Share News

CM Chandrababu Naidu: తీరు బాలేదు తమ్ముళ్లూ!

ABN , Publish Date - Oct 16 , 2024 | 11:27 AM

గత ఐదేళ్ళూ ఉమ్మడి చిత్తూరు జిల్లావ్యాప్తంగా వైసీపీ నేతలను మొక్కవోని స్థైర్యంతో ఎదుర్కొన్న టీడీపీ(TDP) శ్రేణులు ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి రావడంతో పెద్ద ఎత్తున సంబరపడ్డాయి. అయితే వంద రోజులు కూడా గడవక మునుపే శ్రేణులు నిరుత్సాహానికి లోనయ్యాయి.

CM Chandrababu Naidu: తీరు బాలేదు తమ్ముళ్లూ!

- ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పార్టీ పరిస్థితిపై చంద్రబాబు అసంతృప్తి

- చక్కదిద్దే పనిలో అధినేత

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి పట్ల చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, ఇతర నాయకుల తీరుపై సమాచారం తెప్పించుకుంటున్న ఆయన జిల్లాలో పార్టీ వ్యవహారాలను చక్కదిద్దడం మీద దృష్టి పెట్టినట్టు చెబుతున్నారు.

(తిరుపతి, ఆంధ్రజ్యోతి)

గత ఐదేళ్ళూ ఉమ్మడి చిత్తూరు జిల్లావ్యాప్తంగా వైసీపీ నేతలను మొక్కవోని స్థైర్యంతో ఎదుర్కొన్న టీడీపీ(TDP) శ్రేణులు ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి రావడంతో పెద్ద ఎత్తున సంబరపడ్డాయి. అయితే వంద రోజులు కూడా గడవక మునుపే శ్రేణులు నిరుత్సాహానికి లోనయ్యాయి. పలువురు ఎమ్మెల్యేలు ప్రభుత్వం వచ్చీరాగానే సంపాదనపై దృష్టి మళ్ళించారని, పార్టీ పటిష్టతను వదిలేసి దానికే తొలి ప్రాధాన్యత ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. నిఘా వర్గాలతో పాటు పార్టీ పరంగానూ వేర్వేరు మార్గాల్లో అందిన సమాచారం ఆధారంగా జిల్లాలో ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు, ఇంఛార్జుల పనితీరును, వారి వ్యవహార శైలిని అధినేత చంద్రబాబు బేరీజు వేస్తున్నట్టు సమాచారం.

ఈ వార్తను కూడా చదవండి: బరితెగింపు వద్దు బ్రదర్‌!


ఎక్కువమంది ఎమ్మెల్యేలు పార్టీకోసం కష్టపడిన నాయకులను పట్టించుకోకుండా, తమకు అనుకూలురైన ఒకరిద్దరికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని, వారు చెప్పినట్టే వినాలని మండల స్థాయిలో అధికారులకు ఆదేశాలిస్తున్నారని అధినేతకు ఫిర్యాదులు అందాయి. ఇక శాసనసభలో ప్రమాణస్వీకారం చేసిన వెంటనే కొందరు ఎమ్మెల్యేలు ఇసుక మీద పడ్డారు. ప్రభుత్వ ఇసుక విధానం ఖరారు కాకముందే డంపుల్లో నిల్వవున్న ఇసుకను దౌర్జన్యంగా తెగనమ్మేసుకున్నారని అంటున్నారు. రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు. వైసీపీ నేతలు చేసిన భూ కబ్జా వ్యవహారాల్లో తలదూర్చి ఫిఫ్టీ:ఫిఫ్టీ పద్ధతిలో సర్దుడు బేరాలు మొదలు పెట్టేశారనే ఆరోపణలు ఉన్నాయి.


nani3.jpg

తనకందుతున్న ఫీడ్‌బ్యాక్‌ను పరిగణనలోకి తీసుకుంటున్న అధినేత ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు, ఇంఛార్జుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. శ్రేణులను విస్మరించడాన్ని ఆయన తీవ్రంగా పరిగణిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలు లేని మూడు నియోజకవర్గాలకు గానూ రెండు చోట్ల ఇంఛార్జుల పనితీరుపై కూడా అధినేత అసహనంగా వున్నట్టు ఆ వర్గాలు చెబుతున్నాయి. ఓ నియోజకవర్గంలో ఇంఛార్జి పార్టీని గాలికొదిలేసినట్టు వ్యవహరిస్తుండడం, మరో చోట క్యాడర్‌ వాహనాల్లో అమరావతికి తరలివెళ్ళి ఇంఛార్జిపై ఫిర్యాదులు చేస్తుండడం పట్ల చంద్రబాబు సీరియస్‏గా వున్నట్టు సమాచారం.


