Tirumala: తిరుమలలో గోవింద నామాలే వినిపించాలి: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Oct 05 , 2024 | 10:17 AM
అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు, తిరుమల వెంకటేశ్వరస్వామికి పూర్వ వైభవం తీసుకొస్తామని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ హయాంలో తిరుమలలో అన్నదానం ప్రారంభమైందని గుర్తుచేశారు.ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా నిత్యం మూడు లక్షల మందికి అన్నదానం చేస్తున్నామని వివరించారు. తిరుమల గిరుల్లో గోవింద నామాలే వినిపించాలని అధికారులకు స్పష్టం చేశారు.
తిరుమల: తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అధికారులకు కీలక సూచనలు చేశారు. తిరుమల కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని స్పష్టం చేశారు. తిరుమల తిరుపతిలో ప్రశాతంతకు భంగం కలగకూడదు తేల్చి చెప్పారు. భక్తుల మనోభావాలకు సంబంధించి ఏ విషయంలోనూ రాజీ పడొద్దని కుండబద్దలు కొట్టారు. పద్మావతి అతిథి గృహంలో తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి, టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఫీడ్ బ్యాక్ కంపల్సరీ
తిరుమలలో అందిస్తోన్న సేవలపై భక్తుల నుంచి స్పందన గురించి అధికారులను సీఎం చంద్రబాబు అడిగారు. తిరుమల వచ్చిన ప్రతి భక్తుడి అనుభవాల గురించి అభిప్రాయం చెప్పే అవకాశం కల్పించాలని సూచించారు. భక్తుల సలహాలు, సూచనలతో మరింత మెరుగ్గా సేవలు అందించొచ్చని పేర్కొన్నారు. ఒక్క తిరుమలలోనే కాక మిగతా ఆలయాల్లో కూడా భక్తుల అభిప్రాయం తీసుకునేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి సూచించారు.
పెరిగిన నాణ్యత
తిరుమల లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు అంటున్నారు. ఇది ఇలానే కొనసాగాలి, సేవలు మరింత మెరుగుపడాలని సీఎం చంద్రబాబు అభిప్రాయ పడ్డారు. ప్రసాదాల తయారీలో వాడే పదార్థాల నాణ్యత బాగుండేలా చూడాలని కోరారు. ఉత్తమ పదార్థాలు మాత్రమే వాడాలని స్పష్టం చేశారు. తిరుమల ఆలయంలో వీఐపీ సంస్కృతి తగ్గాలని అభిప్రాయ పడ్డారు. ఆలయానికి ప్రముఖులు వచ్చిన సమయంలో హడావుడి కనిపించకూడదు అన్నారు. ఆధ్యాత్మిక ఉట్టిపడేలా అలంకరణ ఉండాలే తప్ప ఆర్భాటం, అనవసర వ్యయం వద్దని సీఎం చంద్రబాబు హితవు పలికారు.
హుందాగా వ్యవహరించాలి
‘టీటీడీ సిబ్బంది పట్ల భక్తులు గౌరవంగా నడుచుకోవాలి. విదేశాల నుంచి వచ్చే భక్తులను గౌరవించాలి. భక్తులు సంతృప్తిగా, అనుభూతితో కొండ నుంచి తిరిగి వెళ్లాలి. తిరుమల పేరు తలిస్తే ఏడుకొండల శ్రీవారి వైభవం, ఆధ్యాత్మిక మాత్రమే చర్చకు రావాలి. స్విమ్స్ సేవలు మెరుగుపరచాలి. తిరుమల ప్రత్యేక క్షేత్రం. ఆలయ పవిత్రత కాపాడటం, ఆధ్యాత్మిక విషయంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలి అని’ సీఎం చంద్రబాబు సూచించారు.
అటవీప్రాంతం పెంచాలి
‘భవిష్యత్ అవసరాలకు తగినట్టు నీటి లభ్యత ఉండేలా చూసుకోవాలి. నీటి కోసం ముందస్తు ప్రణాళిక చాలా అవసరం. అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80 శాతంపైగా పెంచాలి. అటవీ సంరక్షణతో పాటు అడవుల విస్తరణ కోసం వచ్చే ఐదేళ్లకు ప్రణాళికతో పనిచేయాలి. బయోడైవర్సీటీ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యల ఏంటీ అని’ అధికారులను సీఎం చంద్రబాబు వివరాలు అడిగి తెలుసుకున్నారు.