AP GovT Ration Rice : రేషన్ బియ్యానికి రెక్కలు!
ABN , Publish Date - Dec 14 , 2024 | 04:55 AM
పేదలకు రాయితీ ధరపై ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది.
విశాఖ పోర్టు నుంచి ఆగని అక్రమ రవాణా
20 కంటెయినర్లతో చైనాకు బయల్దేరిన నౌక
పోర్టు సీఎ్‌ఫఎస్ వద్దే అధికారుల తనిఖీలు
పట్టుబడిన సరుకు సీజ్ చేయకుండా వెనక్కి
ఇతర సీఎ్‌ఫఎ్‌సల నుంచి తరలుతున్న బియ్యం
విశాఖపట్నం, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): పేదలకు రాయితీ ధరపై ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై కొద్ది రోజులుగా పెద్దఎత్తున విచారణ జరుగుతున్నా వ్యాపారులు పట్టించుకోకుండా ఎగుమతులు చేస్తూనే ఉన్నారు. విశాఖపట్నం పోర్టు నుంచి ఎగుమతికి సిద్ధం చేసిన రేషన్ బియ్యాన్ని కొద్దిరోజుల క్రితం పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పట్టుకున్న సంగతి తెలిసిందే. కాకినాడ నుంచే కాకుండా విశాఖ పోర్టు నుంచి కూడా రేషన్ బియ్యం ఎగుమతి అవుతున్న విషయం అప్పుడే బయటపడింది. దాంతో అధికారులను అప్రమత్తం చేశారు. రేషన్ బియ్యం ఎట్టి పరిస్థితుల్లో పోర్టు నుంచి ఎగుమతి కావడానికి వీల్లేదని మంత్రి ఆదేశించారు. దాంతో ఆ శాఖకు చెందిన అధికారులు పోర్టు ఏరియాలోని కంటెయినర్ ఫ్రైట్ స్టేషన్ (సీఎ్‌ఫఎస్) వద్ద రోజూ నిఘా పెడుతున్నారు.
బియ్యం లోడుతో వచ్చే లారీలను పరిశీలిస్తున్నారు. రేషన్ బియ్యం ఉంటే సీజ్ చేయకుండా వెనక్కి తిప్పి పంపిస్తున్నారు. ఈ విధంగా గత మూడు రోజులుగా కొన్ని లారీలను వెనక్కి పంపేశారు. అయితే వ్యాపారులు ఆ లారీలను విశాఖలోనే వేరే సీఎ్‌ఫఎస్‌లకు పంపించి, వాటి ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బెబో ఇంటర్నేషనల్ సంస్థ ఇదేవిధంగా సుమారుగా 530 టన్నుల బియ్యాన్ని (10,600 బ్యాగులు) 20 కంటెయినర్లలో వ్యాన్ హాయ్ 367-14 నౌక ద్వారా గురువారం చైనాకు పంపింది. పౌర సరఫరాల శాఖ అధికారులు విశాఖలోని అన్ని సీఎ్‌ఫఎ్‌సల వద్ద నిఘా పెట్టకుండా కేవలం విశాఖ పోర్టుకు చెందిన సీఎ్‌ఫఎస్ వద్దే ఉండటంతో వ్యాపారుల పని సులభమవుతోంది. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడానికి అన్ని శాఖల అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాల్సి ఉందని పోర్టు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.