CM Chandrababu: 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు చంద్రబాబు శ్రీకారం..
ABN , Publish Date - Jul 19 , 2024 | 07:53 PM
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) వేగంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రయోజనాల కోసం పలుమార్లు ఢిల్లీ పెద్దలను కలిశారు. అలాగే ఏపీ ప్రజల జీవితాల్లో మార్పు కోసం తాజాగా వికసిత్ ఆంధ్రప్రదేశ్(Vikasit Andhra Pradesh) పేరుతో విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) వేగంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రయోజనాల కోసం పలుమార్లు ఢిల్లీ పెద్దలను కలిశారు. అలాగే ఏపీ ప్రజల జీవితాల్లో మార్పు కోసం తాజాగా వికసిత్ ఆంధ్రప్రదేశ్(Vikasit Andhra Pradesh) పేరుతో విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. వికసిత్ భారత్ తరహాలోనే ఇది ఉండనుంది. దాంట్లో భాగస్వామ్యమయ్యేలా 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రెండ్రోజుల క్రితం ఢిల్లీ పర్యటనలో భాగంగా విజన్ డాక్యుమెంటుపై నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరీతో ముఖ్యమంత్రి 3గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనపై నీతి అయోగ్ సీఈవో సుబ్రహ్మణ్యంతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగా ఏపీ విజన్ డాక్యుమెంట్‌లో పొందుపరచాల్సిన ముఖ్యమైన అంశాలను ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.." పేదరికం లేని సమాజం, జనాభా సమతుల్యతపై కసరత్తు చేసి ప్రణాళికలు రూపొందిస్తాం. అన్ని రంగాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనుసంధానం చేస్తాం. ఏపీలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేసేందుకు ఆలోచన చేస్తున్నాం. వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్‌లో రాష్ట్రస్థాయి నుంచి కుటుంబస్థాయి వరకు ప్రణాళికలు రూపొందిస్తాం. వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలు తీసుకువస్తాం. 15శాతం గ్రోత్ రేట్ సాధించడమే ఆంధ్రప్రదేశ్ లక్ష్యం. అనుకున్న విధంగా గ్రోత్ రేట్ సాధిస్తే తలసరి ఆదాయం కూడా పెరిగి ప్రజల ఆర్థిక స్థితిగతులు మారతాయి. వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ముఖ్యంగా పేదరిక నిర్మూలన దిశగా విజన్ డాక్యుమెంట్ రూపకల్పన చేస్తున్నాం. సంపద సృష్టి పాలసీలతో 2047 విజన్ డాక్యుమెంట్ ఉంటుంది" అని చెప్పారు.