Coalition Candidates : పెద్దల సభకు ఆ ముగ్గురే
ABN , Publish Date - Dec 10 , 2024 | 03:17 AM
రాష్ట్రం నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు కూటమి అభ్యర్థులు ఖరారయ్యారు.
రాజ్యసభకు టీడీపీ నుంచి బీదా, సానా
బీజేపీ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్య
పార్టీ సభ్యత్వం.. వెంటనే పెద్దల సభకు
నేడు సభ్యుల నామినేషన్లు.. ఏకగ్రీవమే
అమరావతి, న్యూఢిల్లీ, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు కూటమి అభ్యర్థులు ఖరారయ్యారు. టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీశ్... బీజేపీ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్యను రాజ్యసభకు ఎంపిక చేసినట్లు సీఎం చంద్రబాబు సోమవారం ప్రకటించారు. ముగ్గురు అభ్యర్థులు మంగళవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. వైసీపీకి తగిన సంఖ్యాబలం లేకపోవడంతో పోటీకి దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో కూటమి అభ్యర్థుల ఎంపిక ఏకగ్రీవం కానుంది. కాగా తెలంగాణకు చెందిన బీసీ నాయకుడు ఆర్.కృష్ణయ్య... గతంలో వైసీపీ తరఫున రాజ్యసభలో అడుగుపెట్టారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయనను బీజేపీ తిరిగి రాజ్యసభకు పంపనున్నట్లు ‘ఆంధ్రజ్యోతి’ ముందే చెప్పింది. కృష్ణయ్య సోమవారం ఆన్‌లైన్ ద్వారా బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. అటు రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను, పార్టీ సభ్యత్వాన్ని కృష్ణయ్య ఒకేసారి తీసుకున్నారు.