Tirumala Laddu: ఏడుకొండలవాడే చెప్పించాడేమో.. చంద్రబాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్..
ABN , Publish Date - Sep 21 , 2024 | 05:38 PM
Tirumala Laddu: ఈవో టీటీడీనీ ప్రక్షాళన చేశారు కానీ.. ఇవన్నీ బయటకు వచ్చి చెప్పలేదన్నారు. ఇప్పుడు ఆ ఏడు కొండలవాడే తనతో లడ్డూ వ్యవహారంపై మాట్లాడించారేమో...
అమరావతి, సెప్టెంబర్ 21: తిరుమల లడ్డూ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి తీవ్రంగా స్పందించారు. తిరుమల లడ్డూ విషయంలో జగన్ చర్యల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. ఇది చాలా సున్నితమైన అంశం అని, దీనిపై లోతుగా విచారణ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. శనివారం నాడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు మీడియాతో చిట్ చాట్ మాట్లాడారు. తాను ఏ పని చేసినా మనసులో వెంకటేశ్వర స్వామిని స్మరించుకున్నాకే పని మొదలు పెడతానని సీఎం చంద్రబాబు చెప్పారు. తమ ఇంటి ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి అని అన్నారు. తన చిన్నతనంలో తన ఇంటి దగ్గర నుంచి చూస్తే తిరుమల కొండ కనిపించేదని చెప్పారు.
జగన్ తీరుపై ఫైర్..
జగన్ పాలనలో దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేసే ఎన్నో దుస్సాహాలు చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. తిరుమల వెంకన్న స్వామితో ఎవరూ ఆటలాడకూడదన్నారు. రాష్ట్రంలోని దేవాలయాలు అన్నింటిలో తనిఖీలు చేపిస్తున్నామని సీఎం చెప్పారు. కిలో 600 రూపాయలు పైన అమ్మే నెయ్యి 320 రూపాయలకే ఎలా లభించిందని సీఎం ప్రశ్నించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో వ్యవస్థలన్నిటిని సర్వనాశనం చేశారంటూ జగన్‌పై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. తిరుమల పవిత్రతను కాపాడే అంశంపై వేద పండితులు, మఠాధిపతులతో చర్చలు జరుపుతామన్నారు.
జగన్ ప్రభుత్వంలో అనేక అపచారాలు..
గత ప్రభుత్వ హయాంలో దేవాలయాల్లో అనేక అపచారాలు జరిగాయని సీఎం చంద్రబాబు విమర్శించారు. రామతీర్థంలో రాములవారి విగ్రహ తల తొలిగిస్తే దిక్కులేకుండా పోయిందన్నారు. నిందితులపై కనీసం చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఇలా ఒక్కటని కాదు.. నాటి ప్రభుత్వం చెయ్యని తప్పులేదని సీఎం అన్నారు. నాడు ప్రజల సెంటిమెంట్స్‌తో ఆడుకున్నారని.. ప్రజల మనోభావాలకు విలువ ఇవ్వలేదని విమర్శించారు. పోలవరం, అమరావతి నాశనం చేసి.. వాటిపైనా ఎదురుదాడి చేసి తప్పుడు ప్రచారం చేశారని జగన్ పాలనా తీరును సీఎం చంద్రబాబు తూర్పారబట్టారు.
అందుకే మాఫియా డాన్..
జగన్ తన సొంత బాబాయి హత్య విషయంలో ఎలా బుకాయించారో.. నేడు ప్రకాశం బ్యారేజీలో బోట్ల విషయంలోనూ అలాగే మాట్లాడుతున్నారని విమర్శించారు. అందుకే వీళ్లను కొలంబియా నేరస్తుడు, మాఫియా డాన్ పాబ్లో ఎస్కోబార్‌తో పోల్చానని సీఎం చంద్రబాబు చెప్పారు. తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో ఎన్‌డీడీబీ రిపోర్ట్ ఇస్తే దానిపై సమాధానం చెప్పకుండా బుకాయించే వాళ్లను ఏమనాలని ప్రశ్నించారు. రూ. 320 కే కిలో ఆవు నెయ్యి ఎలా వస్తుందని సీఎం ప్రశ్నించారు. శ్రీవారికి నైవేధ్యంగా పెట్టే లడ్డూ తయారీలో రివర్స్ టెండర్లు ఏంటని ప్రశ్నించారు. పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కదా అని అన్నారు.
