YSRCP: వైసీపీ నేతల్లో ఉలిక్కిపాటు.. నిజాలు బయటకు వస్తాయని భయపడుతున్నారా
ABN , Publish Date - Dec 06 , 2024 | 11:32 AM
అరాచక పాలనకు చరమగీతం పాడాలని, ప్రజా పాలన అందించకపోతే.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పులకు శిక్ష అనుభవించాల్సి వస్తుందని ఐదేళ్ల క్రితం నుంచి హెచ్చరిస్తూ వచ్చినా.. అప్పటి పాలకులు పట్టించుకోలేదు. శాశ్వతంగా అధికారం తమదే.. ఎట్టి పరిస్థితుల్లో..
వైసీపీ నేతల్లో ఆందోళన ఎక్కువైందా.. గుమ్మడి కాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటున్నారా.. నిజాలు బయటకు వస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదని భయపడుతున్నారా.. ప్రస్తుతం వైసీపీ నేతల తీరు చూస్తుంటే ఇవే అనుమానాలు కలుగుతున్నాయట. 2019-2024 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వ పాలనపై అప్పటి ప్రతిపక్షం టీడీపీ ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే వచ్చింది. అరాచక పాలనకు చరమగీతం పాడాలని, ప్రజా పాలన అందించకపోతే.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పులకు శిక్ష అనుభవించాల్సి వస్తుందని ఐదేళ్ల క్రితం నుంచి హెచ్చరిస్తూ వచ్చినా.. అప్పటి పాలకులు పట్టించుకోలేదు. శాశ్వతంగా అధికారం తమదే.. ఎట్టి పరిస్థితుల్లో మరో పది నుంచి పదిహేనేళ్లు వేరే పార్టీకి అవకాశం లేదనే భ్రమల్లో వైసీపీ నేతలు ఉంటూ వచ్చారనే ప్రచారం జరిగింది. ప్రతిపక్షాల హెచ్చరికలను పట్టించుకోకపోగా.. తమ ఇష్టారాజ్యంగా ప్రభుత్వాన్ని నడపడమే కాకుండా.. అధికారులతో నిబంధనలకు వ్యతిరేకంగా తప్పుడు పనులను గత వైసీపీ ప్రభుత్వం చేయించిందనే చర్చ రాష్ట్రంలో జరిగింది. దాని ఫలితంగానే ప్రస్తుతం ఎంతోమంది అధికారులు విచారణను ఎదుర్కోవల్సిన పరిస్థితి ఏర్పడిందనే చర్చ సాగుతోంది.
చివరకు ఐదేళ్ల తర్వాత ప్రజలు ఓటు ద్వారా తమ నిర్ణయాన్ని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వంపై తాము అసంతృప్తిగా ఉన్నామని తీర్పునిచ్చారు. దీంతో వైసీపీ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి ఇష్టారాజ్యంగా వ్యవహారించిన వైసీపీ నేతలకు 2024 జూన్‌లో జ్ఞానోదయం అయింది. దీంతో తమ తప్పులపై విచారణ జరిగితే ఐదేళ్ల అరాచకాలు ప్రజలకు తెలిసిపోతాయనే భయంతోనే కూటమి ప్రభుత్వంపై వైసీపీ అసత్య ప్రచారం చేయడంతో పాటు ప్రతి విషయానికి ఉలిక్కి పడుతోందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.
కాకినాడ పోర్టు విషయంలో..
కాకినాడ పోర్టు కాంట్రాక్టును అతి తక్కువ ధరకు ఓ సంస్థ దక్కించుకుందని, అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పెద్దలు తనను బెదిరించారని ఓ వ్యక్తి ఫిర్యాదుతో సీఐడీ కేసు దర్యాప్తు ప్రారంభించింది. విచారణ ప్రాథమిక దశలో ఉండగానే వైసీపీలో కొందరు ముఖ్యనేతలు బయటకువచ్చి తమకు ఏ పాపం తెలియదని, నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని చెబుతున్నారు. ఒకవేళ నిబంధనల ప్రకారం నాయకులు నడుచుకుని ఉంటే ఉలిక్కిపాటు ఎందుకు.. విచారణలో వాస్తవాలు నిగ్గుతేలతాయి కదా.. కానీ విచారణలో వైసీపీ నేతల అక్రమాలు, అరాచకాలు బయటపడకుండా ఉండేందుకే వైసీపీ నేతలు ముందుగానే విచారణపై తప్పుడు ప్రచారం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో తప్పుడు కేసులు బనాయించి, ప్రత్యర్థి పార్టీలపై కక్ష తీర్చుకున్న విధంగా ప్రస్తుత ప్రభుత్వం పనిచేస్తుందనే భ్రమల్లో వైసీపీ నేతలు ఉండి ఉంటారని, ఆ భ్రమలు తొలగించుకోవాలని కూటమి నేతలు హితవు పలుకుతున్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here