Share News

కోనా.. ఇది తగునా!

ABN , Publish Date - Aug 20 , 2024 | 06:35 AM

ఆమె ఒక పేద ముస్లిం మహిళ. ఆమె పేరు మీద ఉన్న అరెకరం పొలమే కుటుంబానికి జీవనాధారం. ఆ భూమి దశాబ్దాల నుంచి వారి స్వాధీనంలోనే ఉంది.

కోనా.. ఇది తగునా!

  • వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రోద్బలంతో భూదందా

  • పేద ముస్లిం మహిళ భూమిని కాజేసిన వైసీపీ గూండాలు

  • గతంలో నిందితులకే పోలీసుల వత్తాసు

  • కూటమి ప్రభుత్వం రాకతో బాధితులకు ధైర్యం

  • న్యాయం చేయాలంటూ కలెక్టర్‌కు వినతి

బాపట్ల, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): ఆమె ఒక పేద ముస్లిం మహిళ. ఆమె పేరు మీద ఉన్న అరెకరం పొలమే కుటుంబానికి జీవనాధారం. ఆ భూమి దశాబ్దాల నుంచి వారి స్వాధీనంలోనే ఉంది. వైసీపీ గూండాల కన్ను ఆ భూమిపై పడటం, వారికి మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి సహకారం అందించడంతో రాత్రికి రాత్రే నకిలీ దస్తావేజులు పుట్టించి భూమిని కాజేశారు.

బాపట్ల కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో బాధితురాలు ఫిర్యాదు చేశారు. బాపట్ల మండలం మరుప్రోలువారిపాలెం లో సర్వే నంబరు 213/6, 99/19లో 0.50 సెంట్ల భూమిని ఏళ్ల కిందటే రహ్మతున్నీసా పేరు మీద రిజిస్ర్టేషన్‌ చేశారు.

ఆమె కుటుంబం నగరం మండలం పెద్దమట్లపూడిలో నివసిస్తుండటంతో మరుప్రోలువారిపాలంలోని ఆ స్థలంపై వైసీపీ నేతల కన్ను పడింది. నకిలీ దస్తావేజులు పుట్టించి దాదాపు రూ.4 కోట్ల విలువ చేసే 19 సెంట్ల స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని ఆధారాలతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.


అడుగడుగునా నిబంధనల ఉల్లంఘనే....

గతేడాది వైసీపీ నేతలు నక్కల నాగార్జున, మరుప్రోలు చెన్నకేశవరెడ్డి, కోకి రామిరెడ్డి పేర్లమీద ఆ భూమిని రిజిస్ట్రేషన్‌ చేశారు. తొలుత ఓ వ్యక్తి పేరుతో తప్పుడు ధ్రువీకరణ పత్రం సృష్టించారు.

ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్‌ను ఉపయోగించుకుని బాపట్ల మండలంలోని ఆ స్థలానికి నరసరావుపేట పరిధిలో రిజిస్ర్టేషన్‌ చేయించుకున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయానికి ఫోన్‌ చేసి వైసీపీ నేతల పేర్ల మీద ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేయాల్సిందిగా సిఫారసు చేశారని బాధితురాలు ఆరోపిస్తున్నారు.

కాగా, ఆ స్థలం స్వాధీన ధ్రువీకరణ పత్రాన్ని 2011లో జారీ చేసినట్లు రికార్డుల్లో చూపించగా, అది జారీ చేసిన వీఆర్‌వో 2010లోనే రిటైరవ్వడం గమనార్హం.


గతంలోనూ..

పేద ముస్లిం మహిళ స్థలాన్ని కాజేసిన వైసీపీ నేతలపై గతంలోనూ పలు భూ దందా ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వారు చేసిన భూదందాలకు కీలక నేతల అండదండలు లభించడంతో ఎంతోమంది బాధితులుగా మిగిలినట్లు సమాచారం.

అక్రమ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని గతంలోనే నరసరావుపేట పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, వైసీపీ గూండాలకే వత్తాసు పలికారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఽన్యాయం జరుగుతుందనే నమ్మకంతో ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేస్తున్నానని తెలిపారు.

Updated Date - Aug 20 , 2024 | 06:37 AM