AP Govt: ఇచ్చిన హామీ నెరవేర్చిన మంత్రి లోకేశ్
ABN , Publish Date - Sep 18 , 2024 | 06:59 PM
ఇచ్చిన హామీ మేరకు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సైనికుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటన చేసింది. అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే హామీ నెరవేర్చారని మాజీ సైనికులు గుర్తుచేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మాజీ సైనికులు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేశారు. సైనికుల సంక్షేమం కోసం సైనికుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ సర్కార్ నిర్ణయంపై మాజీ సైనికులు హర్షం వ్యక్తం చేశారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని మంత్రి నారా లోకేశ్ నిలబెట్టుకున్నారని ప్రశంసలు కురిపించారు. తమ సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేశారు.
వంద రోజుల్లోనే..
ఇచ్చిన హామీ మేరకు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సైనికుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటన చేసింది. అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే హామీ నెరవేర్చారని మాజీ సైనికులు గుర్తుచేశారు. లక్షా పదివేల మాజీ సైనికుల కుటుంబాల పట్ల చూపిన అభిమానం మరవలేమని పేర్కొన్నారు. ఈ రోజు (బుధవారం) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ సైనికులు మీడియాతో మాట్లాడారు. జీవో నెంబర్ 57, 191లను ప్రభుత్వం అమలు చేయాలని అభ్యర్థించారు. జీవో నంబర్ 357 ప్రకారం ప్రభుత్వం నియమించే నియామకాల్లో 2 శాతం ఉద్యోగాలను మాజీ సైనికులకు కేటాయించినప్పటికీ దానిని అమలు చేయలేదన్నారు.
పట్టించుకోలేదు
గత ప్రభుత్వంలో మాజీ సైనికుల సమస్యలను పట్టించుకోలేదని మండిపడ్డారు. సమస్య గురించి ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేదని వివరించారు. మాజీ సైనికులకు హక్కుగా వస్తున్న ఉద్యోగాలను తమకు దక్కేలా చూడాలని కోరారు. గ్రూప్-1, గ్రూప్-2లో 2 శాతం రిజర్వేషన్‌ను 5 శాతానికి, గ్రూప్-3, గ్రూప్-4లో 10 శాతానికి రిజర్వేషన్ పెంచాలని సూచించారు. మాజీ సైనికులను ఓసీలుగా పరిగణిస్తున్నారని గుర్తుచేశారు. సైనికుల్లో అన్ని కులాల వారు ఉంటారని వివరించారు. దీంతో మాజీ సైనికులకు దక్కాల్సిన ఉద్యోగాలు రావడం లేదని వాపోయారు. రిజర్వేషన్‌ను సవరిస్తూ నిర్ణయం తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని మాజీ సైనికులు అభ్యర్థించారు.