CM Chandrababu: ప్రమాణస్వీకారం చేయబోనని చెప్పా.. ఆసక్తికర విషయాన్ని బయటపెట్టిన సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jun 28 , 2024 | 05:25 PM
ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిలా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో చాటి చెప్పే విషయం ఒకటి వెలుగుచూసింది. ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిలా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ (Polavaram) నిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో చాటి చెప్పే విషయం ఒకటి వెలుగుచూసింది. ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా మొదటి నుంచి ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
అందులో భాగంగా తెలంగాణలోని నాటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భాగమైన ఏడు ముంపు మండలాలను విజయవంతంగా ఏపీలో విలీనం చేయించారు. ఈ ఏడు మండలాలను ఇవ్వకపోతే ప్రాజెక్టు నిర్మాణం జరగదని భావించిన ఆయన.. ఎట్టి పరిస్థితుల్లోనూ మండలాల విలీనానికి పట్టుబట్టారు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఖరాఖండిగా చెప్పారు. విలీనం చేయకపోతే సీఎంగా తాను ప్రమాణ స్వీకారం చేయబోనని కేంద్ర పెద్దలకు చంద్రబాబు తెగేసి చెప్పారు. 2014 అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన ఈ కీలక పరిణాన్ని చంద్రబాబు ఇవాళ (శుక్రవారం) వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా ప్రస్తావించారు.
కాగా 2024 ఎన్నికల మాదిరిగా 2014లో కూడా బీజేపీ-టీడీపీ కలిసి పోటీ చేయగా జనసేన మద్దతు ఇచ్చింది. ఇక 2014-2019 మధ్యకాలంలో పోలవరం ప్రాజెక్టు పనులను చంద్రబాబు పరుగులు పెట్టారు. ప్రాజెక్టుకు సంబంధించి ప్రతి పనికి పీపీఏ, కేంద్ర జలవనరుల శాఖ నుంచి అనుమతులు తీసుకున్నారు. ప్రతి సోమవారం రివ్యూలు చేపట్టి రికార్డు స్థాయిలో పనులు చేపించారు. టీడీపీ హయాంలోనే పోలవరం ప్రాజెక్టు పనులు 72 శాతం పూర్తయ్యాయి. 5 ఏళ్ల కాలంలో ఏకంగా 28 సార్లు క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లారు. అంతేకాదు 82 సార్లు వర్చ్యువల్‌గా సమీక్షలు నిర్వహించారు. టీడీపీ 5 ఏళ్ల కాలంలో మొత్తం 72 శాతం పనులు జరగగా అందుకు రూ.11,537 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది. ఒక్క రోజులోనే స్పిల్ ఛానల్‌లో 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి నాటి ప్రభుత్వం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించింది.
రెండు కిలోమీటర్ల పొడవుతో 100 మీటర్ల పైగా లోతుతో డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టారు. స్పిల్ వే గేట్ల డిజైన్లు సిద్దం చేసి.. గేట్ల అమరిక సైతం అప్పట్లోనే ప్రారంభించారు. అప్పట్లో జల వనరుల శాఖా మంత్రులుగా ఉన్న ఉమాభారతి, నితిన్ గడ్కరీలు పోలవరం వచ్చి పనులు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
ఆంధ్రా యూనివర్సిటీని ఫక్తు రాజకీయ కేంద్రం మార్చేశారని గంటా ఫైర్
మున్సిపల్ కార్పోరేషన్‌లపై మంత్రి సమీక్ష.. రూ.14831 కోట్లు పెండింగ్
For AP News and Telugu News