గుంటూరు జిల్లాలో రాసలీలల నేతలు అవుట్!
ABN , Publish Date - Oct 11 , 2024 | 05:04 AM
గుంటూరు జిల్లా బీజేపీ నేతల రాసలీలలపై ఆ పార్టీ అధిష్ఠానం కన్నెర్ర చేసింది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో తాము కూడా ప్రభుత్వంలో భాగస్వాములనే ధీమా ఆ పార్టీ నేతల్లో ఎక్కువైంది.
రాజీనామా చేయించిన బీజేపీ నాయకత్వం
అశ్లీల కాల్‌లో ఉన్న మహిళా కార్యకర్తపైనా వేటు
గుంటూరు, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా బీజేపీ నేతల రాసలీలలపై ఆ పార్టీ అధిష్ఠానం కన్నెర్ర చేసింది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో తాము కూడా ప్రభుత్వంలో భాగస్వాములనే ధీమా ఆ పార్టీ నేతల్లో ఎక్కువైంది. పార్టీలో తాము ఎదగడానికి అడ్డు వస్తున్న వారిని తప్పించేందుకు వారి బలహీనతలను కోవర్టుల ద్వారా రికార్డు చేయించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. గత రెండ్రోజుల్లో జిల్లాకు చెందిన బీజేపీ ముఖ్య నేతలిద్దరు ఈ రాసలీలల ఊబిలో చిక్కుకున్నారు. గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు వనమా నరేంద్ర అదే పార్టీకి చెందిన ఓ మహిళా కార్యకర్తతో వీడియో కాల్‌లో జరిపిన అశ్లీల సంభాషణ వైరల్ కావడం తెలిసిందే.
ఆ వీడియో కాల్‌లో నరేంద్ర ఆ మహిళా కార్యకర్తతో మాట్లాడుతూ రేపు రాత్రికి పూల చీరతో రమ్మనడం.. కలిసి మందు కూడా కొడదామని ఆహ్వానించడం.. ఆమె కూడా ఏమాత్రం ప్రతిఘటించకుండా అశ్లీలంగా మాట్లాడడం మరింత వివాదమైంది. ఆ పార్టీ జిల్లా ముఖ్యులు కొందరు ఈ వీడియో క్లిప్పింగ్‌ను తమ నాయకత్వానికి పంపారు. మరుసటి రోజే జిల్లా మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర కమిటీ ఈసీ మెంబర్, మీడియా ప్యానలిస్టు అయిన పాటిబండ్ల రామకృష్ణ.. పూర్తి నగ్నంగా ఉండి వేరెవరికో వీడియో కాల్ చేస్తూ తన శరీరాన్ని చూపిస్తున్న వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో హోరెత్తింది.
ఈ రెండు సంఘటనలతో రాష్ట్ర నాయకత్వం ఉలిక్కిపడింది. వీరిద్దరి మూలంగా పార్టీ పరువు బజారున పడడంతో వెంటనే వారితో బలవంతంగా రాజీనామాలు చేయించింది. నరేంద్రతో అసభ్య సంభాషణలో పాలు పంచుకున్న బీజేపీ మహిళా కార్యకర్తను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇంకోవైపు.. పాటిబండ్ల రామకృష్ణ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. వైరల్ అవుతున్న వీడియోకు, తనకు ఎటువంటి సంబంధం లేదని, తన ఫేస్‌ను మార్ఫింగ్ చేసి తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు.
దీనిపై గుంటూరు సైబర్ క్రైమ్‌స్టేషన్‌లో ఆన్‌లైన్‌లో ఫిర్యాదు కూడా దాఖలు చేసినట్లు తెలిపారు. వనమా నరేంద్ర ఇంతవరకు బహిరంగంగా స్పందించలేదు. అయితే తనను పదవి నుంచి తప్పించేందుకు పార్టీ నేతలే కొందరు రచ్చకీడ్చారని నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. జిల్లాకు చెందిన మరో బీజేపీ నేతకు చెందిన వీడియో త్వరలో సోషల్ మీడియాలో రానుందని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం రావడంతో అందులో భాగస్వామిగా ఉన్న బీజేపీ నేతలు కూడా ప్రభుత్వ నామినేటెడ్ పదవుల రేసులో ఉన్నారు. ఈ రేసులో తమకు అడ్డుగా ఉన్నవారిని తప్పించేందుకు వారి బలహీనతలను తెలుసుకుని కోవర్టుల ద్వారా వలపు వల విసిరి.. వాటిని రికార్డు చేసి వారి ప్రతిష్ఠనే కాకుండా పార్టీ పరువును కూడా దిగజారుస్తున్నారని జిల్లా సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.