Share News

AP Elections: జగన్‌ బేల మాటలు!

ABN , Publish Date - May 07 , 2024 | 04:33 AM

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మాటల్లో బేలతనం కనిపించింది. ‘వీరభక్త ఐపీఎ్‌స’ల సహాయంతో ఎలాగైనా ఎన్నికల్లో గెలుద్దామనుకున్న తన వ్యూహాలు బెడిసికొడుతుండటంతో ఏకంగా ఎన్నికల కమిషన్‌పైనే ఆయన ఆక్రోశం వ్యక్తంచేశారు..

AP Elections: జగన్‌ బేల మాటలు!

  • ఈసీ చర్యలపై ఆక్రోశం

  • ఎన్నికలు సక్రమంగా జరుగుతాయనే నమ్మకం సన్నగిల్లుతోంది

  • ఇష్టానుసారం అధికారులను మార్చేస్తున్నారు

  • ఆన్‌గోయింగ్‌ స్కీమ్‌లనూ ఆపేయిస్తున్నారు

  • జగన్‌ను లేకుండా చేయాలని కుట్రలు

  • రేపల్లె, మాచర్ల, బందరులో వైసీపీ అధినేత

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి (YS Jagan Mohan Reddy) మాటల్లో బేలతనం కనిపించింది. ‘వీరభక్త ఐపీఎస్‌’ల సహాయంతో ఎలాగైనా ఎన్నికల్లో గెలుద్దామనుకున్న తన వ్యూహాలు బెడిసికొడుతుండటంతో ఏకంగా ఎన్నికల కమిషన్‌పైనే ఆయన ఆక్రోశం వ్యక్తంచేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఉమ్మడి గుంటూరు జిల్లాలో రేపల్లె, మాచర్ల, కృష్ణా జిల్లా బందరులో జరిగిన సభల్లో జగన్‌ పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు సక్రమంగా జరుగుతాయనే నమ్మకం రోజురోజుకీ సన్నగిల్లుతోందని, ఇస్టానుసారంగా అధికారులను మార్చి వేస్తున్నారని ఆయన వాపోయారు. పేదలకు మంచి జరగకుండా టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డుపడుతున్నారని, ఈసీపై ఒత్తిడి తెచ్చి ఆన్‌గోయింగ్‌ పథకాలను కూడా ఆపివేయిస్తున్నారని అక్కసు వెళ్లగక్కారు. పేదలకు మంచి చేస్తున్న జగన్‌ ఉండకూడదని కుట్రలు చేస్తున్నారంటూ తన బేలతనం బయటపెట్టుకున్నారు. ఎన్నికల కోడ్‌ రాకముందు ఎప్పుడో కొన్ని పథకాలకు బటన్‌ నొక్కిన డబ్బులు... అప్పుడు లబ్ధిదారుల ఖాతాల్లో వేయలేదు. సరిగ్గా పోలింగ్‌కు ముందు వాటిని జమ చేస్తామని ప్రభుత్వం అనడంతో, ఈసీ అంగీకరించలేదు. ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత విడుదల చేయవచ్చునని సూచించింది. వాస్తవం ఇది కాగా, ‘ఆన్‌ గోయింగ్‌ పథకాలను’ చంద్రబాబు ఆపి వేయిస్తున్నారంటూ జగన్‌ అక్కసు వెళ్లగక్కడం గమనార్హం.

YS-Jagan-Machilipatnam.jpg

రాష్ట్రం పొలమట.. జగన్‌ సాగుదారట!

అసలే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై రైతులు బెంబేలెత్తుతుండగా.. ‘మొత్తం రాష్ట్రం నా పొలమే’ అన్నట్లుగా జగన్‌ మాట్లాడేశారు. ‘మన రాష్ట్రం ఓ పంట పొలం అనుకుంటే దానిని సాగుచేసే బాధ్యత జగన్‌కు జనం ఇచ్చా రు. నేను అమలు చేసిన స్కీములు, మార్పులు, సంస్కరణలు, తీసుకొచ్చిన విప్లవాలు వీటినే ఇంటింట విత్తనాలుగా నాటాను. అవి ప్రతి ఇంట్లో ఐదేళ్లుగా పెరుగుతూ వస్తున్నాయి. మరో 15 ఏళ్లలో వృక్షాలవుతాయి..’ అని చెప్పుకొచ్చారు.

YS-Jagan-and-Perni-Kitti.jpg

సభకు వచ్చిన పాపానికి ప్రాణాలపైకి..

రేపల్లె సభలో పోలీసుల ఆంక్షలు సభకు వచ్చిన ప్రజల ప్రాణాల మీదకు తెచ్చాయి. రోడ్డు ఇరుకుగా ఉండడం, తీవ్రమైన ఉక్కపోతతో పలువురు సొమ్మసిల్లి పడిపోయారు. ఓ మహిళా కానిస్టేబుల్‌ ఎండదెబ్బకు స్పృహ తప్పారు. మరో కానిస్టేబుల్‌కు కాలు మడతపడి స్వల్పగాయాలయ్యాయి. ఎండదెబ్బకు సభకు వచ్చిన ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు.

- మచిలీపట్నం/బాపట్ల/మాచర్ల రూరల్‌

Updated Date - May 07 , 2024 | 07:43 AM