Andhra Pradesh: గురజాలలో మరోసారి గ్రూప్ విభేదాలు.. ప్లెక్సీలో ఫొటో లేదంటూ ఘర్షణ.. చివరకు..
ABN , Publish Date - Feb 04 , 2024 | 02:25 PM
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో మరోసారి గ్రూపు విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో మరోసారి గ్రూపు విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దాచేపల్లి మండలం గామలపాడులో నేడు వైఎస్సార్ ఆసరా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రోగ్రాంకు ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి హాజరవుతున్నారు. ఆయన రాకతో పార్టీ కార్యకర్తలు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే.. ఫ్లెక్సీలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఫోటోలు లేకపోవడంతో ఎమ్మెల్సీ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రే ఎమ్మెల్యే ఆహ్వాన ఫ్లెక్సీలను తొలగించారు.
సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే వర్గీయులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి సొంత గ్రామం కావడంతో గొడవ జరిగే అవకాశాలు ఉండటంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో గ్రామంలో ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని గ్రామస్థులు బిక్కుబిక్కుమంటున్నారు. ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా రాలేదు. అప్పుడే గ్రామంలో ఇలాంటి పరిస్థితి చూస్తామని అనుకోలేదని గ్రామస్థులు చెప్పడం గమనార్హం.
అయితే.. ఈసారి గురజాల అసెంబ్లీ టికెట్ ను తనకు ఇవ్వాలంటూ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కోరుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి సైతం ఈసారి కూడా సీటు తనదేనని ధీమాగా ఉన్నారు. అధికార పార్టీ అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోతే జంగా సైకిల్ ఎక్కుతారా? ఎక్కితే అప్పుడేం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.