Karthika masam: కార్తీక సోమవారం వేళ.. భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు
ABN , Publish Date - Nov 04 , 2024 | 07:13 AM
కార్తీక మాసం పురస్కరించుకొని వేలాదిమంది భక్తులు ప్రముఖ ఆలయాలను సందర్శించారు. కార్తీకీమాసం తొలి సోమవారం కావడంతో వేకువజాముననే ప్రధాన ఆలయాల్లోని కోనేర్లల్లో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. గంటల కొద్ది క్యూలో నిల్చొని ప్రధాన ఆలయాల్లో స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. నవంబరు 2 నుంచి డిసెంబరు ఒకటో తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరగనున్నాయి.
నంద్యాల: భక్తులు పరమ పవిత్రంగా భావించే కార్తీకమాసం తొలి సోమవారం సందర్భంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు. కార్తీకమాసాన్ని పురస్కరించుకుని వేలాదిమంది భక్తులు స్వామి అమ్మవార్లను తెల్లవారుజాము నుంచే దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాల్లో తెల్లవారుజామున 5గంటల నుంచి రాత్రి 9గంటల వరకు నిరంతర దర్శనం కల్పించడానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈసందర్భంగా ప్రధాన ఆలయాలను భక్తులు దర్శించుకుని భక్తి శ్రద్ధలతో మొక్కులు సమర్పించుకుంటున్నారు. మహిళ భక్తులు ఆలయ పరిసరాల్లో కార్తీక దీపాలను వెలిగించారు. ఆలయ పరిసరాలు భక్తుల శివనామస్మరణతో మార్మోగిపోయాయి.
శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ..
శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. కార్తీకమాసం మొదటి సోమవారం కావడంతో శ్రీశైలం ఆలయ క్యూలైన్లు భక్తులతో కిక్కిరిశాయి. పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించి గంగమ్మ వడిలో కార్తీక దీపాలను వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల రద్దీ కారణంగా స్వామివారి గర్భాలయ అభిషేకాలు, స్వామివారి గర్భాలయ స్పర్శ దర్శనాలు తాత్కాలికంగా రద్దు చేశారు. స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతోంది. గంగాధర మండపం వద్ద కార్తీక దీపాలను వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు.
యాగంటిలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రతేక పూజలు
నంద్యాల జిల్లా: కార్తీక మాసం తొలి సోమవారం ప్రముఖ యాగంటి క్షేత్రం భక్తులతో రద్దీగా మారింది. బనగానపల్లె మండలంలోని యాగంటి క్షేత్రంలో సతీసమేతంగా ఏపీ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రతేక పూజలు నిర్వహించారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి పూర్ణ కుంభంతో ఆలయ కార్యనిర్వాహణ అధికారి చంద్రుడు, ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు.
క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
పశ్చిమ గోదావరి: పంచారామ క్షేత్రమైన పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దర్శనానికి వేకువజాము నుంచి భక్తులు బారులుదీరారు. క్షీరా రామంగేశ్వర స్వామి మూలవిరాట్‌కు అర్చకులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి హరిహర మహాదేవ అంటూ వేలాది మంది భక్తులు శివ నామస్మరణ చేస్తున్నారు.
భీమవరం పంచారామ క్షేత్రంలో...
కార్తీక మాసం తొలి సోమవారం భీమవరం పంచారామ క్షేత్రం శ్రీ ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి దేవుడి దర్శనం కోసం క్యూ లైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. అర్చకులు స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు.
నరసాపురంలో
నరసాపురం వశిష్ట గోదావరి తీరాన శివనామస్మరణ మార్మోగుతోంది. గోదావరిలో పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. తెల్లవారుజాము నుంచి వలందర్ రేవులో భక్తులు పుణ్య స్నానాలు చేసి గోదావరిలో కార్తీక దీపాలు విడిచి పెట్టి పూజలు చేస్తున్నారు. అమరేశ్వర, కపిల మల్లేశ్వర స్వామి ఆలయాల వద్ద పరమశివుని దర్శనానికి భక్తులు బారులుదీరారు.
రాజమండ్రి గోదావరిలో భక్తుల పుణ్యస్నానాలు
రాజమండ్రి: కార్తీకమాసం తొలి సోమవారం సందర్భంగా గోదావరి తీరాన భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. రాజమండ్రి పుష్కర ఘాట్‌కు భక్తులు పోటెత్తారు. శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
విశాఖపట్నంలో రద్దీగా శివాలయాలు
విశాఖపట్నం: కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా శివాలయాలు భక్తులతో రద్దీగా మారాయి. తెల్లవారుజాము నుంచే స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు.శివ నామస్మరణలతో ఆలయాలు మార్మోగుతున్నాయి. ఆలయాల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి పూజలు నిర్వహిస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో శివనామ స్మరణతో మార్మోగుతున్న శివాలయాలు
ఎన్టీఆర్ జిల్లా (నందిగామ): కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా శివాలయాలు రద్దీగా మారాయి. భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలతో శివాలయాలు శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి.
అమరావతిలో భక్తుల సందడి
పల్నాడు జిల్లా: పంచారామ క్షేత్రం అమరావతిలో కార్తీక సోమవారం సందడి నెలకొంది. కృష్ణానదిలో భక్తులు స్నానాలుమాచరిస్తున్నారు. తెల్లవారు జాము నుంచే అమరలింగేశ్వరుడని భక్తులు దర్శించుకుంటున్నారు.
శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో...
(డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా) , ద్రాక్షారామం: శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాసం మొదటి సోమవారం స్వామివారిని, అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు.
పాదగయా క్షేత్రంలో భక్తుల రద్దీ...
కాకినాడ జిల్లా: కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం పాదగయా క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. వేకువజాము నుంచే పాదగయ పుష్కరిణిలో పుణ్య స్నానమాచరించిన భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారికి, పురుహూతిక అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమ పూజలను భక్తులు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
పెందుర్తి సరిపల్లిలో పెందుర్తి, సరిపల్లిలో ...
ఉమ్మడి విశాఖ జిల్లా: కార్తీక సోమవారం సందర్భంగా భక్తులతో శైవ క్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శివుడిని దర్శనం చేసుకుంటున్నారు. పెందుర్తి, సరిపల్లిలో స్వయంభువుగా వెలసిన పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు, పాలభిషేకాలు చేశారు. శివాలయాల్లో భక్తులు కార్తీక దీపాలు వెలిగించి.. శివునికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వారి కోసమే రెడ్‌బుక్.. హోం మంత్రి
84 వేల కోట్ల పెట్టుబడులు 5 లక్షల ఉద్యోగాలు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News