SVU: ఎస్వీయూలో ముగిసిన యువ తరంగ్
ABN , Publish Date - Nov 11 , 2024 | 01:17 AM
ఎస్వీయూలో మూడు రోజులుగా నిర్వహించిన ‘యువతరంగ్’ కార్యక్రమం ఆదివారం ముగిసింది. విజేతలకు బహుమతులు అందజేశారు.
తిరుపతి (విశ్వవిద్యాలయాలు) నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఎస్వీయూలో మూడు రోజులుగా నిర్వహించిన ‘యువతరంగ్’ కార్యక్రమం ఆదివారం ముగిసింది. విజేతలకు బహుమతులు అందజేశారు. శ్రీనివాసా ఆడిటోరియంలో సాయంత్రం నిర్వహించిన ముగింపు సభలో పూతలపట్టు ఎమ్మెల్యే కె.మురళీమోహన్ ప్రసంగించారు. యూనివర్సిటీ జీవితం ఓ మరుపురాని తియ్యటి జ్ఞాపకమంటూ తాను ఎస్వీయూ పీజీ, పీహెచ్‌డీ చదువుకున్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. యూనివర్సిటీ చదువులు జీవితాన్ని కీలక మలుపు తిప్పుతాయని తన జీవితం నిరూపించిందన్నారు. ఎస్వీ యూనివర్సిటీ పూర్వ విద్యార్థిగా వర్సిటీ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. క్రీడా సాంస్కృతిక విషయాల్లో పాల్గొనడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం పెరుగుతుందన్నారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసి ఆయా రంగాల్లో వారిని ప్రోత్సహించడానికి యువ తరంగ్ నిర్వహించామని ఇన్‌చార్జి వీసీ అప్పారావు తెలిపారు. యువ తరంగ్‌లో విద్యార్థుల ఉత్సాహం చూస్తుంటే తనకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని రిజిస్ట్రార్ భూపతి నాయుడు అన్నారు. వివిధ సాంస్కృతిక పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, జ్ఞాపికలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ కల్చరల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ పత్తిపాటి వివేక్ చౌదరి, స్టూడెంట్ అఫైర్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ మురళీధర్, ఎన్‌ఎ్‌సఎ్‌స కో-ఆర్డినేటర్ డాక్టర్ పాకనాటి హరికృష్ణ యాదవ్, అకడమిక్ కో-ఆర్డినేటర్ డాక్టర్ కళ్యాణ్, విద్యార్థులు, ఉద్యోగులు, కళాకారులు పాల్గొన్నారు.