Share News

Education Department : 15 వేల మంది టీచర్ల సర్దుబాటు!

ABN , Publish Date - Aug 19 , 2024 | 05:01 AM

ఉపాధ్యాయుల పని సర్దుబాటు అంశం కొలిక్కి వచ్చింది. సుమారు 15వేల మంది టీచర్లను సర్దుబాటు విధానంలో ఇతర పాఠశాలలకు పంపనున్నారు.

Education Department : 15 వేల మంది టీచర్ల సర్దుబాటు!

  • అంచనా వేసిన పాఠశాల విద్యాశాఖ

  • ఎస్జీటీలు 4,922 మంది అవసరం

  • స్కూల్‌ అసిస్టెంట్లు 2,299 మంది కొరత

  • అవసరం లేని టీచర్లు ప్రస్తుత బడుల్లోనే

అమరావతి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల పని సర్దుబాటు అంశం కొలిక్కి వచ్చింది. సుమారు 15వేల మంది టీచర్లను సర్దుబాటు విధానంలో ఇతర పాఠశాలలకు పంపనున్నారు.

ఈ మేరకు ఈ నెల 16 నాటికి బడుల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాల విద్యాశాఖ టీచర్ల అవసరాన్ని అంచనా వేసింది. ప్రాథమిక పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు భారీగా మిగిలిపోతుంటే, ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో స్కూల్‌ అసిస్టెంట్ల (సబ్జెక్టు టీచర్లు) కొరత కనిపిస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలల్లో ప్రస్తుతం పనిచేస్తున్న స్థానాల్లో 10,435 మంది టీచర్లు మిగులుగా ఉన్నారు. ఇతర పాఠశాలల్లో 4,922 మంది అవసరముంది. దీంతో ఇంకా 5,513 మంది టీచర్లు మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది.


అవసరమైన మేరకే టీచర్ల సర్దుబాటు చేస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించినందున సర్దుబాటు అవసరం రాని టీచర్లు ప్రస్తుత స్థానాల్లోనే కొనసాగుతారు. ఇక ప్రాథమికోన్నత పాఠశాలల్లో 3824 మంది మిగులు ఉంటే, 4,527 మంది అవసరమయ్యారు. అంటే ఇంకా 703 మంది టీచర్లు అవసరం.

అయితే వారిలో 164 మంది ఎస్జీటీల అవసరముంది. ఇక ఉన్నత పాఠశాలల్లో 5,447 మంది టీచర్లు మిగులుగా ఉంటే, 7,207 మంది అవసరమవుతున్నారు. అంటే ఇంకా 1,760 మంది స్కూల్‌ అసిస్టెంట్ల అవసరముంది. మొత్తంగా ఎస్జీటీలుగా భారీగా మిగిలిపోతుంటే, స్కూల్‌ అసిస్టెంట్ల కొరత కొంతమేర కనిపిస్తోంది. సర్దుబాటుపై పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే మార్గదర్శకాలు జారీచేసింది. బడిలో అత్యంత జూనియర్‌ను మొదటి మిగులు టీచర్‌గా చూపిస్తారు.

దీంతో జూనియర్‌ టీచర్లే ఇప్పుడు సర్దుబాటులో ఇతర బడులకు మారాలి. ఒకవేళ సీనియర్‌ టీచర్లు స్వచ్ఛందంగా సర్దుబాటులో వెళ్తాం అంటే వారికి అవకాశం కల్పిస్తారు. అలాగే మొదట మేనేజ్‌మెంట్‌ వారీగా సర్దుబాటు చేస్తారు. అప్పటికీ టీచర్ల అవసరం ఉంటే మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌ మేనేజ్‌మెంట్లలో కలిపి సర్దుబాటు చేస్తారు. అలాగే మండలం, డివిజన్‌ స్థాయిలో తొలుత సర్దుబాటు చేసి, ఆ తర్వాత జిల్లా స్థాయిలో చేస్తారు.

Updated Date - Aug 19 , 2024 | 05:01 AM