Share News

CID : కమీషన్లకే కిక్కు

ABN , Publish Date - Aug 21 , 2024 | 04:25 AM

మద్యం కేసులో సీఐడీ అధికారులు ఉచ్చు బిగిస్తున్నారు. ఊహకు అందని విధంగా జగన్‌ సర్కారు చేసిన దోపిడీపై కూపీ లాగుతున్నారు. సీఐడీ అధికారులు తాజాగా మద్యం డిస్టిలరీస్‌ యజమానుల్ని పిలిచి అత్యంత విలువైన సమాచారం సేకరించారు.

CID :  కమీషన్లకే కిక్కు

  • ‘మద్యం’ గుట్టు విప్పుతున్న డిస్టిలరీ యజమానులు

  • జగన్‌ సర్కారు దోపిడీపై సీఐడీ కూపీ

  • మద్యం ఆర్డర్లు ఎలా వచ్చాయ్‌?

  • కమీషన్లు ఎవరెవరికి ఎంత చెల్లించారు?

  • తెలంగాణలో రూ.1000 మద్యం.. ఏపీలో 1600 ఎలా?

  • ‘డిస్టిలరీ’లపై అధికారుల ప్రశ్నల వర్షం

  • ఆ 600 వైసీపీ పెద్దల జేబుల్లోకి..

  • కీలక సమాచారం చెప్పిన యజమానులు

  • వ్యవహారాలన్నీ వాసుదేవ రెడ్డి చూసేవారు

  • తెరపైకి నాటి సకల శాఖా మంత్రి పేరు

  • త్వరలో వేలకోట్ల కుంభకోణం వెలుగులోకి

జగన్‌ సర్కారులో అదో అంతులేని ముడుపుల ‘కిక్కు’! డిస్టలరీలను ఆక్రమించారు. సొంత బ్రాండ్లను ప్రవేశపెట్టారు. ఆ మద్యాన్నే విక్రయించారు. అంటే... మందూ వాళ్లదే... అమ్మేదీ వాళ్లే! ఇతర బ్రాండ్లు విక్రయించాలంటే కమీషన్‌ కొట్టాల్సిందే! ఈ తతంగం సాగిన తీరుపై సీఐడీ దృష్టి సారించింది. నేరుగా డిస్టలరీల యజమానులనే పిలిచి ప్రశ్నిస్తోంది. బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి లీలలను పక్కాగా తెలుసుకుంటోంది.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మద్యం కేసులో సీఐడీ అధికారులు ఉచ్చు బిగిస్తున్నారు. ఊహకు అందని విధంగా జగన్‌ సర్కారు చేసిన దోపిడీపై కూపీ లాగుతున్నారు. సీఐడీ అధికారులు తాజాగా మద్యం డిస్టిలరీస్‌ యజమానుల్ని పిలిచి అత్యంత విలువైన సమాచారం సేకరించారు. మద్యం విక్రయాలకు సంబంధించిన ఆర్డర్లు ఎలా వచ్చాయి? కమీషన్లు ఏ రూపంలో ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారు? వంటి విషయాలు సేకరించారు.

ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించిన దాని ప్రకారం తాడేపల్లి ప్యాలె్‌సకు 3113 కోట్ల అక్రమ సొమ్ము చేరింది. ఈ మొత్తం చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని సీఐడీ అధికారులు రహస్య ప్రాంతంలో పలుమార్లు ప్రశ్నించారు.


ఆయన్నుంచి సేకరించిన కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటున్నారు. కేసు బలపడేందుకు ఉచ్చు బిగిస్తున్నారు. అందులో భాగంగానే కీలక టీమ్‌ మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయానికి మద్యం డిస్టిలరీస్‌ యజమానులను పిలిపించింది. రాష్ట్రంలో 2019 వరకూ అందుబాటులో ఉన్న మద్యం బ్రాండ్లను కాదని మీకు ఆర్డర్లు ఎలా వచ్చాయని ప్రశ్నించింది. ఆర్డర్లు రావడం వెనకున్న అసలు గుట్టు తమ దగ్గర ఉందని, వివరంగా చెబితే బాగుంటుందని సీఐడీ అధికారులు గట్టిగా అడిగారు.

నోరు విప్పిన మద్యం డిస్టిల్లరీస్‌ యాజమానులు వైసీపీ ప్రభుత్వ పెద్దలు పిలిచి లిక్కర్‌ కేసుకు 200, బీరు అయితే 50 రూపాయలు కమీషన్‌ డిమాండ్‌ చేసినట్లు వెల్లడించారు. ఆ తర్వాత ధరలు భారీగా పెంచి ఆ మొత్తాన్ని నగదు రూపంలో తీసుకున్నట్లు గుట్టు విప్పారు.


