Share News

CM Chandrababu : ఏపీకి ఐదేళ్ల తర్వాత

ABN , Publish Date - Aug 16 , 2024 | 05:49 AM

రాష్ట్రంలో ఐదేళ్ల చీకటి పాలనతో విసిగిపోయిన ప్రజలకు స్వాతంత్య్రం వచ్చిందని, విధ్వంసక పాలన నుంచి విముక్తి కలిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

CM Chandrababu : ఏపీకి ఐదేళ్ల తర్వాత

  • విధ్వంసక పాలన నుంచి విముక్తి: సీఎం

  • ఇక అభివృద్ధితో దూసుకుపోతాం.. అక్టోబరు 2న విజన్‌-2047.. నదుల అనుసంధానం చేసి తీరుతాం

  • కక్ష సాధింపులు ఉండవు.. తప్పుచేసిన వారిని వదలం.. స్వాతంత్య్ర దినోత్సవంలో సీఎం చంద్రబాబు

అమరావతి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఐదేళ్ల చీకటి పాలనతో విసిగిపోయిన ప్రజలకు స్వాతంత్య్రం వచ్చిందని, విధ్వంసక పాలన నుంచి విముక్తి కలిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘రాజధాని కూడా లేని పరిస్థితుల్లో నాడు పాలన ప్రారంభించాం. ఎక్కడ కూర్చుని పనిచేయాలో కూడా తెలియని అనిశ్చితి నుంచి పాలన మొదలుపెట్టి ప్రభుత్వాన్ని పట్టాలెక్కించాం. రాష్ట్రానికి నడిబొడ్డుగా ఉండే అమరావతి ప్రాంతం లో రాజధానికి శంకుస్థాపన చేసుకున్నాం. సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యమిచ్చి ఐదేళ్లలో రూ.68 వేల కోట్లు ఖర్చు చేశాం. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యమిచ్చాం. ఒక యజ్ఞం లా పోలవరాన్ని పరుగులు పెట్టించి 72 శాతం పనులు పూర్తి చేశాం. టీడీపీ ప్రభు త్వం కొనసాగి ఉంటే ఈ పాటికే పోలవరం పూర్తయ్యేది.

ప్రజల ఆశలు నెరవేరుస్తాం

‘120కి పైగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, శాంతిభద్రతలు, అందరికీ ఉపాధి, పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలతో రాష్ట్రం దూసుకుపోతున్న క్రమంలో 2019లో వచ్చిన ఎన్నికల ఫలితాలు రాష్ట్రాన్ని చీకటిమయం చేశాయి. ప్రజావేదిక ధ్వంసంతో ప్రారంభమై నాటి విధ్వంస పాలనతో సంపద సృష్టి, ఉపాధి కల్పనా కేంద్రమైన ప్రజారాజధాని అమరావతిని పురిటిలోనే చంపే ప్రయత్నాలు చేశారు. గత ప్రభుత్వ అసమర్థ విధానాలతో రాష్ట్ర అప్పులు రూ.9.74 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగింది. గత ఐదేళ్ల చీకటి పాలనలో విసిగిపోయిన ప్రజల్లో చైతన్యం వెల్లువెత్తింది. 2024 ఎన్నికల్లో నిశ్శబ్ధ విప్లవంతో అసాధారణ విజయంతో కూటమికి పట్టం కట్టారు. ప్రజలు ఎంతో నమ్మకంతో కూట మి ప్రభుత్వానికి ఏకపక్షంగా పట్టం కట్టారు. కొత్త ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు, ఆకాంక్షలు పెట్టుకున్నారు. వాటిని నెరవేర్చేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది.


హామీల అమలుతో మాట నిలబెట్టుకున్నాం

‘గత ఐదేళ్లలో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్‌ బ్రాండ్‌ను తిరిగి పొందేందుకు విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ఐదు కీలక అంశాలపై సంతకాలు చేసి మాట నిలబెట్టుకున్నాం. బాధ్యతలు స్వీకరించిన రోజునే 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ఫైలుపై సంతకం చేసి చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌తో ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా చేశారు. అందుకే రెండో సంతకంతో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దు చేశాం. పింఛను మొత్తాన్ని పెంచి ఇంటివద్దే పంపిణీ చేస్తున్నాం’ అని చెప్పారు. ‘యువత నైపుణ్యం పెంచేందుకు.. దేశంలోనే తొలిసారి నైపుణ్య గణనకు శ్రీకారం చుట్టి, ఐదో సంతకం దీనిపైనే పెట్టాం. గత ప్రభుత్వ ఇసుక దోపిడీపై సీఐడీ విచారణ జరిపిస్తాం. కూట మి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉచిత ఇసుక విధానంపై నిర్ణయం తీసుకున్నాం. అందరి అభిప్రాయాలు తీసుకుని స్వ ర్ణాంధ్రప్రదేశ్‌-విజన్‌-2047ను అక్టోబరు 2న విడుదల చేస్తాం.


రైతులకు సాయం అందిస్తాం

‘రైతు సబ్సిడీలను త్వరలో పునరుద్ధరిస్తాం. ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం అందిస్తాం. అన్నదాత పథకం కింద ఏడాదికి ప్రతి రైతుకు రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తాం. రానున్న వంద రోజుల్లో కొత్త పారిశ్రామిక విధానాలు తీసుకొస్తాం. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినె్‌సలో రాష్ట్రాన్ని మళ్లీ అగ్రగామిగా చేస్తాం. పారిశ్రామికాభివృద్ధికి భోగాపురం కేంద్రంగా మారనుంది’.

ఇంగ్లీషుకు ప్రోత్సాహం.. మాతృభాషకు ప్రాధాన్యం

‘ఇంగ్లీషు భాషకు ప్రోత్సాహమిస్తూనే ప్రాథమిక స్థాయి ఉంచి మాతృభాష అయిన తెలుగుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. 2014-19 నాటి పాత ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించాం. గిరిజన ప్రాంతాల్లో ఫీడర్‌ అంబులెన్స్‌ల వ్యవస్థలను బలోపేతం చేస్తాం. ఎన్టీఆర్‌ బేబీ కిట్స్‌ను తిరిగి ప్రవేశపెడతాం’ అని చంద్రబాబు చెప్పారు.


రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కండి

ప్రస్తుత సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా దేశంలో జనాభా పెరుగుదలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చం ద్రబాబు చెప్పారు. ‘ఇప్పటివరకు జనాభా నియంత్రణపై దృష్టి పెట్టాం. నేడు జనాభా వృదిఽ్ధపై దృష్టి పెట్టాలి. లేకపోతే రానున్న రోజుల్లో వృద్ధుల సంఖ్య పెరిగి పనిచేసే వాళ్ల సంఖ్య తగ్గుతుంది’ అని తెలిపారు. గతంలో పీ3 విధానంతో సంపద సృష్టించామని, ఇప్పుడు పీ4 పీపుల్‌ పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ విధానంతో జీరో పావర్టీ సాధనకు కృషి చేస్తామని చెప్పారు. రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

Updated Date - Aug 16 , 2024 | 05:50 AM