AP Govt :బడి మారుతోంది!
ABN , Publish Date - Dec 14 , 2024 | 03:51 AM
పాఠశాలల పునర్‌వ్యవస్థీకరణకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు రకాల బడులు ఉండగా వాటి స్థానంలో ఐదు రకాలు తీసుకొచ్చేలా పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
ఇకపై 5 రకాలుగా పాఠశాలలు
ప్రాథమికోన్నత పాఠశాలలకు సెలవు
బేసిక్ ప్రైమరీలో ప్రీప్రైమరీ-1, 2తో పాటు 1 నుంచి 5 వరకూ క్లాసులు
విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్లు
కొత్తగా మోడల్ ప్రైమరీ పాఠశాలలు
ప్రతి తరగతికి తప్పనిసరిగా ఒక టీచర్
హైస్కూల్ ప్లస్ స్కూళ్లకు ప్రత్యామ్నాయాల కోసం అన్వేషణ
ప్రాథమిక పాఠశాలలకు అంగన్‌వాడీల అనుసంధానం
పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
పాఠశాలల పునర్‌వ్యవస్థీకరణకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు రకాల బడులు ఉండగా వాటి స్థానంలో ఐదు రకాలు తీసుకొచ్చేలా పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనిలో భాగంగా ప్రాథమికోన్నత పాఠశాలల విధానాన్ని తొలగించింది. అలాగే ఫలితాలు దారుణంగా ఉంటున్న హైస్కూల్ ప్లస్‌ల స్థానంలో ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది. తాజా ప్రతిపాదనల్లో వీటి గురించి పాఠశాల విద్యాశాఖ ప్రస్తావించలేదు. ఇక కొత్తగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను ప్రవేశపెట్టింది. అంగన్‌వాడీలను ప్రాథమిక పాఠశాలలకు అనుసంధానం చేసి ప్రీప్రైమరీ తరగతులు నిర్వహిస్తారు. బేసిక్ ప్రైమరీ స్కూళ్లలో ప్రీప్రైమరీ-1, 2తో పాటు 1 నుంచి 5 తరగతులు ఉంటాయి. వీటిలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్లను కేటాయిస్తారు. మోడల్ ప్రైమరీ స్కూళ్లలోనూ ఇవే తరగతులు ఉంటాయి. వీటిని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రారంభించి, ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండేలా చర్యలు తీసుకుంటారు. హైస్కూల్ ప్లస్‌లకు ప్రత్యామ్నాయంగా బాలికలకు ఇంటర్ విద్య అందించే ఉద్దేశంతో ఉన్నత పాఠశాలల్లో జూనియర్ కాలేజీల విధానం తేవాలని భావిస్తున్నారు.
అత్యంత వివాదాస్పదం జీవో 117
పాఠశాలల నిర్మాణం, టీచర్ల కేటాయింపుపై గత ప్రభుత్వం తెచ్చిన జీవో 117 అత్యంత వివాదాస్పదమైంది. ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను సమీపంలోని ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతో ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య భారీగా పెరిగింది. 4,731 ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను 3,348 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు తరలించారు. ఫలితంగా 2,43,540 మంది విద్యార్థులు బడి మారిపోవాల్సి వచ్చింది. ఈ కారణంగా ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య 12,247కు పెరిగింది. అనేకమంది విద్యార్థులు ప్రైవేటు బడులకు మారిపోయారు. 2,073 ప్రాథమికోన్నత పాఠశాలలు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కోల్పోయాయి.
ఆ తరగతులు వెనక్కి
గత ప్రభుత్వంలో విలీనం కారణంగా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చేరిన 3, 4, 5 తరగతుల విద్యార్థుల్లో మిగిలిన 1,43,410 మందిని తిరిగి ప్రాథమిక పాఠశాలలకు తీసుకొస్తారు. ఫౌండేషనల్ స్కూల్‌లో ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక సెకండరీ గ్రేడ్ టీచర్‌ను, బేసిక్ ప్రైమరీ స్కూల్‌లో ఒక ఎస్జీటీని కేటాయిస్తారు. ఆ తర్వాత విద్యా హక్కు చట్టం ప్రకారం కేటాయింపులు చేస్తారు. 60 మంది కంటే ఎక్కువ విద్యార్థులుండే వాటిని మోడల్ ప్రైమరీ పాఠశాలలుగా గుర్తించి ప్రతి తరగతికి ఒక టీచర్ చొప్పున కనీసం ఐదుగురిని, విద్యార్థుల సంఖ్య 120 దాటితే ప్రధానోపాధ్యాడి పోస్టును కేటాయిస్తారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులున్న ప్రాంతాల్లో 45 నుంచి 50 మంది విద్యార్థులే ఉన్నా మోడల్ ప్రైమరీ స్కూల్‌గా పరిగణిస్తారు.