Nara Lokesh: ఓడిన చోటే.. నిలిచి
ABN , Publish Date - May 09 , 2024 | 01:54 AM
ఓడిపోతే.. ఇక్కడ నాకెందుకులే పనంటూ ఎవరైనా పక్కకు తప్పుకుని పోతారు. కానీ నారా లోకేశ్ అలాకాదు. మరోసారి పోటీలో నిలిచారు.
మంగళగిరి, మే 8: ఓడిపోతే.. ఇక్కడ నాకెందుకులే పనంటూ ఎవరైనా పక్కకు తప్పుకుని పోతారు. కానీ నారా లోకేశ్ అలాకాదు...2019 ఎన్నికల్లో జరిగిన ఓటమికి కుంగిపోకుండా మంగళగిరి ప్రజల హృదయాలను ముందర గెలుచుకుంటానంటూ గత అయిదేళ్లపాటు నియోజకవర్గ ప్రజలకు వివిధ రూపాల్లో సేవలనందిస్తూ వచ్చారు. బహుశా భారతదేశ చరిత్రలో ఇంతకుముందెన్నడూ.. ఏ రాజకీయనాయకుడు ఈ తరహా ప్రజాసేవ చేసి వుండరంటే అతిశయోక్తి కాదేమో! అందుకే!! లోకేశ్ నేడు ధీమాగా చెబుతున్నారు... తాను మంగళగిరిలో 53వేల పైచిలుకు మెజారిటీతో గెలుస్తానని. ఇది తాను చేసిన ప్రజాసేవ పట్ల తనకున్న నమ్మకం. ఆ నమ్మకంతోనే లోకేశ్ మంగళగిరిలో తన సత్తాను చాటబోతున్నారు. ఈ సందర్భంగా లోకేశ్ అయిదేళ్లుగా చేస్తూ వచ్చిన సేవలేమిటో క్లుప్తంగా చూద్దాం!
పెళ్లికానుకల పంపిణీ:
లోకేశ్ సేవలు నియోజకవర్గంలో పెళ్లికానుకలతో ఆరంభమయ్యాయి. నియోజకవర్గంలో తనకు పెళ్లి కార్డు పంపించిన ప్రతి వివాహానికి స్థానిక నాయకుల ద్వారా నూతన వస్త్రాలను కానుకలుగా అందిస్తున్నారు. 2021 ఆగస్టు నుంచి ఆరంభించి ఇప్పటివరకు 2201 మందికి ఈ కానుకలను పంపిణీ చేయించారు. దళిత కుటుంబాల్లో జరిగే వివాహాలకు బంగారు మంగళసూత్రాలను అందించే కార్యక్రమాన్ని 2023 జనవరి నుంచి చేపట్టి ఇప్పటివరకు 124 మందికి వీటిని అందజేశారు.
నాలుగు చోట్ల అన్నాక్యాంటీన్లు
నియోజకవర్గంలో నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో అన్నాక్యాంటీన్‌లను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. మంగళగిరి టౌన్‌లో 2022 జూన్ పదిన వివాదాల నడుమ రాష్ట్రంలోనే తొలి అన్నక్యాంటీన్‌ను లోకేశ్ ఆరంభించారు. రోజుకు 400మందికి ఉచితంగా అన్నదానం చేస్తూ ఇప్పటికి 700వ రోజు మైలురాయి దిశగా పరుగులు తీయిస్తున్నారు. తాడేపల్లి నులకపేట, దుగ్గిరాల రైలుపేట, రేవేంద్రపాడు ప్రాంతాల్లో కూడ అన్నాక్యాంటీన్‌లను విజయవంతంగా నిర్వహింపజేస్తున్నారు.
చిరువ్యాపారులకు అండగా
నియోజకవర్గంలోని చిరువ్యాపారులకు లోకేశ్ చాల వెన్నుదన్నుగా నిలిచారు. నియోజకవర్గ వ్యాపితంగా చిరువ్యాపారుల ఉపాధికోసం తోపుడుబండ్లు, ఇస్త్రీ బండ్లు, మొబైల్ కిరాణా దుకాణాలు, బల్ల రిక్షాలు, ట్రైసైకిళ్లు, ఐస్‌క్రీమ్ బండ్లను పంపిణీ చేశారు. ఇప్పటివరకు సుమారు 2500మందికి తోపుడు బండ్లు, మరో 185 మందికి సెలూన్ చైర్లు పంపిణీ చేశారు. వెల్డింగ్ పనులు చేసి జీవించే కార్మికుల స్వయం ఉపాధి కోసం ఇప్పటివరకు 134 మందికి వెల్డింగ్ మెషిన్‌లను అందజేయించారు.
సంజీవని ఆరోగ్యసేవ
లోకేశ్ చేపట్టిన సేవా కార్యక్రమాల్లో ఇది ఉత్తమంగా నిలిచింది. ఉచిత డాక్టర్ కన్సల్టేషన్, ఉచిత వైద్య పరీక్షలు, ఉచితంగా మందుల పంపిణీ చేయించడం దీని ముఖ్యోద్దేశ్యం. ఇందుకోసం మంగళగిరి టిప్పర్ల బజారులో 2022 ఆగస్టులో, తాడేపల్లి మెయిన్‌రోడ్డులో 2022 అక్టోబరులో సంజీవని ఉచిత ఆరోగ్యకేంద్రాలను ఏర్పాటుచేయించి మంగళగిరిలో ఇప్పటివరకు 50వేల మందికి, తాడేపల్లిలో 39,378మందికి ఉచిత వైద్యసేవలను అందించి మందులను పంపిణీ చేయించారు. ఇవిగాక మొబైల్ వైద్యసేవల కోసం ఓ ప్రత్యేక బస్సును సంజీవని ఆరోగ్యరధం పేరిట ఏర్పాటుచేయించి ఇప్పటివరకు సుమారు 40వేల మందికి వైద్యసాయమందించారు. నియోజకవర్గంలో ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకు 25వేల మందికి ఉచితంగా ఖరీదైన వైద్యపరీక్షలను జరిపించారు. రెండు మూడు మాసాల కిందట కేన్సర్ స్ర్కీనింగ్ పరీక్షలను కూడ బసవతారకం కేన్సర్ ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో ఉచితంగా జరిపించారు.
స్త్రీశక్తి
దీనిద్వారా మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ, ఉచితంగా బ్యూటీషన్ శిక్షణ ఇప్పించి వారికి స్వయం ఉపాధిని చూపించే విధంగా దీనిని నిర్వహిస్తున్నారు. 2022 జూన్‌లో మంగళగిరిలోను, 2023 ఫిబ్రవరిలో తాడేపల్లిలోను, అదే ఏడాది ఏప్రిల్‌లో దుగ్గిరాలలోను ఈ స్త్రీశక్తి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ మూడు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 55 బ్యాచ్‌లను నిర్వహించి మొత్తం 2600మంది మహిళలకు కుట్టుశిక్షణను ఉచితంగా ఇప్పించడంతోపాటు వారందరికీ ఉచితంగా కుట్టుమిషన్‌లను పంపిణీ చేయించారు. ఇక మంగళగిరిలో బ్యూటీషన్ ప్రోగ్రాం కింద 124 మందికి శిక్షణను ఇప్పించి వారికి స్వయం ఉపాధిని కల్పించారు.
Read more AP News and Telugu News