AP Govt : గోదావరి జలాల్లో మా లోటు 500 టీఎంసీలు పూడ్చాకే!
ABN , Publish Date - Dec 21 , 2024 | 05:08 AM
గోదావరి జలాల్లో ఆంధ్రప్రదేశ్ లోటు 500 టీఎంసీలు పూడ్చాకే గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై ముందుకు వెళ్లాలని కేంద్రానికి రాష్ట్ర జల వనరుల శాఖ స్పష్టం చేసింది.
గోదావరి-కావేరి అనుసంధానంపై కేంద్రానికి స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం
పోలవరం కాలువ నుంచే అనుసంధానం చేయండి
జాతీయ జలాభివృద్ధి సంస్థకు ఏపీ లేఖ
అమరావతి, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): గోదావరి జలాల్లో ఆంధ్రప్రదేశ్ లోటు 500 టీఎంసీలు పూడ్చాకే గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై ముందుకు వెళ్లాలని కేంద్రానికి రాష్ట్ర జల వనరుల శాఖ స్పష్టం చేసింది. నదుల అనుసంధానంపై గురువారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సాంకేతిక లోపం తలెత్తడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర జల వనరుల శాఖ తన వాదనను వినిపించే అవకాశం లేకుండాపోయింది. దీంతో ఏపీ అభిప్రాయాన్ని లిఖిత పూర్వకంగా రెండు రోజుల్లో తెలియజేయాలని జాతీయ జలాభివృద్ధి సంస్థ కోరగా, రాష్ట్ర జల వనుల శాఖ శుక్రవారం తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ కేంద్ర జలాభివృద్ధి సంస్థకు లేఖ రాసింది. గోదావరి జలాలు దాదాపు 350 టీఎంసీల లోటు ఉన్నట్టు కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) స్పష్టం చేసిందని ఆ లేఖలో గుర్తు చేసింది. రాష్ట్ర భవిష్యత్తు అవసరాలకు గోదావరి జలాలు మరింత అవసరం ఉందని స్పష్టం చేసింది.
మా లోటు లెక్కించాకే..
ఏపీకి గోదావరి జలాల లోటు ఎంతో లెక్కించాకే.. గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రక్రియకు వెళ్లాలని కేంద్రానికి రాష్ట్రం స్పష్టం చేసింది. ఛత్తీ్‌సగఢ్‌లో వాడుకోని గోదావరి జలాలు 147 టీఎంసీలు ఉన్నాయని, వాటిని గోదావరి- కావేరి జలాల అనుసంధానానికి ఉపయోగిస్తామంటే ఎలా అని ప్రశ్నించింది. గోదావరి-కావేరి అనుసంధానంతో తెలంగాణకు అదనంగా దాదాపు 80 టీఎంసీలు, కర్ణాటకకు మరో 20 టీఎంసీల దాకా లబ్ధి చేకూరుతుందని ఏపీ చెబుతోంది. గోదావరి-కావేరి నదుల అనుసంధానంతో సంబంధం లేని బెడ్తి-వర్తా-తుంగభద్ర అనుసంధానం చేస్తే ఏపీకి కృష్ణాజలాలు అదనంగా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసింది. ఇదే సమయంలో రాష్ట్రంలోని చింతలపూడి ఎత్తిపోతల పథకానికీ, పట్టిసీమ ద్వారా గోదావరి-కృష్ణా నదుల అనుసంధానానికి కూడా ఆమోదముద్ర వేయాలని కోరింది.
పోలవరం కుడి ప్రధాన కాలువ నుంచే గోదావరి-కావేరి అనుసంధానం చేయాలని స్పష్టం చేసింది. అలా చేస్తేనే రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుందని తెలిపింది. ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్ మీదుగా కావేరికి జలాలను తరలించే ప్రక్రియకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నాగార్జున సాగర్ నుంచి జలాలు తరలిస్తామంటే అంగీకరించబోమని తేల్చిచెప్పింది.
ఏకపక్షంగా వెళ్తామంటే అంగీకరించం..
దిగువ రాష్ట్రంగా ఏపీకి ప్రత్యేక హక్కులు ఉంటాయని, అందువల్ల పోలవరం కుడి ప్రధానకాలువ నుంచి గోదావరి జలాలను కావేరికి తరలించే ప్రక్రియను చేపట్టాల్సిందేనని, ఇచ్చంపల్లి నుంచి లేదా తుపాకులగూడెం నుంచి గోదావరి జలాలను కావేరికి అనుసంధానం చేయడం వల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఉండదని ఏపీ స్పష్టం చేసింది. గోదావరి-కావేరి అనుసంధాన ప్రక్రియను చేపట్టాలంటే రాష్ట్రానికి ప్రత్యేకంగా ప్రయోజనం ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది.