నిల్వలు గరిష్ఠ స్థాయిలో ఉన్నాయి. నీరు మొత్తం నదిలోకి వెళుతోంది. డ్యాం ఖాళీ అయితే పరిస్థితి ఏమిటని అందరిలో ఆందోళన..! క్షణం వృథా చేయకుండా ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు స్పందించాయి. క్రస్ట్‌ గేట్‌ల నిపుణుడు కన్నయ్య నాయుడును సీఎం...

TUNGA BHADRA : ‘వంద’నాలమ్మా.. తల్లీ..!
Filled Tungabhadra Reservoir

క్రస్ట్‌గేట్‌ కొట్టుకుపోయినా.. కరుణించిన నదీమతల్లి

ఆగస్టు 10 రాత్రి విపత్తు.. 17న పరిష్కారం

105.7 నుంచి 70 టీఎంసీలకు పడిపోయిన నిల్వ

స్టాప్‌లాగ్‌ అమర్చాక 20 రోజులకు గరిష్ఠ నిల్వల దిశగా..!

పెరుగుతున్న వరద.. నేడు క్రస్ట్‌గేట్లు ఎత్తనున్న అధికారులు

తుంగభద్ర డ్యాంలో100టీఎంసీల నిల్వలు

వర్షాలు బాగా కురిశాయి. తుంగభద్ర జలాశయం శరవేగంగా నిండింది. ఆయకట్టు రైతులు పంటల సాగుకు సిద్ధమయ్యారు. ఇంతలోనే అనుకోని విపత్తు..! గత నెల పదో తేదీ రాత్రి డ్యాం 19 క్రస్ట్‌గేట్‌ కొట్టుకుపోయింది. అప్పటికి డ్యాం నిల్వలు గరిష్ఠ స్థాయిలో ఉన్నాయి. నీరు మొత్తం నదిలోకి వెళుతోంది. డ్యాం ఖాళీ అయితే పరిస్థితి ఏమిటని అందరిలో ఆందోళన..! క్షణం వృథా చేయకుండా ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు స్పందించాయి. క్రస్ట్‌ గేట్‌ల నిపుణుడు కన్నయ్య నాయుడును సీఎం చంద్రబాబు రంగంలోకి దించారు. నష్ట నివారణ చర్యలు యుద్ధప్రాతిపదికన మొదలయ్యాయి. వారం వ్యవధిలో కొట్టుకుపోయిన క్రస్ట్‌గేట్‌ స్టాప్‌లాగ్‌ ఎలిమెంట్‌ను అమర్చారు. ఆ ప్రక్రియ నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగింది. చరిత్రలో నిచిపోయే ఘట్టం ఆవిష్కృతమైంది. దశాబ్దాల చరిత్ర ఉన్న జలాశయాలలో మునుముందు ఇలాంటి విపత్తు ఎదురైతే ఎలా ఎదుర్కొనాలో ఇంజనీరింగ్‌ నిపుణులు, కార్మికులు చేసి చూపించారు. కన్నయ్య నాయుడు అన్నట్లు.. ఇది ఒక మోడల్‌..! ఈ లోగా డ్యాంలో ఉన్న నీరు, ఆ తరువాత వచ్చిన వరద నీరు సుమారు 50 టీఎంసీలు నదిలోకి వెళ్లిపోయింది. సుమారు 70 టీఎంసీల నిల్వల వద్ద వృథాను అరికట్టారు. ‘ఇంకా వర్షాలు ఉన్నాయ్‌..! భయపడాల్సింది ఏమీ లేదు..’ అని ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నారు. ఆ రోజు రానే వచ్చింది. డ్యాంలో నీటి నిల్వలు మంగళవారం రాత్రికి 100.289 టీఎంసీలు నమోదయ్యాయి..! తాగు, సాగునీటికి సమస్య ఉండదని స్పష్టమైంది. ఇదే సమయంలో పై నుంచి వరద పెరుగుతోంది. డ్యాం క్రస్ట్‌ గేట్‌లను బుధవారం ఉదయం తెరిచి.. నదికి 5 వేల నుంచి 50 వేల క్యూసెక్కుల నీరు వదులుతామని బోర్డు అధికారులు ప్రకటించారు. ఇంతకంటే శుభవార్త అనంత రైతాంగానికి ఏముంటుంది..!

