Share News

Andhra Pradesh: ‘మాకు సీఎం చంద్రబాబు చెప్పింది ఇదే..!’

ABN , Publish Date - Aug 09 , 2024 | 05:09 PM

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్‌పై మంత్రులు, ఎమ్మెల్యేల ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. తాజాగా నంద్యాలలో ప్రెస్‌మీట్ పెట్టిన మంత్రులు బిసి జనార్ధన్ రెడ్డి, ఎన్‌ఎమ్‌డి ఫరూక్, ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ జగన్‌పై విరుచుకుపడ్డారు. ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ..

Andhra Pradesh: ‘మాకు సీఎం చంద్రబాబు చెప్పింది ఇదే..!’
Andhra Pradesh Ministers

నంద్యాల, ఆగష్టు 09: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్‌పై మంత్రులు, ఎమ్మెల్యేల ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. తాజాగా నంద్యాలలో ప్రెస్‌మీట్ పెట్టిన మంత్రులు బిసి జనార్ధన్ రెడ్డి, ఎన్‌ఎమ్‌డి ఫరూక్, ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ జగన్‌పై విరుచుకుపడ్డారు. ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉన్నాయన్నారు. జగన్ పాలనలో 2,686 హత్యలు జరిగాయని, ఆయనపై కూడా కేసులు పెట్టాలని అన్నారు. ‘మీ కుటుంబ చరిత్ర అంతా రక్త చరిత్రే’ అని జగన్‌పై మంత్రి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సీతారామాపురంలో రెండు కుటుంబాల మధ్య వివాదంతో జరిగిన మర్డర్‌ను రాజకీయం చేసి ఉనికి చాటుకోవడానికి జగన్ ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ‘మీ బాబాయ్‌ని చంపితే ఐదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశావో చెప్పాలి’ అని జగన్‌ను మంత్రి డిమాండ్ చేశారు. హత్యా రాజకీయాల గురించి ఇప్పుడు మాట్లాడుతున్న జగన్.. ముందుగా తన చెల్లెలు సునితా రెడ్డికి సమాధానం చెప్పాలన్నారు. హత్యలపై చర్చిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోనే చెప్పారని.. మరి జగన్ ఎందుకు స్పందించడం లేదని మంత్రి జనార్ధన్ ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఒకటో తేదీనే పింఛన్లు, ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామన్నారు.


శవ రాజకీయాలు మానుకో..

సీతారామాపురంలో రెండు పార్టీల మధ్య గొడవ జరగలేదని, రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగిందన్నారు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణ వల్లే మర్డర్ జరిగిందన్నారు. జగన్ ఇకనైనా శవ రాజకీయాలు మానుకోవాలని హితవు చెప్పారు. నంద్యాలలో కానిస్టేబుల్ సురేంద్ర మర్డర్, అబ్దుల్ సలాం సూసైడ్ ఘటనలు జరిగినప్పుడు జగన్ నంద్యాలకు ఎందుకు రాలేదు? అని అఖిల ప్రియ ప్రశ్నించారు. నంద్యాల శిల్పా వెంచర్‌లో ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేస్తే జగన్ ఎందుకు స్పందించ లేదన్నారు. రెడ్ బుక్ అంటేనే జగన్ భయపడుతున్నారని అఖిల ప్రియ ఎద్దేవా చేశారు. సీతారామాపురంలో సుబ్బారాయుడు హత్య ఘటనను మీడియాలో హైలెట్ చేయాలని జగన్ అంటున్నారని.. మీడియా ప్రతినిధులపైన, ఆఫీసులపై దాడులు చేసినప్పుడు జగన్‌కు ఈ మీడియా గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు.


సీఎం చంద్రబాబు మాకు చెప్పిందిదే..

మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ కూడా జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలోనే వైఎస్ జగన్ లాంటి క్రిమినల్ లీడర్ లేరని నేషనల్ మీడియా చెప్తోందన్నారు. సిబిఐ కోర్టుకు వెళ్లకుండా ఉండేందుకు ప్రతి శుక్రవారం ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుంటున్నారని ఆరోపించారు. కక్ష సాధింపు చర్యలకు.. హత్యా రాజకీయాలకు దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు క్లియర్‌గా చెప్పారన్నారు. జగన్ ఇకనైనా హత్యా రాజకీయాలపై మాట్లాడటం మానుకొవాలని.. రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడితే బాగుంటుందని మంత్రి ఫరూక్ హితవు చెప్పారు.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Aug 09 , 2024 | 05:09 PM