Share News

Srikalahasthi: స్వర్ణమ్మకు హారతులు

ABN , Publish Date - Dec 01 , 2024 | 12:49 AM

కార్తీక మాసం అమావాస్యను పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో శనివారం సాయంత్రం స్వర్ణమ్మకు హారతుల సమర్పణ వేడుకగా జరిగింది.

Srikalahasthi: స్వర్ణమ్మకు హారతులు
స్వర్ణముఖి నదీమతల్లికి హారతులిస్తున్న వేదపండితులు - గంగాదేవికి పూజలు

శ్రీకాళహస్తి, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): కార్తీక మాసం అమావాస్యను పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో శనివారం సాయంత్రం స్వర్ణమ్మకు హారతుల సమర్పణ వేడుకగా జరిగింది.పవిత్ర నదిలో గంగా హారతులను దర్శించుకున్న జనం భక్తి పారవశ్యంతో తన్మయత్వం చెందారు. స్వర్ణముఖి నదిలోని సద్యోముక్తి ప్రదేశం వద్ద హారతులు సమర్పించారు.అంతకుముందు ముక్కంటి ఆలయంలో గంగాదేవి ఉత్సవమూర్తిని విశేషంగా అలంకరించి స్వర్ణముఖి నదిలోని సద్యోముక్తి ప్రదేశం వరకు మంగళవాయిదాలు, మేళతాళాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి కొలువుదీర్చారు. పండితులు వేదోక్తంగా నదీజలాలకు, అమ్మవారి ఉత్సవమూర్తికి విశేష పూజలు చేశారు. ఆ తరువాత నిర్విఘ్న కార్యసిద్ధి సంకల్పంతో గణపతి పూజ, స్థల శుద్ధి కోసం పుణ్యాహ వాచనం, గంగాదేవికి శాస్త్రోక్తంగా సారె సమర్పణ చేశారు. అనంతరం అర్చకులు మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వర్ణమ్మకు ద్వాదశ హారతులు పట్టారు. ఆగమ నియమాల ప్రకారం వివిధ రకాల హారతులను వరుసగా గంగమ్మకు సమర్పించారు.వేదఘోష మధ్య దీపకాంతులను దర్శిస్తూ పలువురు భక్తులు నదిలో దీపాలు వెలిగించి వదిలారు.నదీ హారతుల సందర్బంగా ఈ ఏడాది ఏర్పాటు చేసిన లేజర్‌షో ఆకట్టుకుంది. స్వర్ణముఖి నది పడమర గట్టు నుంచి లేజర్‌ కిరణాలు హారతులు సమర్పించే ప్రాంతం, నదీజలాలు, రాజగోపురం, ముక్కంటి ఆలయ ఆలయ గోపురకలశాలు, భక్తకన్నప్ప కొండను తాకడాన్ని భక్తులు ఆసక్తిగా వీక్షించారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, బొజ్జల బృందమ్మ, ముక్కంటి ఆలయ ఈవో బాపిరెడ్డి, టీడీపీ నాయకులు విజయకుమార్‌, చెంచయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే శ్రీకాళహస్తిలో శనివారం వేకువజాము నుంచి సాయంత్రం వరకు వర్షం విడవకుండా కురిసింది.


నదీ హారతుల కోసం ముక్కంటి ఆలయం నుంచి గంగాదేవి ఉత్సవమూర్తి బయలుదేరిన వెంటనే వర్షం నిలిచిపోయింది.హారతుల ఘట్టం ముగిసిన తరువాత వర్షపు జల్లులు యధావిధిగా కొనసాగాయి.

Updated Date - Dec 01 , 2024 | 12:49 AM