Share News

ఇదో..‘బొమ్మల’ కథ!

ABN , Publish Date - Apr 02 , 2024 | 04:37 AM

ఇదో.. బొమ్మల కథ! సీఎం జగన్‌ ఫొటోలతో ఏర్చికూర్చిన అందమైన చిత్రాల కథ!! దీనికి స్ర్కీన్‌ప్లే, డైరెక్షన్‌..

ఇదో..‘బొమ్మల’ కథ!

  • స్ర్కీన్‌ప్లే, డైరెక్షన్‌ అధికారులే.. నిర్మాత మాత్రం జనం ఖజానా

  • జూన్‌లో మొదలయ్యే విద్యా సంవత్సరానికి

  • విద్యా కానుకలో జగన్‌ బొమ్మలు, పేర్లు

  • బ్యాగులు, బెల్టులపై ఆ పేరుతోనే లోగోలు

  • నోట్‌ పుస్తకాలపైనా ముఖ్యమంత్రి ఫొటోలు

  • ఎన్నికల వేళా బొమ్మలతోనే కిట్లు తయారీ

  • వీటి కోసం వెయ్యి కోట్ల ప్రజాధనం ఖర్చు

  • ఎన్నికల్లో వైసీపీ ఓడితే వీటిని ఏం చేస్తారు?

  • చెరిపేందుకు వీల్లేకుండా ముద్రణ.. రాతలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి) :

ఇదో.. బొమ్మల కథ! సీఎం జగన్‌ (CM YS Jagan Reddy) ఫొటోలతో ఏర్చికూర్చిన అందమైన చిత్రాల కథ!! దీనికి స్ర్కీన్‌ప్లే, డైరెక్షన్‌.. జగన్‌ భక్త అధికారులే. సుమారు రూ.వెయ్యి కోట్లతో రూపొందించిన ఈ బొమ్మల కథకు నిర్మాత మాత్రం ప్రభుత్వ ఖజానా! మళ్లీ వస్తుందో రాదో తెలియని వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘జగనన్న విద్యాకానుక’ను అధికారులు జగన్‌ బొమ్మలతో సిద్ధం చేయిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం(జూన్‌ నుంచి మొదలు)లో ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఇచ్చే విద్యా కానుక కిట్ల తయారీకి ఏకంగా రూ.వెయ్యి కోట్లను ఖర్చు చేస్తున్నారు. అది కూడా ప్రతి కిట్‌పైనా జగన్‌ బొమ్మలు వేసి!! దీంతో ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. వాస్తవానికి గత నాలుగేళ్లుగా ఇచ్చిన విద్యా కానుకలోని వస్తువులపై జగన్‌ ఫొటోలు, ‘జగనన్న విద్యా కానుక’ పేరుతో లోగోలు ముద్రిస్తూ వచ్చారు. 2024-25 విద్యా సంవత్సరానికి జూన్‌లో ఇవ్వబోయే విద్యా కానుక కిట్లపై జగన్‌ ఫొటోలు, లోగోలు ముద్రిస్తున్నారు. అయితే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే... జగన్‌ ఫొటోలు, జగన్‌ పేరుతో ఉన్న లోగోలు ముద్రించిన పుస్తకాలు, బ్యాగులు, బెల్టులు ఏం చేయాలి? రూ.వెయ్యి కోట్లు వెచ్చించి ఇస్తున్న విద్యా కానుక కిట్లను కొత్త ప్రభుత్వం పంపిణీ చేస్తుందా? ఆ ఫొటోలు, లోగోలు చెరిపేయడం సాధ్యమేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మేమూ రెడ్లమే.. జగన్‌‌ను మళ్లీ గెలిపిస్తే..?

