Share News

Pawan kalyan: రాజకీయ నేతల గుప్పెట్లో క్రీడా సంఘాలు బందీ అయ్యాయంటూ డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు..

ABN , Publish Date - Jun 30 , 2024 | 03:25 PM

రాజకీయ నేతల గుప్పెట్లో క్రీడా సంఘాలు బందీ అయ్యాయంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ (Deputy CM Pawan Kalyan)ను కలిసి పలువురు క్రీడాకారులు ఫిర్యాదు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్నీ రంగాలూ అదోగతి పాలయ్యాయని, అలాగే క్రీడారంగం సైతం అస్తవ్యస్తంగా మారిందని డిప్యూటీ సీఎంకు వివరించారు.

Pawan kalyan: రాజకీయ నేతల గుప్పెట్లో క్రీడా సంఘాలు బందీ అయ్యాయంటూ డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు..

అమరావతి: రాజకీయ నేతల గుప్పెట్లో క్రీడా సంఘాలు బందీ అయ్యాయంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(Deputy CM Pawan Kalyan)ను కలిసి పలువురు క్రీడాకారులు ఫిర్యాదు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్నీ రంగాలూ అదోగతి పాలయ్యాయని, అలాగే క్రీడారంగం సైతం అస్తవ్యస్తంగా మారిందని డిప్యూటీ సీఎంకు వివరించారు. రాష్ట్రంలో దారి తప్పిన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తోందని, అలాగే క్రీడారంగంపైనా దృష్టి పెట్టాలని కోరారు. క్రీడా సంఘాలు బాగుపడితేనే అత్యుత్తమ క్రీడాకారులు రూపొందుతారని పవన్ కల్యాణ్‌కు చెప్పారు. ఏపీలో క్రీడలతో సంబంధం లేని వారి చేతికి సంఘాలను అప్పగించవద్దని విజ్ఞప్తి చేశారు.


రాజకీయ నాయకుల బంధువుల పిల్లలకే అవకాశాలు..!

క్రికెట్‌లో అనుభవం ఉన్నవారికే క్రికెట్ సంఘం భాద్యతలు అప్పగించాలని, అలాగే కబడ్డీ ఆటపై పట్టు ఉన్నవారికే కబడ్డీ సంఘం అప్పగించాలని ఉపముఖ్యమంత్రిని క్రీడాకారులు కోరారు. ఇదే పద్ధతి అన్ని సంఘాలకు అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ క్రీడా రంగం అగ్రగామిగా నిలుస్తుందన్నారు. కొన్ని క్రీడా సంఘాలు రాజకీయ ఉపాధి ఆవాస కేంద్రాలుగా మారిపోయాయని, క్రీడాకారులకు ఇచ్చే సర్టిఫికెట్లు అంగడి సరకుగా మారాయంటూ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు తెలిపారు.

దీని వల్ల ఎలాంటి క్రీడానుభవం లేనివారు స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో సీట్లు పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడా సంఘాల్లో తిష్టవేసిన రాజకీయ నాయకులు తమ బంధువులు, సన్నిహితుల పిల్లలను ఎంపిక చేస్తున్నారని, క్రీడా సంఘాల నిధులు యథేచ్ఛగా దోపిడీకి గురవుతున్నాయని పవన్‌కు వెల్లడించారు. క్రీడానుభవం లేని రాజకీయ నాయకులకు క్రీడా సంఘాల్లో ప్రవేశం లేకుండా చూడాలని పలువురు క్రీడాకారులు ఉపముఖ్యమంత్రిని కోరారు.


డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ..

క్రీడాకారుల సమస్యలు విన్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ తగిన విధంగా న్యాయం చేస్తానంటూ హామీ ఇచ్చారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తానని డిప్యూటీ సీఎం తనను కలిసిన క్రీడాకారులకు చెప్పారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం క్రీడా సంఘాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని భరోసా కల్పించారు. నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరగకుండా చూస్తామని, క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం తగిన వైభవాన్ని తీసుకువస్తుందని హామీ ఇచ్చారు.

Updated Date - Jun 30 , 2024 | 03:25 PM