TDP-Janasena: ఎవరు ఎక్కడో.. అభ్యర్థుల ఎంపికల్లో ఎనలేని జాప్యం?
ABN , Publish Date - Feb 23 , 2024 | 01:35 AM
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీచేసే తమ అభ్యర్థులను ప్రకటించడంలో చేస్తున్న జాప్యంతో ఆశావహుల్లో అయోమయ పరిస్థితులు నెలకొంటున్నాయి. రాజకీయ పార్టీలు పొత్తులు, వ్యూహాత్మక ఎత్తు గడల కారణంగా అభ్యర్థుల ప్రకటన విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నాయి..
అభ్యర్థుల ఎంపికల్లో ఎనలేని జాప్యం
ప్రధాన రాజకీయ పార్టీల్లో గందరగోళం
ఉత్కంఠకు గురవుతున్న రాజకీయ పార్టీల కేడర్
టీడీపీ ఒక స్థానంలో అభ్యర్థి ప్రకటన
వైసీపీ రెండు స్థానాల్లో కొత్త ఇన్‌చార్జిలు
మిగిలిన స్థానాల్లో అభ్యర్థులకు రాని గ్రీన్ సిగ్నల్
టెన్షన్‌లో సిటింగ్ ఎమ్మెల్యేలు, ఆశావహులు
(అమలాపురం-ఆంధ్రజ్యోతి)
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీచేసే తమ అభ్యర్థులను ప్రకటించడంలో చేస్తున్న జాప్యంతో ఆశావహుల్లో అయోమయ పరిస్థితులు నెలకొంటున్నాయి. రాజకీయ పార్టీలు పొత్తులు, వ్యూహాత్మక ఎత్తు గడల కారణంగా అభ్యర్థుల ప్రకటన విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నాయి. దీంతో ఆయా పార్టీలకు చెందిన కేడర్‌లో తీవ్రమైన గందరగోళం ఏర్పడింది. పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక చేసినప్పటికీ వారి పేర్లను మాత్రం అధికారింగా వెల్లడించకపోవడంతో జిల్లాలోని లోక్‌సభ, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజల్లోకి పార్టీ అభ్యర్థిగా వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో పరోక్షంగా ఆ పార్టీలు చేపట్టే కార్యక్రమాల పేరుతో కొందరు ముందుకువెళ్తూ ఓటర్లను కలుస్తున్నారు. ఏ కారణం చేతైనా సీటు రాకపోతే తమ భవిష్యత్తు ఏమిటనేది జిల్లాలోని వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థుల్లో నెలకొంది. జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలకుగాను టీడీపీ మండపేట నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పోటీ చేస్తారని ఇప్పటికే ప్రకటించింది. అదేవిధంగా జనసేన సిటింగ్ స్థానమైన రాజోలు నుంచి జనసేనే పోటీ చేస్తుందని ఆ పార్టీ ప్రకటించినప్పటికీ అభ్యర్థి ఎంపికలో స్పష్టత లేకపోవడం వల్ల గందరగోళ పరిస్థితి కేడర్‌లో నెలకొంది.
రాజోలు జనసేన సీటు కోసం ఐఏఎస్ అధికారి వరప్రసాద్, డాక్టర్ రాపాక రమేష్‌బాబుతోపాటు ప్రస్తుత నాయకుడైన బొంతు రాజేశ్వరరావు పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ తెర వెనుక మాజీ మంత్రి కుమార్తెను రాజకీయ రంగ ప్రవేశం చేయించి జనసేన అభ్యర్థిత్వం తీసుకోవాలనే యోచనలో కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ విషయానికొస్తే ఇప్పటికే రామచంద్రపురం, పి.గన్నవరం నియోజకవర్గ ఇన్‌చార్జిలుగా పిల్లి సూర్యప్రకాష్, జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్‌ను ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. దాంతో వారిద్దరు నియోజకవర్గంలో ప్రజల్లోకి వెళుతున్నారు. ఇక కొత్తపేట, ముమ్మిడివరం నియోజకవర్గాల నుంచి సిటింగ్ ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, పొన్నాడ సతీష్‌ల పేర్లను వైసీపీ అధిష్ఠానం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అలాగే అమలాపురం స్థానంలో మంత్రి పినిపే విశ్వరూప్ ఖరారు అవుతుందనే ప్రచారం జరుగుతున్నప్పటికీ అధిష్ఠానం ప్రకటించలేదు. అటు మండపేటలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు వైసీపీ సీటు ఖాయమని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు అంశం ప్రతిష్టాత్మకంగా మారింది. జనసేనకు ఏడు స్థానాల్లో మూడు స్థానాలతోపాటు ఎంపీ స్థానం కూడా కావాలని ఆ పార్టీ అధిష్ఠానం కోరుతున్న నేపథ్యంలో జిల్లాలో పూర్తిగా ప్రతిష్ఠంభన నెలకొంది. రాజోలు జనసేన ప్రకటించినందున పి.గన్నవరం లేదా అమలాపురం స్థానాల్లో ఒకటి, రామచంద్రపురం స్థానాన్ని కూడా జనసేనకు కేటాయించాలని ఆ పార్టీ కోరుతున్నట్టు చెబుతున్నారు.
అయితే పొత్తుల్లో భాగంగా బీజేపీకి కూడా సీట్లు కేటాయించాల్సి వస్తే ఏ స్థానాన్ని ఇరుపార్టీలు కలిసి బీజేపీకి కేటాయిస్తానేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీసీ సామాజికవర్గానికి చెందిన టీడీపీ నేతలు రామచంద్రపురం నియోజకవర్గంపై దృష్టి సారించి ఎవరి లాబీయింగ్‌లు వారు చేస్తున్నారు. కొత్తపేట నుంచి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి దాట్ల బుచ్చిరాజుల పేర్లు దాదాపు ఖరారు అయినట్టు ప్రచారంలో ఉన్నప్పటికీ వారి పేర్లను టీడీపీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించకపోవడంతో ఆ నియోజకవర్గాల్లో టీడీపీ కేడర్‌లో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రెండు స్థానాల్లోను జనసేన అభ్యర్థులు కూడా తమకే అవకాశం లభిస్తుందంటూ ప్రచారాస్ర్తాలు సంధిస్తున్నారు. అయితే సీట్ల ఎంపిక విషయంలో అధిష్ఠానం సర్వేలకు ప్రాధాన్యం ఇస్తుండడంతో ఏ సర్వేలో ఎవరికి మొగ్గు ఉందో తెలియక అయోమయానికి గురవుతున్నారు. కొందరు ఆశావహులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలైతే ఒక అడుగు ముందుకువేసి పార్టీ ఆఫీసులో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరోక్షంగా సర్వేలను సైతం ప్రభావితం చేసే వ్యూహాలను అమలుచేస్తున్నారంటూ జిల్లాలో మరోసారి ప్రచారం జరుగుతోంది.