Share News

Chintamohan: కోడి కత్తి దాడి ఓ నాటకం.. శ్రీను ప్రాణాలు తీసేందుకు యత్నం

ABN , Publish Date - Jan 27 , 2024 | 01:56 PM

Andhrapradesh: విశాఖ విమానాశ్రయంలో జరిగిన కోడి కత్తి దాడి ఒక నాటకం అని కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... విశాఖ విమానాశ్రయంలోకి గుండుసూది కూడా ప్రవేశించలేని పటిష్ట భద్రత ఉంటుందని.. కోడి కత్తి దాడిలో జగన్ దేహం నుంచి రక్తం ఎలా వచ్చిందని ప్రశ్నించారు.

Chintamohan: కోడి కత్తి దాడి ఓ నాటకం.. శ్రీను ప్రాణాలు తీసేందుకు యత్నం

తిరుపతి, జనవరి 27: విశాఖ విమానాశ్రయంలో జరిగిన కోడి కత్తి దాడి (Kodi kathi Case) ఒక నాటకం అని కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ (Congress Leader Chintamohan) వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... విశాఖ విమానాశ్రయంలోకి గుండుసూది కూడా ప్రవేశించలేని పటిష్ట భద్రత ఉంటుందని.. కోడి కత్తి దాడిలో జగన్ (CM Jagan) దేహం నుంచి రక్తం ఎలా వచ్చిందని ప్రశ్నించారు. నిందితుడు శ్రీను వద్ద కత్తి లేదని భద్రతా సిబ్బంది స్పష్టం చేసిందన్నారు. కోడి కత్తి నిందితుడు శ్రీను ప్రాణాలు తీసేందుకు అధికార పార్టీ సిద్ధంగా ఉందన్నారు. దాడి కేసు విషయంలో కోర్టులు, పోలీసులు, వైద్యులు విఫలమయ్యారని తెలిపారు. దళితుడు, అమాయకుడు శ్రీనును ఇరికించడం అన్యాయమన్నారు. శ్రీనును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఓట్ల కోసం దుర్మార్గానికి పాల్పడిన సీఎం జగన్.. దళిత ద్రోహిగా మిగిలిపోతారన్నారు. నిరుద్యోగ ద్రోహి చంద్రబాబు నాయుడు అంటూ మండిపడ్డారు. దుగ్గరాజపట్నం వద్దు అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అన్నారు. తిరుపతిలో 7,800 బెడ్ రూం ఇళ్లు నిలిపి వేసిన వ్యక్తి చంద్రబాబు అని వ్యాఖ్యలు చేశారు.


అధికారంలోకి వస్తున్నాం...

దళితులు, ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని చెప్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఈనెల 28న తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్‌కు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల రానున్నారని.. షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతోందని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 130 సీట్లతో పాటు 25 పార్లమెంట్ స్థానాలకు 20 స్థానాలు కైవసం చేసుకుంటుందని చింతా మోహన్ ఆశాభవం వ్యక్తం చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 27 , 2024 | 02:06 PM