Tirumala Laddu: క్షమించరాని నేరం చేశారు.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు: సీఎం
ABN , Publish Date - Sep 20 , 2024 | 05:51 PM
CM Chandrababu Naidu: ఏమీ తెలియదని చెబుతున్న జగన్.. రూ. 320కే కిలో నెయ్యి వస్తుందంటే ఆలోచించొద్దా? అంటూ సీఎం చంద్రబాబు తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపించారు.
అమరావతి, సెప్టెంబర్ 20: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్‌గా ఉన్నారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తప్పవంటూ గట్టి వార్నింగ్ ఇస్తున్నారు. తాజాగా మద్దిరాలపాడులో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకాలపై కన్నెర్ర జేశారు. ఎంతటి దారుణాలకు పాల్పడ్డారో ప్రజలకు వివరిస్తూనే.. తప్పు చేసిన వారిని వదిలిపెట్టబోనని స్పష్టం చేశారు.
‘నేను చాలా మంది ముఖ్యమంత్రులను చూశాను. కానీ, జగన్ లాంటి సీఎంను ఎప్పుడూ చూడలేదు. 2019-2024 మధ్య పని చేసిన ముఖ్యమంత్రి లాంటి వ్యక్తిని తాను ఇంతవరకు చూడలేదు.. చూడబోను. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కూడా జగన్ కల్తీ చేశాడు. కల్తీ నెయ్యితో దేవుడికి నైవేథ్యం పెట్టారు. శ్రీవారి ప్రసాదంలో ఇష్టానుసారం పదార్థాలు వాడారు. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో.. తిరుమలలో దర్శనాలు, భోజనాలు సరిగా లేవు. క్షమించరాని నేరం చేశారు. వదిలిపెట్టేది లేదు. తిరుమలలో సంపూర్ణ ప్రక్షాళన మొదలుపెట్టాం.’ అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
పాలన గురించి వారిని అడగాలా..
‘ఏమీ తెలియని A1, A2 నా పాలన గురించి మాట్లాడుతున్నారు. పాలన గురించి వీళ్లని అడిగి నేను తెలుసుకోవాలా? తప్పు చేయలేదు.. టెండర్ పిలిచానని జగన్ చెబుతున్నాడు. రూ.320 కే కిలో నెయ్యి వస్తుందంటే ప్రభుత్వం ఆలోచించవద్దా?’ అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.