AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ తొలి సమావేశం.. కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర..!
ABN , Publish Date - Jun 24 , 2024 | 07:04 AM
నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఉదయం 10 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్ లోని కేబినెట్ హాల్లో మంత్రిమండలి సమావేశం కానుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక చేసిన ఐదు సంతకాలకు నేడు కేబినెట్‌లో ఆమోదం తెలపనున్నారు.
అమరావతి: నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఉదయం 10 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్ లోని కేబినెట్ హాల్లో మంత్రిమండలి సమావేశం కానుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక చేసిన ఐదు సంతకాలకు నేడు కేబినెట్‌లో ఆమోదం తెలపనున్నారు. మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ, సామాజిక భద్రతా పింఛన్లు 3000 నుంచి 4 వేలకు పెంపు, ఇతర కేటగిరిలలో కూడా రెండింతలు, మూడింతల పెంపు, రాష్ట్రంలో స్కిల్ సెన్సెస్‌లకు సంబంధించిన నిర్ణయాలకు కేబినెట్‌లో ఆమోదముద్ర పడనుంది.
విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి తిరిగి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరును పునరుద్ధరిస్తూ కేబినెట్‌లో నిర్ణయం జరగనుంది. అడ్వకేట్ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్ నియామకానికి కేబినెట్‌లో ఆమోదముద్ర పడనుంది. వీటితో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వాటి అమలు అంశంపై చర్చ జరగనుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతి, వాస్తవ పరిస్థితులను ప్రజలకు చెప్పేందుకు శ్వేత పత్రాలు విడుదల చేయనున్నారు. మొత్తం ఎనిమిది అంశాల్లో శ్వేత పత్రాలు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ శ్వేత పత్రాల రూపకల్పనపై మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. మంత్రుల కమిటీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, హోంమంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్‌లతో కమిటీ వేసే అవకాశం ఉంది. నేటి కేబినెట్‌లో కమిటీ పై తుది నిర్ణయం జరగనుంది.