Nellore : అయ్యో.. దేవుడా!
ABN , Publish Date - Dec 11 , 2024 | 04:18 AM
ఆ చిన్నారికి బ్రెయిన్ ట్యూమర్! తల్లిదండ్రులు నిరక్షరాస్యులు! దానికి తోడు పేదరికం! శస్త్రచికిత్స చేయించేందుకు స్థోమత సరిపోలేదు. పైగా...
చిన్నారికి బ్రెయిన్ ట్యూమర్
40 రోజులు చర్చిలోనే ఉండి ఉపవాస ప్రార్థనలు
అక్కడే ప్రాణాలు వదిలిన చిన్నారి
కలువాయి, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఆ చిన్నారికి బ్రెయిన్ ట్యూమర్! తల్లిదండ్రులు నిరక్షరాస్యులు! దానికి తోడు పేదరికం! శస్త్రచికిత్స చేయించేందుకు స్థోమత సరిపోలేదు. పైగా... ఆపరేషన్ చేస్తే ఏమవుతుందో అని భయపడ్డారు! చివరికి దేవుడిని నమ్ముకున్నారు. 40 రోజులు చర్చిలోనే ఉండి ప్రార్థనలు చేశారు. ఆఖరికి... చర్చిలోనే ఆ చిన్నారి కన్ను మూసింది! ‘ట్రాన్స్’ సినిమాను గుర్తు చేసే ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా కలువాయి మండలం బాలాజీరావుపేట దళిత కాలనీకి చెందిన లక్ష్మయ్య, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. నెల్లూరు నగరంలో ఓ అపార్ట్‌మెంటులో వాచ్‌మన్‌గా పనిచేస్తూ అక్కడే జీవనం సాగిస్తున్నారు. పెద్ద కుమార్తె భవ్యశ్రీ(8)ని కలువాయి మండలం నూకనపల్లిలో ఉంటున్న లక్ష్మి చెల్లెలు వద్ద ఉంచి స్కూలుకు పంపుతున్నారు. కొంతకాలంగా భవ్యశ్రీ తలనొప్పి, వాంతులతో బాధపడుతోంది. ఆస్పత్రిలో చూపించగా.. భవ్యశ్రీ తలలో ట్యూమర్ ఉందని, శస్త్రచికిత్స చేయాలని డాక్టర్లు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు భయపడ్డారు.
ఆర్థిక స్తోమతలేక శస్త్రచికిత్స ప్రయత్నాన్నివిరమించుకున్నారు. ఈ క్రమంలో ఆదూరుపల్లిలోని చర్చిలో ప్రార్థనలు చేస్తే జబ్బు నయమవుతుందని కొందరు బంధువులు చెప్పారు. దీంతో వారు భవ్యశ్రీతోపాటు చర్చికి చేరుకుని 40రోజులుగా అక్కడే ఉంటూ ఉపవాస ప్రార్థనలు చేస్తూ వచ్చారు. బిడ్డ పరిస్థితి క్షీణిస్తున్నా దేవుడినే నమ్ముకున్నారు. చివరికి.. చర్చి ఫాదరు కూడా వారిని వారించలేదు. బిడ్డ ఆరోగ్యం కుదుటపడుతుందని చెప్పారు. అదే నమ్మకంతో ఉన్నారు. భవ్యశ్రీ ఆరోగ్యం క్షీణంచి చివరకు సోమవారం అర్ధరాత్రి చర్చిలోనే ప్రాణాలు విడిచింది.