CBI Nabs : తిరుపతి సెంట్రల్ జీఎస్టీ కార్యాలయంపై సీబీ‘ఐ’
ABN , Publish Date - Dec 18 , 2024 | 04:34 AM
తిరుపతిలోని సెంట్రల్ జీఎస్టీ కమిషనరేట్‌లో టాక్స్ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేస్తున్న బాలాజీ ..
ఓ కంపెనీ నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇన్‌స్పెక్టర్
కార్యాలయంలోనే ఆయనతో పాటు, కంపెనీ ప్రతినిధీ అరెస్టు
అసిస్టెంట్ కమిషనర్, సూపరింటెండెంట్‌పైనా కేసు
తిరుపతి/విశాఖపట్నం, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని సెంట్రల్ జీఎస్టీ కమిషనరేట్‌లో టాక్స్ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేస్తున్న బాలాజీ రూ.3.20 లక్షలు లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుబడ్డారు. తిరుపతిలోని సెంట్రల్ జీఎస్టీ కమిషనరేట్ కార్యాలయ అధికారులు తమ విధుల్లో భాగంగా వివిధ ప్రైవేటు సంస్థల కార్యాలయాలను తనిఖీ చేస్తుంటారు. పన్ను ఎగవేతలను గుర్తించి చర్యలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో సెంట్రల్ జీఎస్టీ ఇన్‌స్పెక్టర్ బాలాజీ గత నెల 5న చిత్తూరు మండలం తాళంబేడులోని అబ్సల్యూట్ షైన్ అనే ప్రైవేటు సంస్థ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఆ సంస్థకు సంబంధించిన పలు డాక్యుమెంట్లు తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నారు. అందులో నిబంధనల ఉల్లంఘనలను గుర్తించారు. తదుపరి చర్యలు చేపట్టకుండా ఉండేందుకు రూ.10 లక్షలు లంచం డిమాండు చేశారు. ఈ వ్యవహారంలో తిరుపతి సెంట్రల్ జీఎస్టీ కమిషనరేట్‌లోని అసిస్టెంట్ కమిషనర్ జగన్నాథ్ ప్రసాద్, సూపరింటెండెంట్ జగన్నాయక్‌ను కూడా బాలాజీ కలుపుకొన్నారు. అధికారులకు, కంపెనీ ప్రతినిధులకు నడుమ సంప్రదింపులు కొనసాగుతుండగా.. సమాచారం అందుకున్న సీబీఐ వారిపై నిఘా ఉంచిం ది. మంగళవారం తిరుపతి కమిషనరేట్‌లో ఇన్‌స్పెక్టర్ బాలాజీకి చిత్తూరు సంస్థ ప్రతినిధి గణేశ్ రాం మహేదర్ చౌదరి రూ.3.20 లక్షలు లంచం అందజేస్తుండగా విశాఖపట్టణానికి చెందిన సీబీఐ అధికారుల బృందం హఠాత్తుగా దాడి చేసి పట్టుకుంది. నగదు స్వాధీనం చేసుకుని వారిద్దరినీ అరెస్టు చేసింది. దీనికి సంబంధించి సీబీఐ అధికారులు చిత్తూరు కంపెనీ ప్రతినిధి, ఇన్స్‌పెక్టర్ బాలాజీ, అసిస్టెంట్ కమిషనర్, సూపరింటెండెంట్‌లతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. మరోవైపు తిరుపతి కమిషనరేట్‌లోనూ, కడపలో ఇన్‌స్పెక్టర్ బాలాజీ నివాసంలోనూ సీబీఐ తనిఖీలు చేపట్టింది.