తాము ప్రత్యేకంగా కమీషన్‌ ఇవ్వలేదని, కాకపోతే అదనపు సొమ్ము ఆదాయంగా చూపించాల్సి రావడంతో ఆ పన్నులు భరించాల్సి వచ్చిందని వివరించారు. ఎక్కువగా వాసుదేవ రెడ్డి వ్యవహారాలన్నీ చూసేవారని, ఎవరు ఎక్కువ కమీషన్‌ ఇస్తే వారికి సంబంధించి మద్యం ఆర్డర్లు ఇచ్చేవారని యజమానులు చెప్పినట్టు సమాచారం.

అందుకే మద్యం షాపుల్లో రోజుకొక బ్రాండు అందుబాటులో ఉండేదని, షాపులో సెల్లర్‌ ఇచ్చిందే మద్యంబాబులు తీసుకోవాల్సి వచ్చేదని చెప్పినట్లు తెలిసింది. తెలంగాణలో వెయ్యి రూపాయల విలువైన మద్యానికి ఏపీలో రూ.1600 బిల్లు వేస్తే ఎప్పటికైనా బయటికి వస్తుందన్న భయం మీకు కలగలేదా?

అని సీఐడీ అధికారులు ప్రశ్నించారు. అందుకు డిస్టిల్లరీల యజమానులు కాసేపు మౌనం వహించారు. తర్వాత నోరు విప్పి అప్పట్లో తాము ఏది చెప్పినా వినేవారు అరుదని చెప్పారు. ఆ రూ.600 నగదు రూపంలో వైసీపీ పెద్దలకు ఇచ్చామని, దానిపై పన్ను తాము భరించామని తెలిపారు.


‘మేం ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తున్నప్పుడు ఆ సొమ్ము ఇచ్చేందుకు మీకేంటి ఇబ్బంది’ అనే ప్రశ్నలు వైసీపీ పెద్దల నుంచి వచ్చేవని, ఈ సందర్భంగా గతంలో సకల శాఖల మంత్రిగా పేరున్న ప్రముఖ వ్యక్తి పేరు చెప్పినట్లు తెలిసింది. మరింత సమాచారం కోసం త్వరలో మళ్లీ పిలుస్తామని సీఐడీ అధికారులు చెప్పడంతో వారు వెనుదిరిగారు.

సంపూర్ణ మద్య నిషేధమంటూ ఎన్నికల ముందు ప్రజల్ని మభ్య పెట్టి... జగన్‌ అధికారంలోకి వచ్చాక నాసిరకం మద్యంతో పేదల రక్తాన్ని జలగలా పీల్చేశారు. దేశంలో ఎక్కడా లేని ధరలతో మందుబాబుల్ని లూటీ చేశారు. వేల కోట్లు అక్రమంగా వసూలు చేసిన తాడేపల్లి పాలకుడి పాపాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.


నేడు సీఎం దృష్టికి..

జగన్‌ పాలనలో మద్యం దోపిడీ ఎలా జరిగిందో ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఐడీ అధికారులు వివరించబోతున్నారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం శాంతిభద్రతలపై సమీక్షించనున్న సీఎంకు మద్యం కుంభకోణం కేసులో పురోగతిని తెలియజేయనున్నారు.

ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి ఇచ్చిన సమాచారం, డిస్టిల్లరీస్‌ యాజమానులు వెల్లడించిన కమీషన్ల వ్యవహారంతో పాటు వైసీపీ పెద్దల్లో ఎవరెవరి పాత్ర ఎంత ఉంది? మొత్తం కుంభకోణం విలువ ఎన్ని వేల కోట్లు ఉండొచ్చు? పక్కాగా సేకరించిన ఆధారాలు ఏమిటి?

ఇంకా ఎవరెవరిని ప్రశ్నించాల్సి ఉంది? న్యాయపరమైన చిక్కుల్లేకుండా తీసుకోబోతున్న జాగ్రత్తలు తదితర అంశాలపై డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ ఏడీసీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ చర్చించే అవకాశం ఉంది. మంగళవారం సచివాలయానికి వచ్చిన ఈ ఇద్దరు ఉన్నతాధికారులు సీఎంవోలోని కీలక అధికారితో ఈ విషయంపై చూచాయగా చర్చించినట్లు తెలిసింది.

Updated Date - Aug 21 , 2024 | 06:45 AM