సీఎంవో ఆదేశాలతోనే ‘సాక్షి’కి సంతర్పణ!
ABN , Publish Date - Dec 07 , 2024 | 05:19 AM
పత్రికలకు ప్రకటనల జారీ విషయంలో గత జగన్ ప్రభుత్వం అన్ని నిబంధనలనూ తుంగలో తొక్కింది. అప్పటి ముఖ్యమంత్రి జగన్ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించి తన రోత పత్రిక ‘సాక్షి’కి రూ.వందల కోట్లు దోచిపెట్టారు.
గత జూన్‌లో హైకోర్టులో అఫిడవిట్ వేసిన అప్పటి సమాచార కమిషనర్ విజయకుమార్‌రెడ్డి
అమరావతి, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): పత్రికలకు ప్రకటనల జారీ విషయంలో గత జగన్ ప్రభుత్వం అన్ని నిబంధనలనూ తుంగలో తొక్కింది. అప్పటి ముఖ్యమంత్రి జగన్ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించి తన రోత పత్రిక ‘సాక్షి’కి రూ.వందల కోట్లు దోచిపెట్టారు. ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ఆదేశాలతోనే ఇలా ప్రజాధనాన్ని సంతర్పణ చేసినట్లు ఆయన హయాంలో పనిచేసిన సమాచార శాఖ కమిషనర్ విజయకుమార్‌రెడ్డి హైకోర్టుకు నివేదించడం గమనార్హం. ‘కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో ప్రభుత్వ ప్రకటనల జారీకి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం నిర్దిష్ట మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ అంశంలో ప్రభుత్వ నిర్ణయం కొన్ని మీడియా సంస్థలకు మేలు చేకూర్చేలా ఉండకూడదని స్పష్టంగా చెప్పింది. సర్క్యులేషన్‌ను ప్రాతిపదికగా తీసుకుని ప్రకటనల జారీలో అన్ని పత్రికలకూ సమాన అవకాశాలు ఇవ్వాలని చెప్పింది.
ఈ నిబంధనలకు తూట్లుపొడిచి.. నచ్చినవారికి ఇష్టారీతిన ప్రభుత్వ ప్రకటనలు జారీ చేసిన విజయ్‌కుమార్‌రెడ్డి.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వక్రభాష్యం చెబుతూ రాష్ట్ర హైకోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. అడ్డగోలుగా జగన్ పత్రికకు ప్రకటనల టారిఫ్ పెంచేసి.. వందల కోట్లు చెల్లించేసి.. ప్రకటనల జారీ విషయంలో చట్టనిబంధనల మేరకే వ్యవహరించామని ఒకవైపు చెబుతూనే.. మరోవైపు సీఎంవో ఆదేశాలకు అనుగుణంగా నడుచుకున్నామని ఈ ఏడాది జూన్‌లో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
సీఎంవో ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న మెదటి రెండు పత్రికలకు మాత్రమే ఎంప్యానెల్డ్ రేటుతో ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చామని తెలిపారు. సర్క్యులేషన్‌లో మొదటి స్థానంలో ఉన్న పత్రికకు మించి అడ్డగోలుగా రోతపత్రికకు ఎన్నో వందల కోట్ల విలువైన ప్రకటనలు ఇచ్చారు. ఇటీవల కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో వెల్లడించిన సమాచారం ప్రకారం.. సమాచార శాఖ ద్వారా జగన్ పత్రికకు విడుదల చేసిన ప్రకటనల విలువ రూ.371,12 కోట్లు. అయితే జిల్లా స్థాయిలో ఆ పత్రికకు ఎంత విలువైన ప్రకటనలు ఇచ్చారో చెప్పలేదు. కాగా, ప్రభుత్వ విధానాల్లో లోటుపాట్లు ఎత్తిచూపిన పత్రికలను పక్కనపెట్టి.. సంప్రదింపుల ప్రక్రియ పేరుతో నచ్చిన పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలను వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలను కప్పిపుచ్చుకొనేందుకు, సంప్రదింపుల ప్రక్రియ ద్వారా ప్రకటనలు జారీ చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు వందల కోట్లు ఆదా చేశామంటూ హైకోర్టును తప్పుదోవ పట్టించడానికి విజయకుమార్‌రెడ్డి ప్రయత్నించారు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా జగన్ ప్రభుత్వం 2019 నుంచి ప్రకటనలు ఇస్తూ వచ్చిందని.. రూ.కోట్ల ప్రజాధనాన్ని ఖర్చుచేసిందని బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంభొట్లవారిపాలెం గ్రామానికి చెందిన చెన్నుపాటి సింగయ్య హైకోర్టులో పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.