Ap High Court : సజ్జల అరెస్టుపై మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు
ABN , Publish Date - Dec 11 , 2024 | 05:18 AM
టీడీపీ కేంద్ర కార్యాలయంపై మూకదాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డికి అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఈ నెల 24 వరకు హైకోర్టు పొడిగించింది.
అమరావతి, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): టీడీపీ కేంద్ర కార్యాలయంపై మూకదాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డికి అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఈ నెల 24 వరకు హైకోర్టు పొడిగించింది. విచారణను అదే రోజుకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కె కృపాసాగర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సజ్జల హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించి పోలీసులు లుక్‌అవుట్ సర్కులర్ జారీ చేశారంటూ సజ్జల మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు మంగళవారం విచారణకు రాగా పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది స్పందిస్తూ.. ఘటన జరిగిన రోజు పిటిషనర్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారని, ఆధారాలు సమర్పించేందుకు సమయం ఇవ్వాలని కోరారు. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు పొడిగించాలని అభ్యర్థించారు. అందుకు న్యాయమూర్తి అంగీకరించి విచారణను వాయిదా వేశారు.