Naadu-Nedu.jpg

అధికారుల అత్యుత్సాహం

విద్యా కానుక కిట్‌లో విద్యార్థులకు పాఠ్య, నోట్‌ పుస్తకాలు, యూనిఫాం క్లాత్‌, బ్యాగు, బెల్టు, బూట్లు, సాక్సులు పంపిణీ చేస్తున్నారు. వీటిలో నోట్‌ పుస్తకాలపై జగన్‌ ఫొటో ముద్రిస్తున్నారు. బ్యాగులు, బెల్టులపై జగనన్న విద్యా కానుక పేరును ముద్రిస్తున్నారు. ఈ మొత్తం కిట్‌లో పుస్తకాలు, బ్యాగులకే ఎక్కువ ధర వెచ్చిస్తున్నారు. అలాంటి వాటిపై ఏ ప్రభుత్వం వస్తుందన్న ఆలోచన లేకుండా యథావిథిగా జగన్‌ ఫొటోలు, ఆయన పేరుతో పథకం లోగోలు ముద్రిస్తుండడం వెనుక స్వామి భక్తి ప్రదర్శించే అధికారుల హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ పుస్తకాలపై వేసే ఫొటోలు తొలగించడం సాధ్యం కాదు. అలాగే బ్యాగులు, బెల్టులపై వేసే లోగోలను కూడా తీసేయలేరు. ఎన్నికలు సమీపించినందున వారి ఫొటోలు, లోగోలు లేకుండా కిట్లు తయారుచేస్తే బాగుంటుందని విద్యాశాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒకవేళ వైసీపీ ప్రభుత్వమే తిరిగి ఏర్పాటైనా ఒక ఏడాదికి జగన్‌ ఫొటోలు, పేర్లు లేకపోతే వచ్చే నష్టం ఏం ఉండదని అంటున్నారు. ప్రచారమే కావాలనుకుంటే మిగిలిన నాలుగేళ్లు ఫొటోలు వేసుకోవచ్చు. కానీ, ఇవేం పట్టించుకోని సమగ్ర శిక్ష విభాగంలోని స్వామి భక్తి ప్రదర్శించే కొందరు అధికారులు అత్యుత్సాహంతో మళ్లీ ఈ ప్రభుత్వమే వస్తుందన్నట్టుగా జగన్‌ ఫొటోలతో కిట్లు తయారుచేస్తున్నారు. ఆ మేరకు ఇటీవల వర్క్‌ ఆర్డర్లు జారీచేశారు. ఒకవేళ రేపు ప్రభుత్వం మారితే జగన్‌ ఫొటోల వల్ల కలిగే నష్టాన్ని సమగ్రశిక్ష అధికారులు భరిస్తారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

YS Jagan Sad.jpg

చివరికి గ్లాసులనూ వదల్లేదు

జగన్‌ ప్రభుత్వంలో ప్రచారం పిచ్చి పతాక స్థాయికి చేరిందనే దానికి విద్యాశాఖలోని పథకాలే ప్రత్యక్ష ఉదాహరణ. చిన్న పిల్లలకు ఇచ్చే చిక్కీల కవర్లపై జగన్‌ ఫొటోలు వేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో ఆ కవర్లు చించి చిక్కీలు పంపిణీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. కవర్లు చించకుండా పంపిణీ చేశారంటూ ఓ టీచర్‌పై ఇటీవల చర్యలు కూడా తీసుకున్నారు. అసలు జగన్‌ ఫొటోలే లేకపోతే ఈ గోలంతా ఉండదు కదా అని టీచర్లు అంటున్నారు. అలాగే పిల్లలకు ఇచ్చే కోడిగుడ్లపై ‘వైఎ్‌సఆర్‌ సంపూర్ణ పోషణ’ పేరును ముద్రిస్తున్నారు. ఇక, గతేడాది కొత్తగా ప్రారంభించిన రాగి జావ పంపిణీలోనూ జగన్‌ పేరును ప్రచారం చేశారు. అందుకోసం పిల్లలకు ఇచ్చిన స్టీలు గ్లాసులపై ‘జగనన్న గోరుముద్ద’ అనే పేరును ముద్రించారు. దానిని తీసేయడం అసలు సాధ్యం కాదు. అలాగే ఎనిమిదో తరగతి విద్యార్థులకిచ్చిన ట్యాబ్‌లపైనా జగన్‌ ఫొటోలు వేశారు. టీచర్లకు ఇచ్చిన రిసోర్స్‌ బుక్స్‌పైనా వైసీపీ జెండా రంగులు వేశారు. ఇలా విద్యారంగంలో ఎక్కడి కనిపిస్తే అక్కడ అధికార పార్టీకి అనుకూల ప్రచారం చేశారు. ఇప్పటివరకు ఎలా ఉన్నా భవిష్యత్తులోనూ వైసీపీనే అధికారంలో ఉంటుందన్నట్టుగా వచ్చే ఏడాదికి ఇవ్వబోయే విద్యాకానుక కిట్లపై జగన్‌ ఫొటోలు వేయడం విమర్శలకు దారితీసింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 02 , 2024 | 08:45 AM