Nara Lokesh: మంత్రి లోకేశ్‌కు ఘన స్వాగతం
ABN , Publish Date - Sep 20 , 2024 | 02:34 AM
యువగళం పాదయాత్రలో భాగంగా ఇచ్చిన తొలి హామీ నెరవేర్చడానికి యువనేత నారా లోకేశ్ గురువారం రాత్రి 11.20 గంటలకు బంగారుపాళ్యం చేరుకున్నారు.
చిత్తూరు, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): యువగళం పాదయాత్రలో భాగంగా ఇచ్చిన తొలి హామీ నెరవేర్చడానికి యువనేత నారా లోకేశ్ గురువారం రాత్రి 11.20 గంటలకు బంగారుపాళ్యం చేరుకున్నారు. ఆయనకు తిరుపతి విమానాశ్రయం నుంచి అడుగడుగునా టీడీపీ శ్రేణులు, జనం పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. రాత్రి 11 గంటల సమయంలోనూ చిత్తూరు శివార్లలో ఇరువారం బైపాస్ రోడ్డుపైకి వచ్చి మంత్రి లోకేశ్‌కి స్వాగతం పలికారు. విమానాశ్రయంలో తిరుపతి జిల్లా కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున స్వాగతం పలికారు. నేండ్రగుంట వద్ద చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో.. చిత్తూరు ఇరువారం బైపాస్ వద్ద చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు భారీఎత్తున స్వాగతం పలికారు. బంగారుపాళ్యంలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు ఎన్‌పీ జయప్రకాష్ నాయుడితోపాటు పూతలపట్టు నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. తిరుపతి విమానాశ్రయంలో స్వాగతం పలికిన వారిలో ఎమ్మెల్యేలతోపాటు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు తదితరులు ఉన్నారు.
నేడే తొలి హామీ అమలు
- బంగారుపాళ్యంలో డయాలసిస్ యూనిట్‌ను ప్రారంభించనున్న మంత్రి నారా లోకేశ్
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా మంత్రి నారా లోకేశ్ గత ఏడాది చేపట్టిన యువగళం పాదయాత్ర తొలి హామీని శుక్రవారం అమలు చేయనున్నారు. నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు తొలి అడుగు మన జిల్లాలోనే పడింది. వైసీపీ ప్రభుత్వం సృష్టించిన ఆటంకాలను అధిగమించి 2023 జనవరి 27వ తేదీన కుప్పం నుంచి యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా యువనేత ప్రతి వంద కిలోమీటర్లకు శిలాఫలకం ఏర్పాటుచేసి ఓ హామీ ఇచ్చారు. అభివృద్ధి పనులు, శాశ్వత పరిష్కారాలే లక్ష్యంగా ఉమ్మడి జిల్లాలో మొత్తం ఐదు చోట హామీలిచ్చారు. వాటిలో తొలి హామీ బంగారుపాళ్యంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు. గత ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన వంద కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా బంగారుపాళ్యంలో వంద కిలోమీటర్ల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పూతలపట్టు నియోజకవర్గంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ చేసుకోవడానికి దూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్నారని స్థానిక టీడీపీ నాయకులు అప్పట్లో లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పడిన తొలి వంద రోజుల్లోనే తొలి హామీని అమలు చేస్తున్నారు.
రూ.2.50 కోట్లతో యంత్రాల ఏర్పాటు
మంత్రి అభ్యర్థనతో కేంద్రం ప్రభుత్వం పీఎం నేషనల్ డయాలసిస్ ప్రోగ్రామ్ కింద రూ.50 లక్షల విలువ చేసే ఐదు యంత్రాలను బంగారుపాళ్యం ప్రభుత్వ ఆస్పత్రికి కేటాయించింది. ఇవి ఈ మధ్య ఆస్పత్రికి చేరుకున్నాయి. కొత్తగా నిర్మించిన ఆస్పత్రి భవనంలో వీటిని అమర్చారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న సుమారు 30 మంది ఇప్పటికే డయాలసిస్ కోసం తమ పేర్లు నమోదు చేసుకున్నారు.