Share News

AP Election Results: ఏపీలో ఎవరికి ఎన్నిసీట్లు? జోరుగా బెట్టింగులు..

ABN , Publish Date - May 17 , 2024 | 04:05 AM

ష్ట్రంలో ఎన్నికల ఫలితాలు రావడానికి రెండు వారాలకు పైగానే సమయం ఉండడంతో బెట్టింగ్‌ బంగార్రాజులు బరిలోకి దిగిపోయారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీగా పందేలు కడుతుండగా, రాయల

AP Election Results: ఏపీలో ఎవరికి ఎన్నిసీట్లు? జోరుగా బెట్టింగులు..
Andhra Pradesh

  • రాష్ట్రంలో బెట్టింగ్‌ బంగార్రాజులు

  • కూటమా? వైసీపీనా? ఎన్ని సీట్లు?..

  • పిఠాపురంలో పవన్‌ మెజారిటీ ఎంత?

  • పులివెందుల, కుప్పంపైనా పందేలు

  • లోకేశ్‌, షర్మిల, అవినాశ్‌పైౖ బెట్టింగ్స్‌

  • బెజవాడలో కేశినేని బ్రదర్స్‌పై కూడా

  • రూ.లక్షకు 5 లక్షల నుంచి ‘లక్షకు లక్ష’

  • బెట్టింగులు కడుతున్న పందెంరాయుళ్లు

  • తెలంగాణలోనూ కాక రేపుతున్న వైనం

‘‘బెట్‌ ఎంత కట్టావ్‌? కూటమి గెలుస్తుందనా? వైసీపీ తరఫున కట్టావా? ఎన్ని సీట్లు వస్తాయ్‌! పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ మెజారిటీ ఎంతంటున్నారు? కుప్పం, పులివెందులలో మెజారిటీ తగ్గుతుందా? నాదొక లక్ష ఉంది.. తీసుకుంటావా?’’ ఇదీ.. రాష్ట్రంలో పోలింగ్‌ ముగిసిన మరుసటి రోజు నుంచి జరుగుతున్న పందేల తీరు. పోలింగ్‌ శాతం భారీగా పెరగడం, యువత, ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా ఓటర్లు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడంతో పందెం రాయుళ్లకు పండుగ వాతావరణం వచ్చినట్లయింది.

(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు రావడానికి రెండు వారాలకు పైగానే సమయం ఉండడంతో బెట్టింగ్‌ బంగార్రాజులు బరిలోకి దిగిపోయారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీగా పందేలు కడుతుండగా, రాయల సీమలోనూ ఇదే తరహా బెట్టింగులు తెరమీదికి వస్తున్నాయి. ప్రధానంగా ఎన్డీయే కూటమి, వైసీపీల మధ్య బెట్టింగులు కట్టేవారు పోటీ పడుతున్నారు. అత్యధికంగా పిఠాపురంలో పవన్‌ గెలుపు సహా మెజారిటీపైనే పందేలు కడుతుండడం గమనార్హం. కోస్తా ప్రాంతంలో కనీసం రూ.5 లక్షల నుంచి రూ.కోటి వరకు పందేలు కట్టినట్టు సమాచారం. ఈ క్రమంలో కనీసం రూ.500 కోట్లకు తగ్గకుండా పంటర్లు, ప్రైవేటు వ్యక్తులు, స్నేహితులు ఇలా అన్ని వర్గాలు పందేలు కట్టారని పోలీసులే చెబుతున్నారు. పవన్‌ గెలుపుపై కంటే ఆయన మెజారిటీపైనే భారీగా పందేలు నడుస్తున్నట్టు సమాచారం. కనీసం 30 వేల నుంచి 50 వేల మధ్యలో మెజారిటీ వస్తుందన్న దిశగా ఈ బెట్టింగులు ఉన్నట్టు తెలిసింది. భీమవరం ప్రాంతంలో రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు పందేలు కట్టారని, అతి తక్కువగా సామాన్యులు సైతం రూ.50 వేలకు తగ్గకుండా పందేలు కట్టినట్లు సమాచారం. పవన్‌ కల్యాణ్‌ గత ఎన్నికల్లో పోటీ చేసిన భీమవరంలో ఇప్పుడు కూటమి అభ్యర్థి బరిలో ఉన్నారు. ఈయన మెజారిటీ పైనా పందేలు కట్టారు. అదేవిధంగా ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు గెలుపుపైనా జోరుగా బెట్టింగులు కట్టినట్టు తెలిసింది.


