Share News

AP State Civil Supplies Officials :సంక్రాంతికి రేషన్‌కార్డులు లేనట్టే!

ABN , Publish Date - Dec 06 , 2024 | 06:10 AM

రాష్ట్రంలోని అర్హులైన పేదలకు కొత్త రేషన్‌కార్డుల మంజూరు ప్రక్రియ సంక్రాంతి పండుగకు పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ కొత్త రేషన్‌ కార్డుల మంజూరు ప్రక్రియను నిరంతరాయంగా కొనసాగిస్తామని గొప్పలు చెప్పిన గత వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేయడంతో.....

AP State Civil Supplies Officials :సంక్రాంతికి రేషన్‌కార్డులు లేనట్టే!

  • ఇంతవరకూ ఉత్తర్వులివ్వని సర్కారు

అమరావతి, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అర్హులైన పేదలకు కొత్త రేషన్‌కార్డుల మంజూరు ప్రక్రియ సంక్రాంతి పండుగకు పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ కొత్త రేషన్‌ కార్డుల మంజూరు ప్రక్రియను నిరంతరాయంగా కొనసాగిస్తామని గొప్పలు చెప్పిన గత వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేయడంతో రాష్ట్రంలో కొత్తగా పెళ్లిళ్లు చేసుకుని వేరు కాపురాలు పుట్టుకున్న జంటలు, గత ప్రభుత్వంలో రాజకీయ కారణాలతో రేషన్‌కార్డులు మంజూరు కానివారు వేల సంఖ్యలో కొత్త కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. కొత్త కార్డులు, స్ప్లిట్‌ కార్డులు, ఉన్న కార్డుల్లో సభ్యుల చేర్పులు, తొలగింపులు, చిరునామాల మార్పుల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3.40 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ కొత్త కార్డులు మంజూరు చేస్తామని కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. గత ప్రభుత్వం వైసీపీ రంగులతో ఇచ్చిన పాత కార్డులను తొలగించి, వాటి స్థానంలో కొత్తకార్డులను అందించేందుకు డిజైన్‌పై కసరత్తు కొనసాగుతోందని, త్వరలోనే కొత్తకార్డులను మంజూ రు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ కూడా పలు సందర్భాల్లో చెప్పారు.

అందుకనుగుణంగా సివిల్‌ సప్లయిస్‌ అధికారులు కార్డుల డిజైన్‌పై ఇప్పటికే కసరత్తు పూర్తిచేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. దీపావళి కానుకగా ఉచిత గ్యాస్‌ సిలిండర్లను అందించిన ప్రభుత్వం.. సంక్రాంతి కానుకగా రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్‌ కార్డులకు, ఇతర సర్వీసులకు ఈనెల 2వ తేదీ నుంచే దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుందంటూ వార్తలు వచ్చాయి. దీంతో కొత్త రేషన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారంతా దరఖాస్తులు చేసుకునేందుకు గ్రామ, వార్డు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కానీ దీనికి సంబంధించి ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. దరఖాస్తులు చేసుకోవడానికి ఆప్షన్‌ కూడా ఇవ్వలేదు. కొత్తకార్డుల మంజూరు విషయంలో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని రాష్ట్ర సివిల్‌ సప్లయిస్‌ అధికారులు చెబుతున్నారు.

Updated Date - Dec 06 , 2024 | 06:13 AM