Promoted ముగ్గురు డీఎస్పీలకు పదోన్నతి
ABN , Publish Date - Aug 31 , 2024 | 01:04 AM
జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న ముగ్గురు డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ డీజీపీ ద్వారకా తిరుమల రావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
తిరుపతి(నేరవిభాగం), ఆగస్టు 30: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న ముగ్గురు డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ డీజీపీ ద్వారకా తిరుమల రావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సీఐ నుంచి డీఎస్పీ వరకు పనిచేసిన ఐ.రామకృష్ణ ఇంటెలిజెన్సులో పనిచేస్తున్నప్పటికీ డిప్యుటేషన్‌పై పోలీసు శిక్షణ కళాశాలలో డీఎస్పీగా ఉన్నారు. ఆయన అనుభవం, పరిపాలనా పరంగా తిరుమలలో శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమని భావించిన ప్రభుత్వం తిరుమల శాంతి భద్రతల ఏఎస్పీగా నియమించింది.
అలాగే ఏఎస్పీగా పదోన్నతి పొందిన రవిమనోహరాచారి.. ఎస్‌ఐ క్యాడర్ నుంచి డీఎస్పీ వరకు చిత్తూరు, మదనపల్లె, తిరుపతి ఎస్బీ, సీఐడీ, ఇంటెలిజెన్సు, ఈస్ట్, తిరుపతి డీఎస్పీగా పనిచేశారు. మొన్న జరిగిన డీఎస్పీల బదిలీల్లో సీఐడీ విభాగానికి బదిలీ అవగా, ఇప్పటి వరకు విధుల్లో చేరలేదు. సెలవుపై ఉన్నారు. దీంతో ఆయన్ను తిరుపతి శాంతి భద్రతల విభాగానికి ఏఎస్పీగా బదిలీ చేశారు. ఇక రేణిగుంట డీఎస్పీగా పనిచేస్తున్న వెంకటాద్రికి పదోన్నతి కల్పించిన ప్రభుత్వం మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేసుకోవాలని పేర్కొంది. వారం కిందట తిరుపతి శాంతి భధ్రతల ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నాగభూషణరావును మళ్లీ తిరుపతి క్రైం అదనపు ఎస్పీగా నియమించింది.