- రాయదుర్గం


తుంగభద్ర డ్యాం నిండితే ఎగువ కాలువ కింద జిల్లాలో 1.90 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. రాయదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, శింగనమల నియోజకవర్గాల్లో వరి, మొక్కజొన్న, మిర్చి, పత్తి తదితర పంటలు పండుతాయి. కర్ణాటకలో కురిసే వర్షాలనుబట్టి జిల్లాలోని ఆయకట్టు రైతులు పంటలపై ఆశలు పెంచుకుంటారు. డ్యాంలోకి నీటి చేరిక మొదలవ్వగానే పొలాలను సిద్ధం చేసుకుంటారు. పెట్టుబడులకోసం అయినచోటల్లా అప్పులు చేస్తారు. తుంగభద్ర డ్యాం నిండితే.. జలాశయంతోపాటు వేలాది మంది రైతుల ముఖాలు కళకళలాడుతాయి. ఈ ఏడాది ఆ కళ ముందే కనిపించింది. కానీ ఆ రాత్రి జరిగిన సంఘటన రైతాంగంలో గుబులు పుట్టించింది. అప్పటికే లక్షలాది రూపాయల పెట్టుబడిని మట్టిలో పెట్టడమే దీనికి కారణం. డ్యాం మళ్లీ నిండటంతో అన్నదాతలు గుండెల నిండా ఊపిరి పీల్చుకుని.. రెట్టించిన ఉత్సాహంతో పొలాల్లోకి దిగారు.

పెరగనున్న వాటా

జిల్లాకు తాగు, సాగునీరు అందించే హెచ్చెల్సీకి నీటి వాటా పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది జలాశయం నుంచి 172 టీఎంసీల నీరు వినియోగించుకునే అవకాశం ఉంటుందని భావించారు. ఆ లెక్క ప్రకారం 26.368 టీఎంసీల నీరు హెచ్చెల్సీ వాటాగా కేటాయించారు.


జలాశయం ఎగువ భాగంలో వర్షాలు కురుస్తుండడంతో ఇనఫ్లో ఈ నెలలో కూడా ఎక్కువగానే ఉంటుందని బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రకారం హెచ్చెల్సీకి మరో రెండు టీఎంసీల దాకా నీటి వాటా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్ర సరిహద్దులో ఉన్న 105 కి.మీ. వద్ద 1809 క్యూసెక్కుల నీరు అందుతోంది. ఇప్పటివరకు 5.956 టీఎంసీల నీరు హెచ్చెల్సీ వాటా కింద విడుదల చేశామని అధికారులు అంటున్నారు. జిల్లాలో తాగునీటికి 10 టీఎంసీల నీరు అవసరం. మిగిలిన నీటిని సాగుకు వినియోగించేలా అధికారులు ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. పీఏబీఆర్‌లో 1.783 టీఎంసీలు, ఎంపీఆర్‌లో 1.155 టీఎంసీలు, చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో 4.150 టీఎంసీలు, మైలవరంలో 5.449 టీఎంసీల నీరు నిల్వ ఉన్నాయి. సాగుకు ఇప్పటికే హెచఎంఎల్‌సీకి 2.67 టీఎంసీలు కేటాయించారు.

పచ్చ పచ్చాని చేలు..

తుంగభద్ర ఎగువ కాలువ కింద ఆయకట్టులో పంటసాగు పనులు పుంజుకున్నాయి. క్రస్ట్‌గేట్‌ కొట్టుకుపోవడంతో డీలా పడిన రైతులు.. తాజాగా వంద టీఎంంసీల నీటి చేరికతో హుషారయ్యారు. కణేకల్లు, బొమ్మనహాళ్‌, విడపనకల్లు, ఉరవకొండ తదితర ప్రాంతాల్లో హెచ్చెల్సీ ఆయకట్టులో వరి, మిరప, పత్తి, మొక్కజొన్న తదితర పంటల సాగు పనుల వేగం పెంచారు. ఎగువ కాలువలో నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం లేకపోవడంతో పొలాలకు నీరు తగినంత చేరుతోంది. ఇప్పటికే వరినారు సిద్ధమైంది. ప్రతికూల వాతావరణం నుంచి అనుకూల వాతావరణంలోకి రావడంతో రైతులు మరింత ఉత్సాహంతో ముందుకెళుతున్నారు. డిసి్ట్రబ్యూటరీల నుంచి సమృద్ధిగా నీరు అందుతోందని, దీనికితోడు వర్షాలు పడుతున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎటు చూసినా ఆయకట్టు రైతులు బిజీ బిజీగా కనిపిస్తున్నారు.

ఐఏబీ సమావేశం ఏర్పాటుకు సన్నద్ధం

హెచ్చెల్సీ నుంచి జిల్లాకు అందే జలాలను వినియోగించుకునేందుకు అవసరమైన ప్రణాళికను అధికారులు సిద్ధం చేశారు. దీని ఆమోదం కోసం ఐఏబీ సమావేశం ఏర్పాటుకు సిద్ధమయ్యారు. తేదీ ఖరారు కోసం ఇప్పటికే కలెక్టర్‌ను సంప్రదించినట్లు తెలిసింది. సాగు, తాగునీటి కేటాయింపులు, క్షేత్రస్థాయి సమస్యలను చర్చించేందుకు ఇరిగేషన అడ్వయిజరీ బోర్డు సమావేశం నిర్వహిస్తారు. ఇందులో ప్రజాప్రతినిధులతో పాటు జలవనరుల శాఖ అధికారులు పాల్గొని.. తీర్మానాలు చేస్తారు.

నేడే విడుదల..

తుంగభద్ర జలాశయం నిండటంతో ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు ఊపిరి పీల్చుకున్నాయి. వంద టీఎంసీలకుపైగా నీటి నిల్వలతో జలాశయం కళకళ లాడుతోంది. జలాశయం ఎగువ భాగాన ఉన్న తుంగ, భద్ర, వరద నదుల నుంచి ఇనఫ్లో పెరుగుతోంది. డ్యాం గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా.. మంగళవారం రాత్రికి నిల్వలు 100 టీఎంసీలు దాటాయి. దీంతో బోర్డు అధికారులు అప్రమత్తమయ్యారు. క్రస్ట్‌గేట్లను బుధవారం ఎత్తి నదికి నీరు వదలాలని నిర్ణయించారు. తుంగభద్ర జలాశయానికి ఇప్పటి వరకు 308 టీఎంసీల నీరు లభ్యమైనట్లు బోర్డు అధికారులు నిర్ధారించారు. ఇందులో 175 టీఎంసీల నీరు నదికి వదిలారు. ఏపీ, కర్ణాటక వాటాల మేరకు 33 టీఎంసీల నీటిని కాలువలకు వదిలారు. డ్యాంకు ఎగువన ఉన్న తుంగ, భద్ర జలాశయాలు కూడా నిండటంతో నీటిని దిగువకు వదులుతున్నారు. జలాశయం ఎగువన పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇనఫ్లో మంగళవారం రాత్రికి 37,127 క్యూసెక్కులకు చేరింది. రెండు రోజుల్లో మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. డ్యాం నీటిమట్టం 1633 అడుగులు కాగా.. ప్రస్తుతం 1632 అడుగుల వరకూ నీరు చేరింది. కాలువలకు 15,264 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు.

ఆ రాత్రి అలజడి..!