ఏడుకొండలవాడే తనతో మాట్లాడించాడేమో..
తప్పు చేసింది కాక.. ఇది డైవర్షన్ పాలిటిక్స్ అని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటూ జగన్ తీరుపై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ప్రభుత్వం మారిన వెంటనే తిరుమలను ప్రక్షాళన చేయమని కొత్త ఈవోకు చెప్పానన్నారు. ఆయన అనేక చర్యలు తీసుకున్నారని సీఎం చెప్పారు. లడ్డూ నాణ్యతను పెంచారన్నారు. పలు కంపెనీలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టారన్నారు. లడ్డూ నాణ్యత కోసం నందిని నుంచి నెయ్యి కొనుగోలు చేశారన్నారు. ఈవో టీటీడీనీ ప్రక్షాళన చేశారు కానీ.. ఇవన్నీ బయటకు వచ్చి చెప్పలేదన్నారు. ఇప్పుడు ఆ ఏడు కొండలవాడే తనతో లడ్డూ వ్యవహారంపై మాట్లాడించారేమో అని సీఎం అన్నారు. ఆ దేవుడే తన నోటి నుంచి నిజాలు చెప్పించాడేమోనని అన్నారు.
‘ఆ దేవుడే నా నోటి నుంచి నిజాలు చెప్పించాడు. మనం నిమిత్తమాత్రులం మాత్రమే. దేవుడే అన్నీ చేయిస్తాడు. టీటీడీ విషయంలో నెక్ట్స్ ఏం చేయాలి? ఎలా చేయాలి? అనేది చర్చిస్తున్నాం. జీయర్లు, కంచి పీఠాధిపతులు, సనాతన ధర్మ పండితులతో చర్చించి సంప్రోక్షణ ఎలా ఉండాలో నిర్ణయిస్తాం. ఇప్పటికే ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నాం.’ అని సీఎం చంద్రబాబు చెప్పారు.
ఆయనకెలా సర్టిఫికెట్ ఇస్తారు..
సుబ్బారెడ్డికి జగన్ ఎలా సర్టిఫికెట్ ఇస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. తిరుమలలో ఏం సంప్రదాయాలను వీళ్లు పాటించారని నిలదీశారు. తిరుమల సెట్‌ను ఇంట్లో వేసుకున్నవారిని ఏమనాలని నిలదీశారు. కేరళ గురువాయూర్ టెంపుల్‌లో చొక్కా విప్పి వెళ్లాలని.. అది సంప్రదాయం అని.. అందరూ పాటించాలన్నారు. ప్రతి మతానికి కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయన్న సీఎం.. వాటిని ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. శ్రీవారి లడ్డూ కంటే బాగా చేయాలని చాలా మంది ప్రయత్నం చేశారని.. కానీ సాధ్యం కాలేదన్నారు. 1817 నుంచి శ్రీవారి లడ్డూ అక్కడ తయారవుతోందన్నారు. అయోధ్యలో కూడా తిరుమల లాంటి లడ్డూ తయారు చేయాలని చూశారని.. కానీ సాధ్యం కాలేదన్నారు.
రోజూ మూడుసార్లు పరీక్షలు చేశామని ఎవరిని మభ్యపెడుతున్నారంటూ వైసీపీ నేతలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ ఏడు కొండలను.. రెండు కొండలు అన్నాడని.. అప్పుడు పోరాడామని సీఎం చెప్పారు. అమరావతిలో రూ. 250 కోట్లతో శ్రీవారి టెంపుల్ కడదామని భావిస్తే.. దానిని కుదించారన్నారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో పరీక్షలు, సంప్రోక్షణ కార్యక్రమాలు చేపడతామని సీఎం చెప్పారు.
Also Read:
ఆ స్కాం బయటకు వస్తే రేవంత్ పదవి ఖతం
ఢిల్లీ పగ్గాలు చేపట్టిన అతిషి.. నిరాడంబరంగానే..
స్వచ్చమైన నెయ్యిని ఇలా గుర్తించండి.
For More Andhra Pradesh News and Telugu News..