Share News

Andhra Pradesh: జగన్ ఓట్లకు గండికొట్టే యత్నం..? ఏం చేశారంటే..?

ABN , Publish Date - Jun 01 , 2024 | 04:41 AM

కడప లోక్ సభ స్థానం నుంచి వైఎస్ షర్మిల బరిలోకి దిగడంతో వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డికి భయం పట్టుకుంది. ఎక్కడ ఓడిపోతాననే భయంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో సంప్రదింపులు జరిపారు. జగన్ ఇలాకా పులివెందులలో అసెంబ్లీకి టీడీపీకి వేస్తాం అని, పార్లమెంట్ స్థానానికి తనకు ఓటు వేయాలని అవినాశ్ రెడ్డి సమాచారం పంపించారని తెలిసింది.

Andhra Pradesh: జగన్ ఓట్లకు గండికొట్టే యత్నం..? ఏం చేశారంటే..?
YS Avinash Reddy

టీడీపీతో ఒప్పందానికి అవినాశ్‌ శిబిరం యత్నం!

పులివెందులలో తెర వెనుక ఆసక్తికర పరిణామాలు

కడప లోక్‌సభకు షర్మిల పోటీతో

అవినాశ్‌ వర్గానికి ఓటమి భయం

టీడీపీతో చీకటి ఒప్పందానికి యత్నం

25 బూత్‌లలో తమకు ఓట్లు వేయిస్తే..

అసెంబ్లీకి టీడీపీకి వేయిస్తామని ప్రతిపాదన

జగన్‌ ఓట్లకే గండికొట్టే యత్నం!

భాస్కర్‌రెడ్డి సందేశానికి ‘నో’ అన్న బీటెక్‌ రవి

కడప లోక్‌సభ పరిధిలోని

మిగతా అసెంబ్లీ అభ్యర్థులకు వర్తమానం

ఒకచోట పరస్పరం ఓట్లేసుకున్నట్లు ప్రచారం

రాష్ట్రంలో పలుచోట్ల ఇదే దారిన వైసీపీ అభ్యర్థులు

అనైతిక ఒప్పందాలకు టీడీపీ ససేమిరా


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘ఈసారి ఎన్నికల్లో రాష్ట్రంలో 175 అసెంబ్లీ సీట్లూ మావే’ ..ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడడానికి ముందు వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ధీమాగా పలికిన పలుకులివి. తీరా బరిలోకి దిగాక క్షేత్ర స్థాయిలో తమ పరిస్థితేంటో అర్థమై వైసీపీ అభ్యర్థులు బెంబేలెత్తిపోయారు. ఓటమి నుంచి తప్పించుకోవడానికి టీడీపీతో తెర వెనుక ఒప్పందాలకు పలువురు ఆరాటపడ్డారు. జగన్‌ సొంత జిల్లా కడపలోనే ఈ తరహా ఒప్పందాలకుప్రయత్నాలు జరిగినట్లు రాజకీయ వర్గాల్లో ఇప్పుడు పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది.


టీడీపీతో చర్చలు..!!

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు, కడప లోక్‌సభ వైసీపీ అభ్యర్థి, సీఎం జగన్‌కు మరో చిన్నాన్న కుమారుడైన వైఎస్‌ అవినాశ్‌రెడ్డి శిబిరం ఏకంగా జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందులలోనే ప్రత్యర్థి పక్షంతో చేతులు కలపాలని ప్రయత్నించినట్లు తెలిసింది. ఈ ప్రయత్నం సఫలమైతే ఆ దెబ్బ జగన్‌కే తగిలేది. కానీ టీడీపీ శిబిరం నిరాకరించడంతో ఫలించలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కడప ఎంపీ స్థానానికి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల కాంగ్రెస్‌ తరఫున పోటీ చేయడం అవినాశ్‌రెడ్డి శిబిరంలో కలవరం రేకెత్తించింది.


గతంలో భారీ మెజార్టీ

గత ఎన్నికల్లో అక్కడ అవినాశ్‌ భారీ మెజారిటీతో గెలిచారు. మామూలుగా అయితే అక్కడ వైసీపీ గెలుపుపై సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ షర్మిల బరిలోకి దిగడం అక్కడ రాజకీయ వాతావరణాన్ని బాగా వేడెక్కించింది. తమ చిన్నాన్న వివేకానందరెడ్డి దారుణ హత్యలో అవినాశ్‌రెడ్డి పాత్రపై ఆమె విస్తృతంగా ప్రచారం చేశారు. వివేకా కుమార్తె సునీత కూడా ఆమెకు మద్దతుగా ఇంటింటి ప్రచారం చేశారు. జగన్‌ తల్లి విజయలక్ష్మి సైతం షర్మిలకు మద్దతివ్వాలని ఓటర్లను కోరుతూ ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ఈ పరిణామాలు కడప జిల్లాలో వైసీపీ మద్దతుదారుల్లో చీలిక తెచ్చాయి.


పులివెందులలో చర్చలు..!!

