AP Govt: వైఎస్ జగన్ భద్రతపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
ABN , Publish Date - Jul 19 , 2024 | 04:09 PM
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) భద్రతపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే...
అమరావతి: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) భద్రతపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. వినుకొండ పర్యటన నేపథ్యంలో అర్ధరాత్రి నుంచే జగన్ భద్రత తగ్గించారని.. క్యాంపు ఆఫీస్ వద్ద భద్రతా సిబ్బందిని సైతం ప్రభుత్వం తొలగించిందని లేనిపోని ఆరోపణలు చేశారు నేతలు. అంతేకాదు.. ఆఖరికి వైఎస్ జగన్‌కు పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చినట్లు, రిపేర్‌లో ఉన్న వాహనం ఇవ్వడంతో ప్రయాణానికి ఇబ్బందులు తలెత్తాయని.. వినుకొండ వెళ్తుండగా పలుమార్లు మొరాయించిందని అటు సోషల్ మీడియాలో సైతం వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హడావుడి చేశారు. ఈ ఆరోపణలు, విమర్శలన్నింటిపైనా ప్రభుత్వం ఓ ప్రకటన రూపంలో స్పందించింది.
అదంతా అచ్చు తప్పు!
కండిషన్‌లో లేని వాహనాలు ఇచ్చారనే మాజీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ పార్టీ నేతల ప్రచారాన్ని ఏపీ ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. భద్రత తగ్గించారనే ప్రచారాన్ని కూడా ప్రభుత్వం ఖండించింది. జగన్‌కు ప్రస్తుతం జడ్ ప్లస్ సెక్యూరిటీకి ఇచ్చే భద్రత ఉందని పోలీసు శాఖ నిర్థారించినది. వాహనం ఫిట్‌నెస్‌పై వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవాల్లేవని.. ఆరోపణలను ప్రభుత్వం కొట్టిపారేసింది. జగన్‌కు కేటాయించి వాహనం పూర్తి ఫిట్‌నెస్‌తో ఉందని కండిషన్ చూసిన తరువాతనే వీఐపీకి కేటాయించామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
తగదు జగన్!
వైఎస్ జగన్‌కు సౌకర్యంగా లేదని కారు దిగారని.. దానికి వాహనం ఫిట్‌గా లేదని ప్రచారం చేయడం తగదని అధికారులు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.జగన్ కారు దిగిన తరువాత అదే కాన్వాయ్‌లో ఆ వాహనం వెళ్లిందని, ఎటువంటి ఇబ్బంది లేదని అధికారులు తేల్చి చెప్పారు. ఇక జగన్ వెంట వచ్చిన వాహనాలు నిలిపివేశారనే ప్రచారాన్ని కూడా అధికారులు కొట్టేశారు. ర్యాలీలకు, సభలకు అనుమతి లేదని.. జగన్ వెళ్లే పరామర్శ కార్యక్రమానికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నామని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. కాగా.. వినుకొండ వెళ్తున్న జగన్ కాన్వాయ్‌లోని ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేల వాహనాలను ఎక్కడికక్కడ అడ్డుకుని పోలీసులు ఆపేసినట్లు వైసీపీ నేతలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఎల్లో బుక్ ప్రకారమే ప్రస్తుతం జగన్‌కు భద్రత ఇచ్చామని ఏపీ ప్రభుత్వం క్లియర్ కట్‌గా ఓ ప్రకటన రూపంలో క్లారిటీ ఇచ్చేసింది.