Share News

Tirumala: లడ్డూ వివాదంపై భక్తుల మనోగతం

ABN , Publish Date - Sep 21 , 2024 | 01:49 AM

దాదాపు 310 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీవారి లడ్డూ ప్రసాదంపై వివాదం రగిలింది. లడ్డూలకు వినియోగించే ఆవు నెయ్యిలో జంతువుల కొవ్వు, చేప నూనె అవశేషాలు కలిశాయన్న ప్రచారంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Tirumala: లడ్డూ వివాదంపై భక్తుల మనోగతం
తిరుమల లడ్డూ ప్రసాదం

తిరుపతి/తిరుమల,ఆంధ్రజ్యోతి: తిరుపతి వెళ్లొచ్చామంటే.. మన చుట్టుపక్కల వాళ్లు అడిగే ప్రశ్న.. లడ్డూ ప్రసాదం ఎక్కడ? అందుకే తిరుమలకు వచ్చిన భక్తులు వీలైనన్ని ఎక్కువ లడ్డూలను తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తారు. తలాకొంచెం ప్రసాదంగా పెడతారు. ఇదీ కొండ లడ్డూకున్న ప్రత్యేకత. దీని రుచి, సువాసన ప్రపంచంలో మరే లడ్డూకు లేదంటే అతిశయోక్తి కాదు. అందుకే తిరుమల లడ్డూకు పేటెంట్‌ దక్కింది. దాదాపు 310 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీవారి లడ్డూ ప్రసాదంపై వివాదం రగిలింది. లడ్డూలకు వినియోగించే ఆవు నెయ్యిలో జంతువుల కొవ్వు, చేప నూనె అవశేషాలు కలిశాయన్న ప్రచారంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మనసు చివుక్కుమంటోందని ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు అలిపిరి, తిరుమలలో ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు.

ఎప్పుడూ వినలేదిలా.. : సుజాత, నెల్లూరు

పవిత్ర పుణ్యక్షేత్రమై తిరుమల గుడిలో ఇలాంటి అపచారం జరిగిందని ఎప్పుడూ వినలేదు. దేవుడి ప్రసాదంగానే భావిస్తున్నాం కాబట్టి అలాంటి వివాదాలను పట్టించుకోలేదు. నిజమని నమ్మడంలేదు. ప్రస్తుతం తీసుకున్న లడ్డూ ప్రసాదం బాగానే ఉంది.

భరించరాని తప్పిదమిది : చంద్రిక, ప్రకాశం

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం ఎప్పుడు జరిగినా భరించరాని తప్పిదమది. శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తులను మాత్రమే తనిఖీ చేయడం కాదు. అన్న ప్రసాదాలకు వచ్చే ముడిసరుకులను కూడా ల్యాబ్‌లో క్షుణ్ణంగా పరిశీలించాలి. ప్రతివస్తువు నాణ్యతగా ఉండేలా చూసుకోవాలి. ప్రభుత్వం మారిందికాబట్టి ఇకనైనా జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి : జగదీష్‌, నెల్లూరు

వెంకన్న లడ్డూ తయారీలోనూ కక్కుర్తి పడతారని ఎవరూ అనుకోలేదు. తెలిసి చేసినా, తెలియక చేసినా ఇది ఘోర తప్పిదమే. లడ్డూకు వాడిన నెయ్యి కల్తీగురించి సీఎం చంద్రబాబు చెప్పగానే ఇది నిజం కాకపోతే బాగుండు అనిపించింది. అయితే ల్యాబ్‌ రిపోర్టులోనూ నిర్ధారణ కావడంతో బాధ కలిగింది. దీనికి కారకులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.


ఇప్పుడు లడ్డూలు బాగున్నాయి : ముత్తువేలు, బెంగళూరు

ఐదుగురు మిత్రులతో కలిసి బెంగళూరు నుంచి తిరుమలకు వస్తున్నప్పుడే లడ్డూలో వాడే నెయ్యి కల్తీ విషయం తెలిసింది. చాలా బాధపడ్డాం. గతంలో కల్తీ నెయ్యితో తయారైన లడ్డూలు తిన్నవారు ఎంత మదన పడుతుంటారో? ఇప్పుడు మేము ఐదేసి లడ్డూల చొప్పున తీసుకున్నాం. ఇప్పుడు లడ్డూ బాగుంది.

శుద్ధి కార్యక్రమాలు చేపట్టాలి: రమణదీక్షితులు, మాజీ ప్రధాన అర్చకుడు

ఏదైనా అపచారం జరిగితే ఆలయం శుద్ధి చేపట్టాలని ఆగమశాస్త్రంలో ఉంది. ఆగమ సలహామండలి సభ్యుల ద్వారా సలహాలు తీసుకుని ఆ కార్యక్రమాలు చేపట్టాలి. అయితే ప్రస్తుతమున్న ఆగమ సలహామండలిలో ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. వారికి స్వతంత్ర అభిప్రాయాన్ని చెప్పే ధైర్యం లేదు. వైఖానస ఆగమశాస్త్రంలో అనుభవం ఉన్న వారిని సంప్రదించి శుద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. శాస్త్రం ప్రకారం శుద్ధి చేసి స్వామిని తృప్తిపరిస్తేనే మనకు మేలు.

Updated Date - Sep 21 , 2024 | 01:49 AM