Theft ఎస్బీఐ ఏటీఎంలో రూ.39 లక్షల చోరీ
ABN , Publish Date - Aug 31 , 2024 | 12:59 AM
చంద్రగిరి పట్టణం కొత్తపేటలోని కోసూరి కాంప్లెక్స్‌లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో గురువారం రాత్రి చోరీ జరిగింది.
చంద్రగిరి, ఆగస్టు 30: చంద్రగిరి పట్టణం కొత్తపేటలోని కోసూరి కాంప్లెక్స్‌లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో గురువారం రాత్రి చోరీ జరిగింది. శుక్రవారం ఉదయం స్థానికులు ఏటీఎంలో చోరీ జరిగిందని పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ రామయ్య, సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఏటీఎంను పరిశీలించి, వేలిముద్రల నిపుణులను, డాగ్ స్వ్కాడ్‌ను రప్పించారు. వేలి ముద్రలు సేకరించిన అనంతరం సీసీ ఫుటేజ్‌ను పరిశీలించగా గురువారం రాత్రి 1.30 నుంచి 2.30 గంటల మధ్యలో ఓ దుండగుడు సెక్యూరిటీ గార్డు ముసుగులో ఏటీఎం రూములో చొరబడ్డాడు.
ఏటీఎం డిజిటల్ పాస్‌వర్డ్‌ను కీ ప్యాడ్‌ను పగలగొట్టి అందులో ఉన్న రూ.39 లక్షల నగదును ఎత్తుకెళ్లాడు. ఏఎస్పీ నాగభూషణం, క్రైమ్ డీఎస్పీ రమణకుమార్ కూడా ఏటీఎంను పరిశీలించారు. బ్యాంక్ అధికారులు ఇచ్చిన ఫిర్యా దు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇప్పటివరకూ ఏటీఎంలను గ్యాస్ కట్టర్‌తో పగులగొట్టి నగదును చోరీ చేసేవారు.ఈసారి డిజిటల్ లాక్ కీ ప్యాడ్‌ను పగలగొట్టి చోరీ చేయడం చూస్తుంటే ఇది ఏటీఎం టెక్నీషియన్ పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.చోరీ చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు చంద్రగిరి పోలీసులతో ఒక బృందాన్ని, తిరుపతి క్రైమ్ పోలీసులతో మరో బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఏఎస్పీ నాగభూషణం తెలిపారు. చోరీ జరిగిన ఎస్బీఐ ఏటీఎంను ఎస్పీ సుబ్బరాయుడు శుక్రవారం రాత్రి పరిశీలించారు.భద్రతా ఏర్పాట్లపై బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం వలనే చోరీ జరిగిందంటూ అసహనం వ్యక్తం చేశారు.ఇకపై ఏటీఎంల వద్ద ఖచ్చితంగా సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలని బ్యాంక్ అధికారులకు సూచించారు. ఆయన వెంట డీఎస్పీ రమణకుమార్, సీఐ రామయ్య ఉన్నారు.