Chandrababu: అమ్మకానికి ఏపీపీఎస్సీ ఉద్యోగాలు.. జగన్ సర్కారుపై చంద్రబాబు ఆగ్రహం
ABN , Publish Date - Mar 15 , 2024 | 11:25 AM
ఏపీపీఎస్సీలో అవకతవకలపై సీఎం జగన్ సారధ్యంలోని వైసీపీ ప్రభుత్వాన్ని మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కడిగిపారేశారు.
అమరావతి: ఏపీపీఎస్సీలో అవకతవకలపై సీఎం జగన్ సారధ్యంలోని వైసీపీ ప్రభుత్వాన్ని మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కడిగిపారేశారు. ఏపీపీఎస్సీ ఉద్యోగాలను అమ్మకానికి పెట్టారంటూ జగన్ సర్కారుపై చంద్రబాబు ధ్వజమెత్తారు. రెండో వ్యాల్యుయేషన్ జరగలేదని కోర్టును తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీపీఎస్సీలో అక్రమాలపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గ్రూప్-1 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగం పొందాలని యువత కలలు కంటుంటారని అన్నారు.
నీతినిజాయితీ ఉన్న వ్యక్తిని ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమించాలని చంద్రబాబు అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నీతి నిజాయితీ ఉన్న వ్యక్తి చైర్మన్‌గా ఉన్నారని, కానీ ప్రస్తుతం పరిస్థితి అలా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏపీపీఎస్సీ రాజకీయ పునరావస కేంద్రంగా మారిందని విమర్శలు గుప్పించారు. ఆలిండియా సర్వీసులు ఎంత ముఖ్యమో స్టేట్ సర్వీసులు కూడా అంతే ముఖ్యమని చంద్రబాబు అన్నారు.
‘‘రాష్ట్రంలో అన్ని వర్గాల వారిని దగా చేశారు. ఏపీపీఎస్సీలో ఉద్యోగాలను వైసీపీ నాయకులు అమ్మకానికి పెట్టారు. ఒకప్పుడు నమ్మకంగా ఉన్న ఏపీపీఎస్సీ ఇప్పుడు అమ్మకంగా మారింది. ఉదయ భాస్కర్‌ని మెడ పట్టుకుని బయటకు పంపించారు. రాజకీయ పునరావాస కేంద్రంగా ఏపీపీఎస్సీ మారింది. ఏపీపీఎస్సీలో అనుభవం లేనివారు ఛైర్మన్‌గా, సభ్యులు ఉన్నారు. 2021 డిసెంబర్ నుంచి 2022 ఫిబ్రవరి మధ్య వాల్యూషన్ జరిగినట్టు ఆధారాలు ఉన్నాయి’’ అని చంద్రబాబు అన్నారు.