శాస్త్రోక్తంగా రామ్మూర్తి నాయుడి కర్మక్రియలు
ABN , Publish Date - Nov 29 , 2024 | 04:04 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడి కర్మక్రియలు గురువారం నారావారిపల్లెలో శాస్త్రోక్తంగా జరిగాయి.
సీఎం సహా నారా, నందమూరి కుటుంబీకుల హాజరు
పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు రాక
అందరితో కలసి భోజనం చేసిన సీఎం చంద్రబాబు
పెద్దఎత్తున జనం రాకతో కిక్కిరిసిన నారావారిపల్లె
తిరుపతి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడి కర్మక్రియలు గురువారం నారావారిపల్లెలో శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు నారా, నందమూరి కుటుంబీకులు, పలువురు మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. టీడీపీ శ్రేణులు వేలాదిగా తరలిరావడంతో నారావారిపల్లె కిక్కిరి సింది. గురువారం ఉదయం 8.45 గంటలకు కుటుంబీకులతో కలసి చంద్రబాబు ఇంటి నుంచి గ్రామం వెనుకవైపు ప్రాథమిక పాఠశాల సమీపాన ఉన్న బావి వద్దకు చేరుకుని తమ్ముడికి శాస్త్రోక్తంగా కర్మక్రియలు నిర్వహించారు. తనయుడు, మంత్రి లోకేశ్, సోదరుడి కుమారులు రోహిత్, గిరీ ష్‌తో పాటు మంత్రి నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా, గ్రామానికి చెందిన సన్నిహిత బంధువులు ఈ కర్మక్రియల్లో పాల్గొన్నారు. 10.45 గంటలకు కార్యక్రమం ముగిశాక సీఎం ఇంటికి చేరుకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తమ్ముడికి నివాళులు అర్పించారు. మధ్యాహ్నం 2 గంటల వరకూ అక్కడే గడిపిన సీఎం వచ్చిన వారిని పలకరించారు. ఆ తర్వాత భోజనాల వద్దకు వెళ్లి అందరితో కలసి భోజనం చేశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్‌రెడ్డి, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, ఎస్.సవిత, వాసంశెట్టి సుభా్‌షలతో పాటు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణరాజు, మాజీ మంత్రులు చినరాజప్ప, దేవినేని ఉమా తదితరులు నారావారిపల్లికి వచ్చారు.
శేషాచల లింగేశ్వర స్వామిని దర్శించుకున్న సీఎం
కుటుంబంలో ఎవరైనా మరణిస్తే కర్మక్రియల అనంతరం శివాలయాన్ని దర్శించి పూజలు చేయడం సంప్రదాయం. దానికనుగుణంగా సాయంత్రం 5 గంటలకు శేషాపురంలోని శేషాచల లింగేశ్వర స్వామి ఆలయంలో సీఎం చంద్రబాబు పూజలు చేశారు. ఆయన వెంట సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, సోదరి హైమావతి, రామ్మూర్తి నాయుడి సతీమణి ఇందిర, కుమారులు రోహిత్, గిరీష్, భువనేశ్వరి సోదరి లోకేశ్వరి తదితరులున్నారు.
బంధుమిత్రులకు రాత్రి భోజనం
గురువారం రాత్రి స్వగ్రామంలోని, అలాగే చుట్టుపక్కల గ్రామాల్లోని బంధు మిత్రులకు సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భోజనం ఏర్పాటు చేశారు. తానూ వారితో కలిసి భోజనం చేశారు.
జిల్లా అభివృద్ధిపై సమీక్ష
ఓవైపు తమ్ముడి కర్మక్రియల కార్యక్రమాల్లో పాల్గొంటూనే మరోవైపు జిల్లా అభివృద్ధి పనులపైనా సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. నారావారిపల్లిలోని తన నివాసంలో గురువారం సాయంత్రం 4.30 నుంచి 5 గంటల వరకు కలెక్టర్ సహా ముఖ్య అధికారులతో సమావేశమై జిల్లా అభివృద్ధి గురించి సమీక్షించారు. అవసరమైన దిశా నిర్దేశం చేశారు.
హాజరైన నందమూరి కుటుంబీకులు
రామ్మూర్తినాయుడి కర్మక్రియలకు ఎన్టీఆర్ తనయులు నందమూరి జయకృష్ణ, నందమూరి మోహనకృష్ణతో పాటు నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, నందమూరి సాయికృష్ణ సతీమణి, నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని, ఎన్టీఆర్ కుమార్తెలు దగ్గుబాటి పురందేశ్వరి, లోకేశ్వరి తదితరులు నారావారిపల్లెకు వచ్చారు.