ఉత్తరాంధ్రలోనూ..

ఉత్తరాంధ్ర జిల్లాలోనూ బెట్టింగుల పర్వం కనిపిస్తోంది. ఇక్కడ కీలకమైన చీపురుపల్లి నియోజకవర్గంలో మంత్రి బొత్స సత్యనారాయణ, అనకాపల్లిలో కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ గెలుపుపైనా పంటర్లు ఎక్కువగా ఫోన్లు చేసి బెట్టింగ్‌లోకి పలువురిని దింపినట్టు తెలిసింది. ఏలూరు ఎంపీ, దెందులూరు ఎమ్మెల్యే కూటమి అభ్యర్థులపైనా ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. విజయవాడ పార్లమెంటు అభ్యర్థులైన కేశినేని సోదరులపై బెట్టింగ్‌ జరుగుతుండగా చిన్ని మెజారిటీపై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. విజయవాడ తూర్పు వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాశ్‌, విజయవాడ పశ్చిమ కూటమి బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గెలుపుపైనా బెట్టింగ్‌ రాయుళ్లు ఆసక్తి చూపుతున్నారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా మంగళగిరి స్థానంపైనే బెట్టింగ్‌ రాయుళ్లు మక్కువగా ఉన్నట్టు తెలిసింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఇక్కడ నుంచి వరుసగా రెండోసారి పోటీలో ఉన్న విషయం తెలిసిందే. ఈయన గెలుపుపై ఎక్కువ మంది ధీమా వ్యక్తం చేస్తుండటంతో మెజారిటీపై రూ.కోట్లలో పందేలు కడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పోలీసులు తెలిపారు. నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్‌ యాదవ్‌(వైసీపీ), నెల్లూరు ఎంపీ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నెల్లూరు రూరల్‌ కూటమి అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపైనా ఓ మోస్తరు పందేలు కట్టినట్టు తెలిసింది.


కుప్పం, పులివెందుల హాట్‌ హాట్‌..

రాయలసీమలో సీఎం జగన్‌ పోటీలో ఉన్న పులివెందుల, టీడీపీ అధినేత చంద్రబాబు బరిలో ఉన్న కుప్పంలోనూ పందేలు కట్టినట్టు తెలిసింది. వీరి గెలుపు ఖాయం కావడంతో మెజారిటీపైనే ఎక్కువగా పంటర్లు దృష్టి పెట్టారు. గత ఎన్నికల్లో వచ్చినంత మెజారిటీ ఈ ఎన్నికల్లో జగన్‌కు రాదని ఎక్కువ మంది పందెం కట్టినట్టు తెలిసింది. ఇక, చంద్రబాబు మెజారిటీ విషయంలోనూ ఇదే తరహా పందేలు కట్టినట్టు సమాచారం. అదేవిధంగా కడప పార్లమెంటు స్థానం నుంచి బరిలో ఉన్న కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ షర్మిలకు లక్షపైనే ఓట్లు వస్తాయని ఎక్కువ మంది పందేలు వేస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని రూ.లక్ష బెట్టింగ్‌కు ఎవరైనా ముందుకొస్తే పోలింగ్‌ ముందు రోజు వరకూ వైసీపీ అభిమానులు రూ.ఐదు లక్షల వరకు సిద్ధమయ్యారు. అయితే, పోలింగ్‌ మరుసటి రోజు నుంచి రూ.లక్షకు రూ.లక్ష మాత్రమేనని ఇప్పుడు అంటున్నారు. దీంతో ఎన్డీయే విజయం ఖాయమైందనే ధీమా ఎక్కువ మందిలో కనిపిస్తోంది. అటు వైపు నుంచి పందేలు కాసేవారు భారీగా ఉంటే వైసీపీ తరపున తగ్గిపోవడం గమనార్హం. ఇక, ఏపీ ఎన్నికలపై ఇక్కడే కాకుండా తెలంగాణలోనూ పందేలు కడుతున్నట్టు తెలిసింది. ఏపీ ఎన్నికల వ్యవహారం ఆ రాష్ట్రంలోనూ కాక రేపుతుండడం విశేషం.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 17 , 2024 | 09:12 AM