కొంత మంది బాహటంగానే షర్మిలకు మద్దతుగా మాట్లాడడం మొదలుపెట్టారు. ప్రత్యేకించి పులివెందులలో అనేక మంది వైసీపీ ఓటర్లు అసెంబ్లీకి వైసీపీకి వేసి.. లోక్‌సభకు మాత్రం షర్మిలకు వేస్తామని చెప్పినట్లు కొన్ని సర్వేలు పేర్కొన్నాయి. ఇది అవినాశ్‌రెడ్డి వర్గాన్ని కలవరపరచింది. జనం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థులకు ఓట్లు వేసి.. ఎంపీగా షర్మిలకు వేస్తే తమ గెలుపు ప్రశ్నార్థకమవుతుందన్న భయం ఏర్పడింది. దీంతో చీకటి ఒప్పందానికి తెరలేపింది. అవినాశ్‌ తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్‌ రవి సన్నిహితులకు ఒక వర్తమానం పంపారు. 25 పోలింగ్‌ బూత్‌ల్లో పరస్పరం అంగీకారంతో పనిచేద్దామని, ఆ బూత్‌ల్లో అసెంబ్లీ ఓట్లు టీడీపీ వేసుకుంటే.. ఎంపీ ఓట్లు తాము వేసుకుంటామన్నది ఆ సందేశం సారాంశం. 25 బూత్‌ల్లో కలిపి సుమారుగా 25-30 వేల ఓట్లు ఉంటాయి. ఈ ఓట్లు తమకు పడితే పులివెందులలో తమకు ఏర్పడే తరుగు కొంతవరకూ పూడుతుందని అవినాశ్‌ శిబిరం ఆశించింది.

దీనివల్ల జగన్‌కు వచ్చే ఓట్లకు గండి పడే ప్రమాదమున్నా పట్టించుకోలేదు. అయితే ఈ ప్రతిపాదనకు బీటెక్‌ రవి శిబిరం అంగీకరించలేదు. గెలిచినా, ఓడినా బహిరంగంగానే పోరాడతామని, ఇటువంటి తెర వెనుక ఒప్పందాలకు అంగీకరించబోమని తేల్చిచెప్పింది. పులివెందులలో కుదరకపోవడంతో అవినాశ్‌ శిబిరం ఇదే ప్రతిపాదనను తమ లోక్‌సభ స్థానం పరిధిలోని మిగతా ఆరు స్థానాలు.. కడప, మైదుకూరు, కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేల్‌ (ఎస్సీ)ల్లో పోటీచేస్తున్న టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు కూడా పంపింది.


అంగీకారం..!!

వీరిలో ఒక్క అభ్యర్థి మాత్రం దీనికి అంగీకరించారని, ఆ నియోజకవర్గంలో కొన్ని పోలింగ్‌ బూత్‌ల్లో ఇరు పక్షాలు పరస్పర అంగీకారంతో పనిచేశాయని ఆ జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఇది చెవిన పడడంతో కొందరు టీడీపీ ముఖ్యులు బీటెక్‌ రవిని ఆరా తీశారు. తన వద్దకు ఈ ప్రతిపాదన వచ్చిన మాట వాస్తవమేనని, తాను తిరస్కరించానని ఆయన వారికి చెప్పారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఏం జరిగిందో తనకు తెలియదన్నారు.


రాష్ట్రంలో మరికొన్ని చోట్ల..!

ఇటువంటి తెరచాటు ప్రయత్నాలు కడప జిల్లాకే పరిమితం కాలేదు. పార్టీ ఎటుపోయినా తాము గెలిస్తే చాలనుకున్న కొందరు వైసీపీ అభ్యర్థులు ఇతర జిల్లాల్లో కూడా ఈ తరహా ఒప్పందాలకు ప్రయత్నించారు. రాష్ట్రం నడిబొడ్డున ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక యువ అభ్యర్థి.. ప్రత్యర్థి పక్షంతో ఇదే తరహాలో రాజీకి ప్రయత్నం చేశారు. అసెంబ్లీకి తనకు ఓట్లు వేయిస్తే తన ఓట్లు టీడీపీ లోక్‌సభ అభ్యర్థికి వేయిస్తానని ఆయన బేరం పెట్టారు.


అంగీకరించని టీడీపీ

టీడీపీ శిబిరం అంగీకరించలేదు. గోదావరి జిల్లాల్లో ఒక వైసీపీ ఎంపీ అభ్యర్థి తన పరిధిలోని టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులను దువ్వాలని చూశారు. కావాలంటే ఆర్థిక సాయం ఎంతైనా చేస్తానని, తనకు ఓట్లు వేయించాలని ఆయన వారిని పదేపదే కోరారు. గుంటూరు జిల్లాలో ఒక వైసీపీ లోక్‌సభ అభ్యర్థి కులం కార్డు వాడారు. తనకు సాయం చేయాలని టీడీపీలో ఉన్న తమ కులం నేతలకు విజ్ఞప్తులు పంపారు. కానీ ఆ ప్రయత్నాలు పెద్దగా ఫలించిన దాఖలాలు కనిపించలేదు.

Updated Date - Jun 01 , 2024 | 07:45 AM