సమన్వయపరిచే నాయకత్వంపై దృష్టి

ఉమ్మడి జిల్లాకు సంబంధించి పార్టీ పార్లమెంటు కమిటీల పేరిట మూడు ముక్కలైన సంగతి తెలిసిందే. అందులో రెండు కమిటీలకు సంబంధించి సమర్థ నాయకత్వం లేదని అధినేత భావిస్తున్నట్టు పార్టీ వర్గాల కథనం. కనీసం జిల్లాస్థాయిలో అభివృద్ధి ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేందుకు, నిధుల కోసం ప్రయత్నించేందుకు కూడా తగిన నాయకత్వం లేకపోవడాన్ని అధినేత గ్రహించినట్టు చెబుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచీ ఎవరికీ మంత్రి పదవి కేటాయించకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణం అంటున్నారు.


ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పార్టీ వ్యవహారాలను చక్కదిద్దాల్సిన సీనియర్‌ నేతలు ఎవరి కారణాలతో వారు అసంతృప్తితో మిన్నకుండిపోయినట్టు అధినేత గుర్తించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వారిని చురుగ్గా పనిచేయించే దిశగా అధినేత దృష్టిసారించినట్టు తెలిసింది. అందులో భాగంగా ఇటీవల తిరుమలకు వచ్చిన చంద్రబాబు మాజీ మంత్రి అమరనాధరెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడినట్టు సమాచారం. జిల్లా అభివృద్ధి ప్రతిపాదనలతో పాటు పార్టీ పరంగానూ చర్చించినట్టు తెలిసింది. మరింత లోతుగా చర్చించేందుకు, అవసరమైన నిర్ణయాలు తీసుకునేందుకు గానూ అమరనాధరెడ్డిని విజయవాడ వచ్చి తనను కలవాల్సిందిగా అధినేత సూచించినట్టు సమాచారం.


దీంతో ఆయనకు ఉమ్మడి జిల్లా పార్టీ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తారా లేక ఆయనతో పాటు మరికొందరు సీనియర్‌, ముఖ్యనేతలను కూడా పిలిపించి ఉమ్మడిగా బాద్యతలు అప్పజెబుతారా అన్న ఊహాగానాలు పార్టీ శ్రేణుల్లో వెలువడుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటై మంత్రివర్గంలో చోటు లభించకపోవడంతో పలమనేరు నియోజకవర్గానికే పరిమితమైన అమరనాధరెడ్డి అధినేతను ఇంతవరకూ ఒంటరిగా కలసి మాట్లాడలేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, అమరనాథరెడ్డి మధ్య జరిగిన సంభాషణ రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. మొత్తం మీద అధినేత దృష్టి సారించడంతో ఉమ్మడి జిల్లాలో పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులకు, కార్యకర్తలకు మేలు జరుగుతుందన్న ఆశాభావం మాత్రం ఆ వర్గాల్లో వ్యక్తమవుతోంది.


ఇదికూడా చదవండి: CM Revanth Reddy: సీఎం సంతకం చేసినా బదిలీల్లేవ్‌!

ఇదికూడా చదవండి: KTR: విద్యారంగాన్ని భ్రష్టుపట్టిస్తున్న సర్కార్‌

ఇదికూడా చదవండి: తాళం వేస్తే కేసులు.. ఎవరి మాటల్తోనో కవ్వింపు చర్యలొద్దు

ఇదికూడా చదవండి: Gurukulas: గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందించాలి

Read Latest Telangana News and National News

Updated Date - Oct 16 , 2024 | 11:27 AM