Tirumala..టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డిపై కేసు
ABN , Publish Date - Sep 24 , 2024 | 07:14 AM
తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వు కల్తీ అంశం తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి సోమవారం అత్యుత్సాహం ప్రదర్శించారు. తిరుమలలో రెచ్చగొట్టేలా ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయనంటూనే నిబంధనలను ఉల్లఘించి మాట్లాడారు.
తిరుమల: వైసీపీ నేత (YCP Leader), టీటీడీ మాజీ చైర్మన్ (TTD Ex Chairman) భూమన కరుణాకర్ రెడ్డిపై (Bhumana Karunakar Reddy) పోలీసులు కేసు (Case) నమోదు చేశారు. తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేయకూడదని నోటీసు ఇచ్చినప్పటికీ.. ఆయన ఉల్లంఘించారని కేసు నమోదు చేశారు. అలాగే అఖిలాండం వద్ద ప్రమాణం చేసిన ఘటనపై కేసు నమోదు చేశారు. సేక్షన్ 189(2)196 223 r/w (3)299r/w62 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వు కల్తీ అంశం తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి సోమవారం అత్యుత్సాహం ప్రదర్శించారు. తిరుమలలో రెచ్చగొట్టేలా ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయనంటూనే నిబంధనలను ఉల్లఘించి మాట్లాడారు. గత ప్రభుత్వంలో టీటీడీ బోర్డు, అధికారులు రివర్స్ టెండరింగ్‌తో నెయ్యి టెండర్ల నిబంధనలు మార్చారని, అనుభవం లేని వ్యక్తులకు నెయ్యి సరఫరా అప్పగించడంతో నెయ్యిలో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భూమన కరుణాకరరెడ్డి తాను ఏ తప్పు చేయలేదని స్వామి సన్నిధిలోనే ప్రమాణం చేయడానికి వస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుమల అదనపు ఎస్పీ రామకృష్ణ, డీఎస్పీ విజయ్‌శేఖర్, విజిలెన్స్ అధికారులు, సిబ్బంది భారీగా ఆలయం వద్దకు చేరుకున్నారు. తిరుమలలో రెచ్చేగొట్టేలా రాజకీయాలు మాట్లాడకూడదంటూ భూమనకు నోటీసులు ఇవ్వాలని భావించిన పోలీసులు తిరుమల జీఎన్సీ టోల్‌గేట్ వద్దకు చేరుకున్నారు. ఎంపీ గురుమూర్తి, తన కుమారుడు అభినయ్‌రెడ్డితో కలిసి జీఎన్సీ వద్దకు చేరుకున్న భూమనను పోలీసులు అడ్డుకున్నారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడటానికి వీలులేదని నోటీసులు అందజేశారు. తాను రాజకీయాలు మాట్లాడేందుకు రాలేదని, కేవలం పుష్కరిణిలో స్నానం చేసి కొబ్బరికాయ కొట్టి వెళ్లిపోతానని భూమన పోలీసులకు చెప్పి నోటీసుపై సంతకం చేసిచ్చారు. దీంతో పోలీసులు ఆయన్ను అనుమతించారు.
నేరుగా వరాహస్వామిని దర్శించుకుని పుష్కరిణిలో స్నానం చేశారు. అక్కడి నుంచి మాడవీధిలోకి రాగానే తిరుమల టీడీపీ నేతలు ఎదురుగా వచ్చి ‘గోవిందా గోవిందా’ అంటూ నినదించారు. అక్కడి నుంచి ఆలయం ముందున్న అఖిలాండం వద్దకు చేరుకున్న కరుణాకరరెడ్డి హారతినిచ్చి కొబ్బరికాయ కొట్టారు. పోలీసులు, విజిలెన్స్ అధికారులు పక్కనే ఉన్నప్పటికీ నోటీసుల నిబంధనలకు విరుద్ధంగా కరుణాకరరెడ్డి రాజకీయ ప్రసంగం చేశారు. హారతి పడుతూ దేవుడిని ప్రార్థిస్తున్నట్టుగా రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ‘నమో వెంకటేశాయా, వేలవేల దండాలు, అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడికి దండాలు. మూడు సార్లు టీటీడీ బోర్డు చైర్మన్‌గా అవకాశమిచ్చిన స్వామికి దండాలు. గత కొద్ది రోజులుగా నా మనసు కలత చెందుతోంది. నిప్పుల కొలిమిలో నిలబడినట్టుగా ఉంది. సర్వజగత్ రక్షకుడైనా ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషేధం, అపచారం. పవిత్రమైన క్షేత్రంలో నీ ఆలయంలో.. దేవదేవ లడ్డూ కళంకితమైనదని కలుషిత రాజకీయమనసు ఉండే వ్యక్తులు అత్యంతదారుణంగా ప్రవర్తిస్తున్నారు’ అంటూ వ్యాఖ్యలు చేస్తుండగా డీఎస్పీ విజయ్‌శేఖర్ అడ్డుకున్నారు. తిరుపతికి తరలించారు. భక్తుల మనోభావాలు దెబ్బతీశారనే కారణంతో దాదాపు ఐదు సెక్షన్ల కింద భూమన కరుణాకర్‌రెడ్డిపై తిరుమల వన్‌టౌన్ పోలీస్టేషన్‌లో కేసు నమోదైంది.
మేం తప్పు చేసుంటే రక్తం కక్కి చనిపోవాలి: భూమన
‘కల్తీ నెయ్యిలో తప్పు చేసి ఉంటే మా కుటుంబం సర్వనాశనమై, రక్తం కక్కి చనిపోవాలని, పుష్కరిణిలో మునిగి పంచభూతాల సాక్షిగా ఏ తప్పూ చేయలేదని ప్రమాణం చేశా. శుద్ధి చేయాల్సింది శ్రీవారి ఆలయాన్ని కాదు, చంద్రబాబు నాలుకను’ అని భూమన అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News