ఆగస్టు 10వ తేదీన రాత్రి 19వ క్రస్ట్‌గేట్‌ కొట్టుకుపోయింది. అప్పటికి జలాశయంలో 105.788 టీఎంసీల నీరు ఉంది. గేట్‌ కొట్టుకుపోవడంతో స్టాప్‌లాగ్‌ అమర్చేందుకు వారం రోజుల పాటు జలాశయంలోని నీటిని నదికి వదలాల్సి వచ్చింది. ఆగస్టు 17న స్టాప్‌లాగ్‌ అమర్చే ప్రక్రియ ముగిసింది. అప్పటికి డ్యాం నిల్వలు 70 టీఎంసీలకు పడిపోయాయి. నష్టపోయిన 32 టీఎంసీల నీరు తిరిగి లభ్యం కాకపోతే రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. రెండు రాషా్ట్రల పరిధిలో నాలుగు జిల్లాల ప్రజలకు తాగు, సాగునీటి సమస్య తలెత్తుతుంది. మిగిలిన 30 టీఎంసీల నీరు డ్యాంలోకి చేరాలని అన్నదాతలు ప్రార్థనలు చేశారు. రోజూ 30 వేల క్యూసెక్కులకు అటూ ఇటూగా చేరుతూ.. చివరకు మంగళవారం రాత్రికి 100 టీఎంసీలు దాటింది. క్రస్ట్‌గేట్‌ కొట్టుకుపోయిన తరువాత 23 రోజుల అనంతరం జలాశయం నిండి.. ఇంకోసారి క్రస్ట్‌గేట్లు ఎత్తే అవకాశం రావడంతో అన్ని వర్గాల్లో ఆనందం కనిపిస్తోంది.

అప్పులు తీరుతాయి..

ఎకరానికి రూ.25 వేల దాకా పెట్టుబడి పెట్టి వరి సాగు చేశాను. అప్పులు తీసుకువచ్చి పంటను పెట్టాను. ఆ సమయంలో క్రస్ట్‌గేట్‌ కొట్టుకుపోవడంతో చాలా ఆందోళన కలిగింది. ఒక రకంగా కుంగిపోయాను. 18 ఎకరాల పొలంలో పంట పరిస్థితి ఏమవుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడిపాను. డ్యాం నిండటం చాలా ఆనందంగా ఉంది. కన్నయ్యనాయుడు లాంటి ప్రతిభావంతుడిని ప్రభుత్వం పిలిపించి పనులు చేయించించింది. నీటిని కాపాడటంతోపాటు డ్యాం మళ్లీ నిండేలా చర్యలు తీసుకుంది. మాకు మళ్లీ ప్రాణం వచ్చినట్లైంది. చేసిన అప్పులు తీర్చుకోగలననే నమ్మకం కలిగింది.

-ఆంజనేయులు, ఆయకట్టు రైతు, గౌనూరు

భగవంతుడు కరుణించాడు..

తుంగభద్ర డ్యాం క్రస్ట్‌గేట్‌ కొట్టుకుపోయినపుడు ప్రాణం పోయినంత బాధ కలిగింది. నేను 13 ఎకరాల సొంత పొలంతో పాటు 22 ఎకరాల పొలం కౌలుకు తీసుకున్నాను. వరి సాగు కోసం దుక్కిదున్ని నారు వేసి సిద్ధం చేసుకున్నాను. అప్పులు చేసి పంటల సాగుకు సిద్ధమయ్యాను. ఆ సమయంలో గేట్‌ కొట్టుకుపోవడంతో నా పరిస్థితి ఏమిటని ఆందోళన కలిగింది. మళ్లీ డ్యాం నిండటంతో చాలా సంతోషంగా ఉంది. భగవంతుడు మమ్మల్ని కరుణించాడు. వర్షాలు కూడా పడుతున్నాయి. సాగునీరు అందుతోంది. పంటలు బాగా పండుతాయని నమ్మకం కలిగింది. పంట కోత వరకు నీరు అందుతుందనే ధైర్యం వచ్చింది. - ఈశ్వర, ఆయకట్టు రైతు, శ్రీధరఘట్ట


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 04 , 2024 | 12:27 AM