AP High Court : ‘బ్యాలెట్’ ఉత్తర్వులు సరైనవే
ABN , Publish Date - Jun 01 , 2024 | 05:13 AM
రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైసీపీ దాఖలు చేసిన వ్యాజ్యాలపై శుక్రవారం హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇ
ఫెసిలిటేషన్ కేంద్రంలో ఓటేసిన
ఉద్యోగులకు వర్తిస్తాయి
కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టీకరణ
ఈ ఉత్తర్వులకు కారణాలు చెప్పలేదు
కౌంటింగ్‌కు 4 రోజుల ముందు ఇచ్చారు
దీనిపై అనేక అనుమానాలు ఉన్నాయి
వైసీపీ తరఫు న్యాయవాదుల వాదనలు
నేడు తీర్పు వెలువరించనున్న హైకోర్టు
అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైసీపీ దాఖలు చేసిన వ్యాజ్యాలపై శుక్రవారం హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇరువైపుల వాదనలు ముగియడంతో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ న్యాపతి విజయ్‌తో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
శనివారం నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్‌కు సంబంధించి ఫాం -13(ఏ)పై అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి, ఆయనకు సంబంధించిన హోదా, వివరాలు పేర్కొననప్పటికీ.. ఆ పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే.. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైసీపీ కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఇదే పిటిషన్‌లో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను హైకోర్టు శుక్రవారం హౌజ్‌మోషన్లుగా విచారణకు స్వీకరించింది.
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రంలో దాదాపు 5.5 లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయని, అభ్యర్థుల గెలుపు ఓటముల నిర్ణయంలో ఇవి కీలకమని తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్ట నిబంధనలకు లోబడి ఈ ఓట్ల చెల్లుబాటును నిర్ణయించాలని కోరా రు. ఫాం-13(ఏ)పై అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి, ఆయనకు సంబంధించిన హోదా, వివరాలు తెలుపకపోయినా ఆ పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందని ఎన్నికల సంఘం మే 30న ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఇవి చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు.
పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు నిబంధనలు మార్చడం ఎన్నికల ప్రక్రియను బలహీనపర్చడమేనని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపునకు నాలుగు రోజులు ముందు ఈసీ ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఎన్నికల స్వచ్ఛతను కాపాడేందుకు కోర్టులు జోక్యం చేసుకోవచ్చునని తెలిపారు.
ఈసీ ఆకస్మిక నిర్ణయం
పిటిషనర్ తరఫున మరో సీనియర్ న్యాయవాది పి. వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఏపీ సీఈవో ఇచ్చిన సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ కోర్టులో విచారణలో ఉందని తెలిపారు. అయితే, ఆకస్మికంగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. రాష్ట్రం లో మాత్రమే ఈ ఉత్తర్వులు అమలు చేస్తున్నారని వివరించారు. ఈ ఉత్తర్వుల జారీకి కారణాలు పేర్కొనలేదని తెలిపారు. ఈసీ సైతం చట్ట నిబంధనలకు లోబడి వ్యవహరించాల్సిందేనని పేర్కొన్నారు. ఈసీ రాసిన లేఖపై ఎన్నికల పిటిషన్ దాఖలు చేయడం వీలుపడదని తెలిపారు. ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద జరిగిన తప్పులను సరిచేసేందుకు ఎన్నికల సంఘం ఈ చర్యకు దిగినట్టు కనబడుతోందన్నారు. ఫాం-13 (ఏ) నిబంధన సవరించకుండా రూల్ 18(ఏ) చెల్లుబాటు కాదన్నారు. ఈ నేపథ్యంలో పిటిషన్‌కు విచారణార్హత ఉందన్నారు.
సంతకం ఉంటే చాలు: ఈసీ
కేంద్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపించారు. ఎన్నికల విధుల్లో ఉండి ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న ఉద్యోగులకు తాజా ఉత్తర్వులు వర్తిస్తాయని తెలిపారు. ఫెసిలిటేషన్ సెంటర్‌లోని అటెస్టింగ్ ఆఫీసర్‌ను రిటర్నింగ్ అధికారే నియమించారన్నారు. ఈ నేపథ్యంలో ఫాం-13 (ఏ)పై అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని పేర్కొన్నారు. ఆ అధికారి పేరు, సీలు అవసరం లేదన్నారు. ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ మొత్తం వీడియో రికార్డింగ్ చేశారని వివరించారు. ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకొనే ఉద్యోగుల కోసం గత ఏడాది ఆగస్టులో ప్రత్యేకంగా 18(ఏ) నిబంధన తీసుకొచ్చారని తెలిపారు. ఇతర ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ పత్రాలపై గ్రూప్-ఏ, గ్రూప్ -బీ అధికారులు అటెస్ట్ చేస్తారన్నారు. చట్ట నిబంధనలు ఉల్లంఘించి ఎన్నికల సంఘం ఏదైనా నిర్ణయం తీసుకొంటే ఎన్నికల పిటిషన్ ద్వారా మాత్రమే సవాల్ చేయగలరని తెలిపారు. రాజ్యాంగంలోని అధికరణ 329 (బీ) ప్రకారం ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్నారు. ఈ వ్యాజ్యంలో అనుబంధ పిటిషన్ వేసిన వెలగపూడి రామకృష్ణబాబు తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వ ర్లు, న్యాయవాది పదిరి రవితేజ వాదనలు వినిపించారు. చట్ట నిబంధనలను కోర్టు ముందుంచారు.