AP Politics: జగన్‌కు సీనియర్ల షాక్.. అయోమయంలో వైసీపీ శ్రేణులు..!
ABN , Publish Date - Aug 28 , 2024 | 06:28 PM
తనకు సంఖ్యా బలం లేకపోయినా ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ పట్టుపడుతున్న జగన్.. తన సొంత పార్టీ నాయకులను కాపాడుకోవడంలో మాత్రం విఫలమవుతున్నారా అంటే..
తనకు సంఖ్యా బలం లేకపోయినా ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ పట్టుపడుతున్న జగన్.. తన సొంత పార్టీ నాయకులను కాపాడుకోవడంలో మాత్రం విఫలమవుతున్నారా అంటే.. ప్రస్తుత పరిస్థితులు, పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. కౌన్సిలర్లు, కార్పొరేటర్ల నుంచి మొదలుపెట్టి ఎంపీల వరకు జగన్‌కు హ్యాండిస్తున్నారు. పార్టీలో ఉండలేమంటూ రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు. కొందరు ఇతర పార్టీల వైపు చూస్తుంటే.. మరికొందరు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వైసీపీ నుంచి వలసలు ఉంటాయని ఊహించినా.. ఈ స్థాయిలో ఉంటాయని వైసీపీ నేతలు సైతం ఊహించి ఉండకపోవచ్చు. తాను ఎంతగానో నమ్మిన నేతలు సైతం జగన్ వ్యవహారశైలి నచ్చక పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. వైసీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండకపోవచ్చనే ఆలోచనతోనే ఆ పార్టీని వీడుతున్నారనే చర్చ జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం జగన్‌కు ప్రస్తుతం తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. ఎవరి మాట వినకపోవడం, ఎమ్మెల్యేలు, ఎంపీలకు తగిన గౌరవం ఇవ్వకపోవడం, నియోజకవర్గ సమస్యలను పట్టించుకోకపోవడంతో జగన్ వైఖరి నచ్చక ఎక్కువమంది నాయకులు పార్టీకి దూరమవుతున్నారట.
AP Politics: మోపిదేవి బాటలో మరో ఎంపీ..ఎవరతను
వరుస షాక్‌లు..
విశాఖపట్టణంలో భారీ సంఖ్యలో కార్పొరేటర్లు వైసీపీకి గుడ్‌బై చెప్పి.. టీడీపీ, జనసేనలో చేరిపోయారు. తాజాగా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో వైసీపీ 40 మందికి పైగా కార్పొరేటర్లతో పటిష్టంగా ఉన్నా మేయర్ కొందరు కార్పొరేటర్లతో కలిసి టీడీపీ గూటికి చేరారు. త్వరలో మరికొంతమంది టీడీపీ, జనసేనలో చేరనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా జగన్‌కు నమ్మినబంటుగా ఉండే రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ సైతం వైసీపీకి రాజీనామా ప్రకటించారు. త్వరలోనే ఆయన టీడీపీ కండువా కప్పుకోనున్నారు. ఎమ్మెల్సీ పోతుల సునీత సైతం జగన్‌కు గుడ్‌బై చెప్పారు. పార్టీలో ఇన్ని పరిణామాలు జరుగుతున్నా జగన్ మాత్రం నోరు విప్పడంలేదు. వలసలపై వైసీపీ హైకమాండ్ అసలు స్పందించడం లేదు. టీడీపీ, జనసేన గ్రీన్ సిగ్నల్ ఇస్తే చేరేందుకు వందల సంఖ్యలో వైసీపీ నాయకులు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. రానున్న రోజుల్లో మరింతమంది సీనియర్ నేతలు వైసీపీని వీడనున్నట్లు తెలుస్తోంది.
JC Asmith Reddy: కొందరు పోలీసుల తీరులో మార్పు రాలేదు..
వలసల నివారణలో..
సీనియర్ నేతలు పార్టీని వీడుతుంటే జగన్మోహన్ రెడ్డి వలసలను నియంత్రించే ప్రయత్నం చేయనట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలంగాణలో బీఆర్‌ఎస్ నుంచి ఇతర పార్టీల్లోకి నాయకులు వలస వెళ్లడం ప్రారంభించారు. బీఆర్‌ఎస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్‌లో చేరారు. వెంటనే అప్రమత్తమైన కేసీఆర్, కేటీఆర్ తాత్కాలికంగా వలసలను నియంత్రించే ప్రయత్నం చేశారు. దీంతో కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ నేతల చేరికలు భారీగా ఉంటాయని ఊహించగా.. ప్రస్తుతం అనుకున్న స్థాయిలో లేవనే చర్చ నడుస్తోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పార్టీని సీనియర్లు వదిలిపెడుతుంటే జగన్ వారితో మాట్లాడి.. వారించే ప్రయత్నం కూడా చేయడం లేదట. రానున్న రోజుల్లో ఏ స్థాయిలో వలసలు ఉంటాయి.. వైసీపీ తన పార్టీని ఎలా కాపాడుకుంటుందనేది తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.
AP Minister: మంత్రిగా తొలిసారి విశాఖకు నారా లోకేశ్
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh News and Latest Telugu News