Share News

Yanamala Ramakrishna: సోషల్ మీడియాపై యనమల రామకృష్ణుడు షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Nov 15 , 2024 | 08:17 AM

కొంతకాలంగా సోషల్‌ మీడియా వేదికగా కొందరు ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా పోస్టులను పెడుతున్నారని, పత్రికల్లో వచ్చిన వార్తలను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్న సోషల్‌ మీడియాను కట్టడి చేయాలని పలువురు రాజకీయ నేతలు డిమాండ్‌ చేశారు. సోషల్ మీడియాపై మాజీ మంత్రి యనమల రామకృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు.

 Yanamala Ramakrishna: సోషల్ మీడియాపై యనమల రామకృష్ణుడు షాకింగ్ కామెంట్స్

అమరావతి: ఒకప్పుడు పత్రికలు, పుస్తకాలు, టీవీలు సమాచార మాధ్యమాలు. ఇప్పుడు సోషల్‌ మీడియా మరో ప్రత్యామ్నాయ మాధ్యమంగా మారింది. ఎవరితోనైనా సులభంగా కనెక్ట్‌ కావొచ్చు. కమ్యూనికేషన్‌ అనేది వేగంగా మారిపోయింది. ప్రధానమంత్రికి కూడా సామాజిక మాధ్యమాల ద్వారా వినతులను పంపిస్తే, తిరిగి సమాధానాలు అందుకున్న సంఘటనలను చూశాం. అయితే కొంతమంది మాత్రం సోషల్ మీడియాను తప్పుగా వాడుతున్నారు. అలాగే ఫోర్త్ ఎస్టేట్‌పై సోషల్ మీడియా తీవ్ర ప్రభావం చూపుతోంది. సోషల్ మీడియాపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్(ట్విట్టర్)లో యనమల రామకృష్ణుడు ట్వీట్ చేశారు.


అతిపెద్ద ప్రమాదం..

‘‘సోషల్ మీడియా ప్రభావంతో ఫోర్త్ ఎస్టేట్(మీడియా) వెనక సీటు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. శిక్షించేందుకు కఠినమైన చట్టాన్ని తీసుకురావడం ద్వారా సోషల్ మీడియా అసభ్యతను నిర్దాక్షిణ్యంగా అణిచివేయాలి. లేకపోతే తెలిసిన వ్యక్తిని వ్యక్తిత్వ హననాన్ని ఎవరో తెలియని వారు చేయడం అతిపెద్ద ప్రమాదంగా మారుతుంది’’ అని యనమల రామకృష్ణుడు అన్నారు.


కాగా.. కొంతకాలంగా సోషల్‌ మీడియా వేదికగా కొందరు ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా పోస్టులను పెడుతున్నారని, పత్రికల్లో వచ్చిన వార్తలను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్న సోషల్‌ మీడియాను కట్టడి చేయాలని పలువురు రాజకీయ నేతలు డిమాండ్‌ చేశారు. పత్రికల్లో ప్రచురితమైన కథనాలపై వ్యక్తిగతంగా కొందరు కావాలనే కామెంట్లు చేస్తూ ట్రోల్‌ చేస్తున్నట్లు చెబుతున్నారు. అటువంటి వారు తమ ధోరణిని మార్చుకోవాలని, లేనిపక్షంలో చట్టపరంగా కేసులు తప్పవని హెచ్చరించారు. ప్రింట్‌, ఎలక్ర్టానిక్‌ విలేకరులపై బెదిరింపులకు పాల్పడితే, అన్ని విధాలుగా ఎదుర్కొనేందుకు, ప్రతికా స్వేచ్ఛను కాపాడుకోవడం కోసం పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని పలువురు రాజకీయ నేతలు హెచ్చరించారు.


మరోవైపు.. శాసన మండలిలో సోషల్‌ మీడియా పోస్టులపై అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. రెండు రోజుల క్రితం అసెంబ్లీలో సోషల్‌ మీడియా కార్యకర్తల అరెస్టుల అంశంపై చర్చించాలని వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. డీఎస్సీపై పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. రెండింటినీ మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు తిరస్కరించారు. చర్చించాల్సిందేనంటూ వైసీపీ సభ్యులు నిరసనకు దిగారు. నినాదాలు చేస్తూ చైర్మన్‌ పోడియం వద్ద, పోడియం పైకి ఎక్కి నిరసన తెలిపారు. వేరే ఫార్మాట్‌లో రావాలని చైర్మన్‌ పదే పదే చెప్పినా వైసీపీ సభ్యులు వినలేదు. సభ్యుల నిరసనల మధ్యే చైర్మన్‌ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. మండలిలో ప్రజల సమస్యలను ప్రస్తావించాల్సింది పోయి... మహిళల పట్ల అసభ్యంగా పోస్టులు పెట్టే వారిని సపోర్టు చేస్తారా? అంటూ మంత్రులు, కూటమి ఎమ్మెల్సీలు మండిపడ్డారు.

Updated Date - Nov 15 , 2024 | 08:23 AM